ఏపీలో సీటు.. ముంబైలో ‘తర్ఫీదు’
పీజీ మెడికల్ ఎంట్రన్స్‌లో గోల్‌మాల్ తీరిది..
ప్రశ్నపత్రాన్ని ముందుగానే దొరకబుచ్చుకున్న దళారులు
ఎంపిక చేసుకున్న పీజీ ఎంట్రన్స్ అభ్యర్థులకు అమ్మకం..
ఒక్కొక్కరి నుంచి రూ.కోటి వసూలు!
అభ్యర్థుల ఎంపికలో కొందరు ప్రొఫెసర్ల సహకారం
సాక్షి, హైదరాబాద్: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 2న జరిగిన పీజీ మెడికల్ ప్రవేశ పరీక్షలో జరిగిన అవకతవకలకు దళారులు ముంబై, గోవాలను కేంద్రంగా చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఒక్కో సీటును కోటి రూపాయలకు అమ్ముకున్నట్లు సమాచారం. ప్రశ్నపత్రాన్ని ముందుగానేదొరకబుచ్చుకున్న దళారులు.. వాటిని అభ్యర్థులకు అమ్ముకున్నారు. సోమాజిగూడలోని ఓ విద్యా సంస్థతోపాటు ఇద్దరు దళారుల ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడిచినట్లు తెలిసింది. విశ్వసనీయవర్గాల కథనం ప్రకారం.. పీజీ వైద్య ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రాలను దళారులు ముందుగానే సంపాదించారు. ఎంపిక చేసుకున్న కొందరు అభ్యర్థులకు వారు కోరుకున్న సబ్జెక్టు ప్రశ్నపత్రాలను అందించారు. అభ్యర్థుల ఎంపికకు కొందరు ప్రొఫెసర్ల సహకారం తీసుకున్నారు. పీజీలో చేరేది ఎవరు, డబ్బు కట్టగలిగిన వారెవరు తదితర వివరాలను సేకరించారు. తర్వాత ఆ విద్యార్థులను సంప్రదించారు. డబ్బులు కట్టిన విద్యార్థులను రాష్ర్టంలో ఉంచి చదివిస్తే వ్యవహారం బయటకు పొక్కుతుందనే భావనతో, వారిని ముంబై, గోవాలకు తరలించారు. అభ్యర్థులను గ్రూపులుగా విభజించి, వారు ఎంచుకున్న సబ్జెక్టు ప్రశ్నపత్రాలను అందించారు. గత నెల 24 నుంచి 27 వరకు అక్కడే ‘తర్ఫీదు’ ఇచ్చారు. 28న స్వస్థలాలకు తిరిగి పంపించారు. ఆర్థోపెడిక్‌కి అయితే 170 ప్రశ్నలు, రేడియాలజీకి అయితే 180 ప్రశ్నలు, జనరల్ మెడిసిన్‌కు అయితే 150 ప్రశ్నలు.. ఇలా సబ్జెక్టును అనుసరించి ప్రశ్నలిచ్చి తర్ఫీదు ఇచ్చారు. సాధారణంగా పీజీ వైద్య ప్రవేశ పరీక్షలో ఇతర రాష్ట్రాల్లో చదివిన వారు, ఇతర దేశాల్లో చదివిన వారికి (నాన్‌లోకల్స్‌కు) ఒకటీ రెండుకు మించి వంద లోపు ర్యాంకులు రావు. కానీ ఈ ఏడాది 18 ర్యాంకులు వారివే ఉన్నాయి. అందులోనూ ప్రశ్నపత్రం చాలా కఠినంగా ఉంది. 57 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానికేతరులు ఇన్ని ర్యాంకులు సాధించడంపై అనుమానాలు తలెత్తాయి. దీంతో అసలు వ్యవహారం బయటపడింది.
ప్రశ్నపత్రం లీక్ అంత సులువు కాదు!
