గుత్తి రూరల్, న్యూస్‌లైన్ : జాతరలో ఎంతో ఆనందంగా గడిచి ఇళ్లకు తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు లారీ రూపంలో కబలించింది. గుత్తి మండలం బాట సుంకులమ్మ వద్ద మంగళవారం ఆటోను లారీ ఢీకొన్న ఘోర ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృత్యువాత పడ్డారు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని కర్నూలుకు తరలిస్తుండగా మృతి చెందాడు. పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన మేరకు... గుంతకల్లులోని సత్యనారాయణపేటకు చెందిన నెట్టికంటయ్య ఆహ్వానం మేరకు సుంకులమ్మ ఆలయంలో జాతరకు స్నేహితులు గుంతక ల్లు సోఫియా స్ట్రీట్‌కు చెందిన ఆటో డ్రైవర్లు విజయకుమార్ (35), ధర్మవరం గేట్‌కు చెందిన వెంకట్రాముడు(45), తిలక్‌నగర్‌కు చెందిన శ్రీనివాసులు(40) వెళ్లారు. వారితో పాటు వెంకట్రాముడు సోదరుడు లక్ష్మినారాయణ కూడా ఉన్నాడు. వారంతా జాతరలో సంతోషంగా గడిపారు. అనంతరం అందరూ ఆటోలో( ఏపీ21ఎక్స్ 9562) గుంతకల్లుకు బయల్దేరారు. ఆలయం వద్ద నుంచి కొద్ది దూరం వెళ్లగానే మహబూబ్‌నగర్ ట్రాన్‌సకో విభాగానికి చెందిన ఏబీఎం 3859 నంబరు లారీ వేగంగా వచ్చి ఢీకొంది.
ఈ ప్రమాదంలో విజయకుమార్, వెంకట్రాముడు, శ్రీనివాసులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఆటో నుజ్జునుజ్జు కాగా, మృతదేహాలు చెల్లాచెదరుగా పడ్డాయి. లక్ష్మినారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. సంఘటన స్థలాన్ని గుత్తి సీఐ మోహన్, ఎస్‌ఐలు కృష్ణారెడ్డి, రమణారెడ్డిలు పరిశీలించారు. లక్ష్మినారాయణను హైవే పెట్రోలింగ్ సిబ్బంది గుత్తి ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యంలో డోన్ వద్ద మృతి చెందాడు. మృతుల్లో విజయకుమార్‌కు భార్య పద్మావతి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకట్రాముడుకు భార్య ధనలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, శ్రీనివాసులుకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. లక్ష్మినారాయణ కుటుంబ సభ్యులను వైఎస్సార్‌సీపీ నాయకులు హుస్సేన్‌పీరా, సుభాష్‌రెడ్డి పరామర్శించారు.
ఆటో డ్రైవర్ విజయకుమార్ భార్య పద్మావతి రోదించిన తీరు కలచివేసింది.
దర్గాకు వెళ్లి వస్తూ.. కానరాని లోకాలకు..
గుత్తి/పెద్దవడుగూరు:పెద్దవడుగూరు మండ లం అప్పేచెర్ల వద్ద 63వ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో గుత్తిలో నివసిస్తున్న పీ.మహ్మద్ రఫీ(39) అసువులు బాసాడు.
గుత్తి మండలం బసినేపల్లి గ్రామానికి చెందిన మహ్మద్ రఫీ, మాబున్నీ దంపతులు పట్టణంలోని తాడిపత్రి రోడ్డులో నివాసముంటున్నారు. ఆయన మైన్స్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మంగళవారం భార్యాభర్తలు ద్విచక్ర వాహనంలో తాడిపత్రి వద్ద ఉన్న దర్గాకు నమాజు కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా అప్పేచెర్ల వద్ద గుత్తి వైపు నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో మహ్మద్ రఫీ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. మాబున్నీకి తీవ్ర గాయాలతో పాటు రెండు కాళ్లు విరిగాయి. మృతదేహాన్ని గుత్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మాబున్నీని కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. మహ్మద్ రఫీ టీడీపీలో క్రీయాశీలక నాయకునిగా వ్యవహరిస్తున్నాడు. నియోజకవర్గ నాయకులు ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
రోడ్డు ప్రమాదంలో నలుగురి మృతి
Published Wed, Mar 12 2014 2:36 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM
Advertisement
Advertisement