నిందితులను గుర్తించడంలో పోలీసుల వైఫల్యం
డిప్యూటీ సీఎం నియోజకవర్గంలో పోలీసులకు చాలెంజ్
సామర్లకోట: డిప్యూటీ సీఎం, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గంలో దొంగతనాలతోపాటు హత్యలూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇక్కడ గత రెండేళ్లలో నాలుగు హత్యలు జరిగినా పోలీసులు వాటిని ఛేదించలేకపోవడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. దొంగతనాలకు వచ్చిన వారు హత్యలు కూడా చేయడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. సామర్లకోట చంద్రశేఖరస్వామి ఆలయం సమీపంలో బుధవారం కంచర్ల వడ్డికాసులు అనే వివాహిత హత్య జరగడంతో స్థానిక ప్రజలు ఒకసారిగా ఉలిక్కి పడ్డారు. పోలీసులకు హత్యలు చాలెంజ్‌గా మారాయి. 2013 సెప్టెంబరు 21న ప్రముఖ దేవాలయమైన శ్రీమాండవ్యనారాయణస్వామి ఆలయంలో నైట్ వాచ్‌మన్ కాదా వీరభద్రరావును దొంగలు హత్య చేసి ఆలయంలో హుండీ పగలు కొట్టారు.
ఆ కేసులో నిందితులను ఇప్పటికీ పట్టుకోలేదు. 2014 మే 18న మండల పరిధిలో వేట్లపాలెం గ్రామంలో కాళ్ల భాగ్యలక్ష్మి (56), మనవడు మణికంఠ(10) ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆ కేసు కూడా ముందుకు సాగలేదు. తాజాగా బుధవారం వివాహిత హత్య జరిగింది. ఈ హత్య కేసును ఎలాగైనా ఛేదించాలని పోలీసులు పట్టుదలతో ఉన్నారు. ఇదిలా ఉంటే పట్టణ నడిబొడ్డు మఠం సెంటర్‌లోని ఆంధ్రాబ్యాంకులో కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్న ఉద్యోగి సత్యనారాయణను సాయంత్రం సమయంలో హత్య చేసి మూడేళ్లు గడిచి పోయింది. ఆ కేసు కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందాన ఉంది. ఈ కేసుల విషయంలో హోం మంత్రి చొరవ తీసుకుని పోలీసులు నిందితులను పట్టుకునేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కరుడుగట్టిన నేరస్తుడి పనే
స్థానిక చంద్రశేఖరస్వామి ఆలయం వద్ద జరిగిన వివాహిత హత్యను కరుడుకట్టిన నేరస్తుడే చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇంట్లో ఉన్న నగదు, నగలు దోచుకు పోవడానికి యత్నించాడని, బీరువా తాళాలు ఎక్కడ ఉన్నది చెప్పకపోవడంతో కంఠాన్ని కత్తితో కోశాడని ఎస్సై ఆకుల శ్రీనివాసు భావిస్తున్నారు. చిన్న గదిలో ఉన్న బీరువాలో ఏమీ లభించకపోవ డంతో ఆమె శరీరంపై ఉన్న నగలు తీసుకుని పోయి ఉంటాడని చెబుతున్నారు. మొదట చేతిపై గాయపర్చి బెదిరించి ఉంటాడని, ఆమె బెదరక పోవడంతో హత్య చేశాడని అనుమానిస్తున్నారు. ఏదేమైనా నిందితులను పట్టుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది.
రెండేళ్లలో నాలుగు హత్యలు
Published Fri, May 1 2015 3:58 AM | Last Updated on Thu, Mar 28 2019 5:27 PM
Advertisement