పీజీ మెడికల్ ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం అంత సులువుగా బయటకు రాదు. ప్రశ్నల కూర్పునకు ఏడుగురు సభ్యుల కమిటీ ఉంటుంది. ఈ కమిటీ ప్రవేశ పరీక్షకు ఆరు నెలల ముందు నుంచే దేశవ్యాప్తంగా వివిధ యూనివర్శిటీలు, ప్రొఫెసర్ల నుంచి వందలాది ప్రశ్నలు సేకరిస్తుంది. వీటిలో నుంచి కొన్ని ప్రశ్నలను ఎంచుకొని, ఏడుగురూ విడివిడిగా ప్రశ్నపత్రాలు తయారుచేస్తారు. ఒకరిచ్చిన ప్రశ్నలు మిగతా వారికి తెలియదు. ఈ ప్రశ్నపత్రాలు యూనివర్శిటీ వైస్ చాన్సలర్ వద్దకు వెళ్తాయి. వీటిని అత్యంత జాగ్రత్తగా నిక్షిప్తం చేస్తారు. వీటిని రహస్యంగా ముద్రించి, అత్యంత భద్రత నడుమ పరీక్ష కేంద్రాలకు పంపిస్తారు. మొత్తం ప్రశ్నలు ఏమిటనేది వీసీకి మినహా ఎవరికీ తెలిసే అవకాశం లేదు.
పరీక్ష హాలులో అవకతవకలకు అవకాశమే లేదు
2010కి ముందు జరిగిన పీజీ ప్రవేశ పరీక్షల్లో పరీక్ష హాల్లోనే అవకతవకలు జరిగాయని అనేకమార్లు ఆరోపణలు వచ్చాయి. అభ్యర్థులు చాలా ప్రశ్నలు రాయకుండా వదిలేస్తున్నారని, ఈ ప్రశ్నలకు జవాబులు ఇన్విజిలేటర్లే రాస్తున్నారన్న ఆరోపణలుండేవి. దీంతో అధికారులు ఓ కమిటీని వేశారు. పరీక్ష రాసిన అనంతరం జవాబుపత్రం చివరలో ఎన్ని ప్రశ్నలకు జవాబులు రాశారు, ఎన్నిటికి రాయలేదన్న విషయాన్ని ప్రశ్న వరుస అంకెలతో సహా రాయాలని, అక్కడే అభ్యర్థితో పాటు ఇన్విజిలేటరూ సంతకాలు చేయాలని ఆ కమిటీ సూచించింది. కీ ఇవ్వాలని కూడా సూచించింది. ఈ సిఫార్సుల అమలుతో పరీక్ష హాల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్‌కు తావులేకుండా పోయింది. దీంతో దళారులు ప్రశ్నపత్రాన్ని సంపాదించి, అభ్యర్థులకు తర్ఫీదు ఇచ్చారని అధికారులు అంటున్నారు.
పీజీ మెడికల్ పరీక్షపై విచారణకు గవర్నర్ ఆదేశం
ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో పీజీ వైద్య విద్యలో డిగ్రీ, డిప్లొమా కోర్సులకు జరిగిన ప్రవేశ పరీక్షలో జరిగిన అక్రమాలపై విచారణకు గవర్నర్ ఆదేశించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొ.వేణుగోపాల్‌రెడ్డిని విచారణాధికారిగా నియమించారు. వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పీజీ మెడికల్ ప్రవేశపరీక్షలో అక్రమాలు జరిగాయని, వీటిపై విచారణ జరిపించాలని పలు విద్యార్థి సంఘాలు, జూనియర్ వైద్యుల సంఘం ప్రతినిధులు మంగళవారం గవర్నర్‌ను కోరారు. ఒక్కో సిటు కోటి రూపాయలకు అమ్ముకున్నారని ఫిర్యాదు చేశారు. దీనివల్ల అర్హతలున్న వారు సీట్లు కోల్పోయారని తెలిపారు. ఈ పరీక్ష రద్దు చేసి తిరిగి పరీక్ష నిర్వహించాలని కోరారు. దీంతో గవర్నర్ విచారణకు ఆదేశించారు. వచ్చే నెల 15 నుంచి పీజీ కౌన్సెలింగ్ జరగనున్నందున, ఈ లోగానే విచారణ పూర్తి చేయాలని జూడాలు కోరుతున్నారు.
అక్రమార్కులు
Published Wed, Mar 19 2014 1:29 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement