
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్
మళ్లీ పరీక్ష నిర్వహించాలని గవర్నర్ నరసింహన్ ఆదేశం
సాక్షి, హైదరాబాద్ : పీజీ వైద్య ప్రవేశ పరీక్ష రద్దయింది. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం నిర్వహించిన ఈ పరీక్షలో అవకతవకలు, అవినీతి చోటు చేసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి. దీనిపై గవర్నర్ నరసింహన్ సీఐడీ విచారణకు ఆదేశించారు. ఆరోపణలు నిజమని సీఐడీ విచారణలో తేలడంతో గత నెల 2వ తేదీన జరిగిన ఈ పరీక్షను గవర్నర్ నరసింహన్ బుధవారం రద్దు చేశారు. మళ్లీ పరీక్ష నిర్వహించాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు మూడు వారాలు గడువు కావాలని వైద్య ఆరోగ్య శాఖ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అధికారులు కోరినట్టు తెలిసింది. అంటే ఈ నెల 23 నుంచి 25 మధ్య పరీక్ష నిర్వహించాలని తొలుత భావించారు. అయితే 27వ తేదీ ఆదివారం అయినందున, ఆరోజు నిర్వహిస్తే బాగుంటుందని భావిస్తున్నారు. పరీక్ష తేదీని ఒకట్రెండు రోజుల్లో ప్రకటించే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మే 10లోగా ఫలితాలు వెల్లడించి, 20 నాటికి తొలివిడత కౌన్సెలింగ్ ప్రారంభించాలని అధికారులు బుధవారం నిర్ణయించినట్టు తెలిసింది. భారతీయ వైద్య మండలి (ఎంసీఐ) ఇచ్చిన గడువు ప్రకారం జూలై 7 లోగా మూడో విడత కౌన్సెలింగ్ కూడా పూర్తి చేయాలి. అంటే మే, జూన్, జూలై నెలల్లో మూడు కౌన్సెలింగ్‌లు పూర్తి చేయాల్సి ఉంటుంది.
పాత దరఖాస్తులతోనే పరీక్ష : వీసీ రవిరాజు
పీజీ వైద్య ప్రవేశ పరీక్షకు కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం ఉండదని, పాత దరఖాస్తులనే పరిగణనలోకి తీసుకుంటామని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ డా.రవిరాజు తెలిపారు. హాల్‌టికెట్లు కూడా పాతవే ఉంటాయా లేక కొత్తగా జారీ చేయాలా అనే విషయాన్ని గురువారం లేదా శుక్రవారం నిర్ణయిస్తామని అన్నారు. పాత హాల్‌టికెట్లతోనే పరీక్ష నిర్వహిస్తే, ప్రస్తుతం స్కామ్‌లో నిందితులుగా ఉన్న వాళ్లు కూడా మళ్లీ పరీక్ష రాయవచ్చా అని అడగ్గా.. వారిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదని, ఉన్నతాధికారుల నిర్ణయం మేరకు వ్యవహరిస్తామని తెలిపారు.
ప్రశ్నల వేటలో అధికారులు
పీజీ వైద్య ప్రవేశ పరీక్ష రద్దు కావడంతో మళ్లీ పరీక్ష నిర్వహణకు వర్సిటీ అధికారులు ప్రశ్నల వేటలో పడ్డారు. గురువారం నుంచి వారు కొత్త ప్రశ్నపత్రం కూర్పుపై కసరత్తు చేయనున్నారు. గతంలో వివిధ యూనివర్సిటీలు, ఎయిమ్స్, పీజీఐ చండీఘర్ లాంటి సంస్థల నుంచి వచ్చిన వందలాది ప్రశ్నలు ఇంకా ఉన్నాయి. వీటి నుంచి 200 ప్రశ్నలు ఎంపిక చేస్తారా లేక కొత్తగా ప్రశ్నలను సేకరిస్తారా అన్నది ఇంకా తేలలేదు. అయితే ప్రశ్నలు మళ్లీ సేకరించడం వల్ల తీవ్ర జాప్యం అవుతుంది కాబట్టి పాత ప్రశ్నల్లోనే కొన్నింటితో ప్రశ్నపత్రం తయారు చేసే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈసారి ప్రశ్నల సేకరణ, ముద్రణ అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ అధికారులు నిర్ణయించారు. పరీక్షల నిర్వహణకు సచివాలయం నుంచి ఒక ప్రత్యేక అధికారిని నియమించే అవకాశమున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఎన్టీఆర్ వర్శిటీకి మచ్చ
1986లో ఏర్పాటైన ఎన్టీఆర్ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయానికి పీజీ వైద్య ప్రవేశ పరీక్ష స్కామ్ మాయని మచ్చ అయింది. గతంలో వివిధ ఆరోపణలతో కౌన్సెలింగ్ రద్దయిన సందర్భాలున్నాయి. రిజర్వేషన్లు సరిగా పాటించలేదని, ర్యాంకుల కేటాయింపులో లోపాలున్నాయని విద్యార్థులు గొడవకు దిగడంతో గతంలో కౌన్సెలింగ్ రద్దు చేశారు. అయితే, ప్రవేశ పరీక్షలో అవినీతి జరిగి, పరీక్ష రద్దవడం ఇదే తొలిసారి. వైద్య విద్యలో ఇంతటి భారీ కుంభకోణం జరగడం కూడా ఇదే తొలిసారి.