'ఆ పని చేయ్...ఈ పని చేయ్ అని చెప్పలేరు'
హైదరాబాద్ : చట్టాలపై ఆంధ్రప్రదేశ్ మంత్రులు చెపుతున్న మాటలు సరైనవి కాదని ఐపీఎస్ మాజీ అధికారి ఆంజనేయ రెడ్డి అన్నారు. సాక్షిటీవీ 'ఫోర్త్ ఎస్టేట్' కార్యక్రమంలో ఆయన గురువారం మాట్లాడుతూ ఇప్పుడు నడుస్తున్న (ఓటుకు కోట్లు) ఏసీబీ కేసుకు, సెక్షన్-8కు సంబంధం లేదన్నారు. ఏసీబీ కేసు నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి ఏపీ మంత్రులు సెక్షన్-8ను ప్రస్తావిస్తున్నారని అనుకుంటున్నానని ఆంజనేయ రెడ్డి పేర్కొన్నారు. కొన్ని అంశాలపై కేసులు మాత్రమే ఎన్నికల సంఘానికి చెప్పాల్సి ఉంటుందని, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
కేసు రిజిస్టర్ చేయడానికి, దర్యాప్తు చేయడానికి ఎవ్వరి అనుమతి అవసరం లేదని చెప్పారు. ఈ పని చేయ్, ఆ పని చేయ్ అని ముఖ్యమంత్రి...డీజీపీకి చెప్పలేరని ఆంజనేయ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసు దర్యాప్తులో గవర్నర్ కానీ, సీఎంకానీ, ఎన్నికల సంఘం కానీ జోక్యం చేసుకోలేదన్నారు. సీఆర్పీసీ ప్రకారం కేసు ఎక్కడైనా రిజిస్ట్రర్ కావొచ్చని... కాని దర్యాప్తు చేసే అధికారం నేరం జరిగే పరిధిలోని పోలీసులదే అన్నారు. విశాఖ, రాజమండ్రిల్లో కేసులు రిజిస్ట్రర్ చేసుకున్నా..వాళ్లొచ్చి దర్యాప్తు చేయలేరని ఆంజనేయరెడ్డి అన్నారు.
క్రిమినల్ కేసుల్లో నేరం ఎక్కడ జరిగిందనేది చాలా ముఖ్యమైన అంశమని మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ సత్యప్రసాద్ అన్నారు. నేరం జరిగే ప్రదేశం బట్టి..న్యాయపరిధి ఎక్కడుందనేది నిర్ణయం అవుతుందన్నారు. వేరేచోట కేసులు పెడితే చెల్లదని, ఘటనలు హైదరాబాద్లో జరిగితే... కేసీఆర్ మీద ఎక్కడెక్కడో కేసులు పెడితే..అది కరెక్ట్ కాదన్నారు. ఏసీబీకి అధికారం లేదంటూ ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. దర్యాప్తు జరక్కుండా ఎన్నికల సంఘం కూడా అడ్డుకోలేదన్నారు. ఇరత రాష్ట్రాల్లో కేసులు ఒక వ్యక్తిని బెదిరించడం కోసం చేస్తున్న ప్రయత్నం మాత్రమే అని, అది మైండ్ గేమ్ మాత్రమే అని అన్నారు.
నోటీసు తీసుకోకపోతే సంబంధింత వ్యక్తిని కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందని హైకోర్టు న్యాయవాది కైలాశ్నాథ్ రెడ్డి అన్నారు. నోటీసు ఇచ్చాక దర్యాప్తునకు సహకరిస్తే..అరెస్ట్ చేసే అవసరం కూడా లేదన్నారు. కానీ, నోటీసును ఉల్లంఘిస్తే మాత్రం కస్టడీలోకి తీసుకునే అధికారం కూడా ఉందన్నారు.