అవినీతి సొరంగం! | fraud in galeru nagari sujala sravanthi | Sakshi
Sakshi News home page

అవినీతి సొరంగం!

Published Mon, May 18 2015 1:41 AM | Last Updated on Sun, Sep 3 2017 2:14 AM

fraud in galeru nagari sujala sravanthi

⇒ అవుకులో రూ.50 కోట్ల నుంచి
⇒ రూ.60 కోట్లు కొట్టేసే వ్యూహం
⇒  కాంట్రాక్టర్‌తో సర్కారు పెద్దలు కుమ్మక్కు!

 

సాక్షి, హైదరాబాద్:  గాలేరు నగరి సుజల స్రవంతి(జీఎన్‌ఎస్‌ఎస్) ప్యాకేజ్-30లో భాగంగా చేపట్టిన అవుకు సొరంగ మార్గంలో అవినీతి ప్రవాహానికి మార్గం సుగమమైంది!. సొరంగంలోని లోపాలను సరిచేయడానికిగాను వెచ్చించే సొమ్ములో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్లు పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వంలోని పెద్దలే.. కాంట్రాక్టర్‌తో కుమ్మక్కయినట్టు తెలిసింది. సదరు పనుల కోసం రాకరాక అనుమతులు రావడంతో.. అడిగిన మొత్తాన్ని సమర్పిం చుకునేందుకు కాంట్రాక్టర్ సిద్ధమైనట్టు సమాచారం. వివరాలు..
  2007 నాటి ఒప్పందం మేరకు రూ.401.12 కోట్ల విలువైన సొరంగం పనులను అప్పటి ప్రభుత్వం ఎన్‌సీసీ మైటాస్-జెడ్‌వీఎస్(జేవీ) సంస్థకి అప్పగించింది. అయితే, జేవీ సంస్థ ఈ పనులను జీవీఆర్‌కు సబ్ కాంట్రాక్టుకు ఇచ్చింది.  
    పనులు జరుగుతున్న క్రమంలో సొరంగంలో రాళ్లు ఊడిపడుతున్నందున 50 వేల అడుగుల మేర.. సిమెంట్ పూత
 స్థానంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాలని, దీనికి అనుమతించాలని కాంట్రాక్టర్ గత మూడేళ్లుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్నారు. దీనికిగాను అదనంగా నిధులు ఇవ్వాలని కోరుతున్నారు.
 ఒప్పందం ప్రకారం ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. సదరు కాంట్రాక్టరే సొరంగాన్ని పూర్తి చేసి ఇవ్వాలి. మధ్యలో చెప్పే కారణాలతోకానీ, అదనపు నిధులు మంజూరు చేయడ ంగానీ ప్రభుత్వానికి సంబంధం లేదు. దీంతో గత ప్రభుత్వం కాంట్రాక్టర్ వినతిని పట్టించుకోలేదు. అయితే, అనూహ్యంగా చంద్రబాబు సర్కారు మాత్రం కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది. ఈ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు సమాచారం.
   దీంతో.. కాంట్రాక్టర్ తొలుత పూత వేయాల్సిన ప్రాంతం 50 వేల అడుగులని చెప్పి.. తాజాగా దానిని 1.5 లక్షల అడుగులకు పెంచేశారు. అంతేకాదు, దీనికిగాను రూ.100 కోట్లు అదనంగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఈ మొత్తాన్ని ఇచ్చేలా ఉన్నతాధికారులు సిఫార్సు చేసేశారు.
  ఉన్నతాధికారుల సిఫార్సు మేరకు ప్రభుత్వ రూ.100 కోట్లు మంజూరు చేసినా.. 1.5 లక్షల అడుగుల వైశాల్యానికి స్టీల్ ఫైబర్ పూత వేసేందుకు అయ్యే వ్యయం రూ.40 కోట్లుగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, మిగిలిన రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల సొమ్ము పక్కదారి పట్టడం ఖాయమని తెలుస్తోంది.
 అంకెల్లో..
 2007: ఒప్పందం కుదిరిన ఏడాది.
 401.12: రూ.కోట్లు సొరంగం పనుల అంచనా వ్యయం.
 
 50: వేల అడుగులు.. సొరంగంలో     
 పూతవేయాలంటూ కాంట్రాక్టర్ మొదట చెప్పింది.
 
 1.5: లక్షల అడుగులు.. సొరంగంలో పూతవేయాలంటూ కాంట్రాక్టర్ ఇప్పుడు చెబుతున్న కథ.
 
 100: రూ.కోట్లు అదనంగా ఇవ్వాలని కాంట్రాక్టర్ అడిగింది.
 
 40: రూ.కోట్లు ఆయా పనులకు నిజంగా అయ్యే వ్యయం!
 
 50-60: రూ.కోట్లు కాంట్రాక్టరు, పెద్దలు కుమ్మక్కై పంచుకునే సొమ్ము!

 విషయం: అవుకు సొరంగంలో రాళ్లు
 ఊడిపడకుండా స్టీల్ ఫైబర్ పూతకు అనుమతించాలంటూ సర్కారుకి కాంట్రాక్టర్ వినతి.
 ఒప్పందంలో ఉందా?: లేదు. 2007 నాటి ఒప్పందం మేరకు ఎలాంటి పూత
 వేయాలన్నా కాంట్రాక్టర్‌దే బాధ్యత.
 
 సర్కారు ఏమంది?: గత ప్రభుత్వం ఒప్పుకోలేదు. చంద్రబాబు సర్కారు ‘సై’ అంటోంది.
 ఎవరికి లాభం?: కాంట్రాక్టర్‌కు.. ఆయనకు సహకరిస్తున్న సర్కారు పెద్దలకు.
 భారం:   ప్రజాధనం రూ.100 కోట్లు.
 అవినీతి: రూ.50 కోట్లు-రూ.60 కోట్లు?
 
 మూరెడు.. బారెడైంది.. ఎందుకు?

 సొరంగంలో స్టీల్ ఫైబర్ లైనింగ్ చేయాల్సిన వైశాల్యం 50 వేల అడుగులని ఆరేడు నెలల క్రితం కాంట్రాక్టర్ స్పష్టంగా పేర్కొన్నారు. దీనికి సంబంధించి అంగీకారం కోరుతూ.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కానీ.. ఇటీవల సమర్పించిన ప్రతిపాదనల్లో.. ఈ విస్తీర్ణాన్ని ఏకంగా 1.5 లక్షల అడుగులకు పెంచారు. ఇంత భారీస్థాయిలో విస్తీర్ణం ఏవిధంగా పెరిగిందో కనీసం వివరించే పనికూడా చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

 వారు కోరారు.. వీరు తలూపేశారు!!
 కాంట్రాక్టర్ చెబుతున్న విధంగా సొరంగంలో రాళ్లు ఊడిపడే వైశాల్యం వాస్తవంగా ఎంత ఉందనే విషయాన్ని అధికారులు కనీస పరిశీలన కూడా చేయలేదు. కాంట్రాక్టర్ ఇచ్చిన ప్రతిపాదనను యథావిధిగా సబంధిత సీఈ ప్రభుత్వానికి సమర్పించారు. దీనికి ఉన్నతాధికారులూ తలూపేశారు. కాంట్రాక్టర్ అడిగినంత ఇవ్వాలని, ప్రతిపాదనలకు యథావిధిగా ఆమోదం తెలపాలని రాష్ట్రస్థాయి స్టాం డింగ్ కమిటీకి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి సూచించడం గమనార్హం.

 కొసమెరుపు!:  ప్రతిపాదనను యథావిధిగా ఆమోదించాలని అధికారులు రాసేస్తే, రాష్ట్రస్థాయి స్టాండింగ్ కమిటీ ఉండడం ఎందుకని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement