మంచిర్యాల మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో బినామీలు | fraud in muncipal complex | Sakshi
Sakshi News home page

మంచిర్యాల మున్సిపల్ కాంప్లెక్స్‌ల్లో బినామీలు

Published Fri, Nov 8 2013 1:53 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM

fraud in muncipal complex

 సాక్షి, మంచిర్యాల :
 మంచిర్యాల పురపాలక సంఘం పరిధిలో రెండు కాంప్లెక్స్‌లు ఉన్నాయి. మున్సిపల్ కార్యాలయం పక్కనే ఉన్న కాంప్లెక్స్‌లో 31 షెట్టర్లు, మార్కెట్ ఏరియాలోని కాంప్లెక్స్‌లో 29 షెట్టర్లు ఉన్నాయి. వీటిని అద్దెకు ఇవ్వడం ద్వారా బల్దియాలకు ప్రతినెలా రూ.2.34 లక్షల ఆదాయం సమకూరుతోంది. రోడ్డుపై ఉన్నా, గల్లీలో ఉన్న దుకాణాలను బట్టి మున్సిపల్ అధికారులు ప్రాథమిక కిరాయి నిర్ణయిస్తారు. మూడేళ్ల నిర్వహణ గడువుతో టెండర్లు నిర్వహించి, అధికంగా టెండర్ కోడ్ చేసిన వారికి దుకాణాలు లీజుకు ఇస్తారు.
 
 పలుకుబడి ఉంటే దుకాణం పక్కా
 మంచిర్యాల మున్సిపల్ కాంప్లెక్స్‌లలో పలుకుబడి ఉన్న వాళ్లకే దుకాణాలు దక్కుతున్నాయి. మాజీ కౌన్సిలర్లు, బడా రాజకీయ నాయకులు టెండర్‌లలో పాల్గొని తక్కువ ధరకు దుకాణాలు కైవసం చేసుకుంటున్నారు. తర్వాత బయటి వ్యక్తులకు అధిక కిరాయికి ఇచ్చి సొమ్ము చేసుకుంటున్నారు. కానీ వేలం పాటలో ఖరారైన అద్దె మాత్రమే మున్సిపాలిటీకి చెల్లించి మిగిలిన డబ్బులు జేబులో వేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం.. ఓ వ్యక్తి దుకాణం దక్కించుకున్న తర్వాత అతడే ఆ షాపును నిర్వహించాలి. కానీ ఒకరు వేలం పాటలో పాల్గొని షాపును ఇతరులకు కిరాయికి ఇస్తున్నారు. ఈ విషయం అధికారులకు తెలిసినా తమకు కేవలం అద్దెతోనే మతలబు అనంటూ ‘మామూలు’గా తీసుకుంటున్నారు.
 
  ప్రస్తుతం రెండు మున్సిపల్ కాంప్లెక్స్‌లలో ఉన్న 60దుకాణాలుకు ప్రతి నెలా రూ. 2,34,500 చొప్పున ఏడాదికి రూ.28.14 లక్షల కిరాయి వస్తుంది. కానీ టెండర్లు దక్కించుకున్న బినామీలు మాత్రం ప్రతి నెల ఏరియా దుకాణాన్ని బట్టి రూ.3 వేల నుంచి రూ.10 వేల వరకు కిరాయి వసూలు చేస్తున్నారు. సగటున ప్రతి దుకానానికి నెలకు రూ.5వేల చొప్పున లెక్కిస్తే.. 60 దుకాణాలపై రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. కానీ మున్సిపాలిటీకి చెల్లిస్తుంది రూ.2.34లక్షలు మాత్రమే. ఇప్పటికైనా అ ధికారులు స్పందించి బినామీలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
 
 దీని మతలబమేమిటీ?
 మున్సిపల్ కార్యాలయానికి ఆనుకుని ఉన్న కాంప్లెక్స్‌లో ఖాళీగా ఉన్న 1, 2, 13, 21, 22, 25, 29 దుకాణాలకు వేలం నిర్వహించేందుకు గత నెల 24న అధికారులు టెండర్ ప్రకటించారు. అదేనెల 31న వేలం నిర్వహించారు. నిబంధనల ప్రకారం.. టెండర్‌లో అధిక మంది పాల్గొనేలా ముందుగా పత్రికల్లో నోటీసు ప్రచురించాలి. కానీ అధికారులు మాత్రం చిన్న పత్రికల్లో టెండరు ప్రకటన ఇచ్చి వేలం నిర్వహించారు. దీంతో టెండర్‌లలో ఏడు దుకాణాలకు కేవలం 14 మంది మాత్రమే పాల్గొనడం, పోటీదారులు కూడా వీరి సన్నిహితులు కాావడం గమనార్హం. వీరిలో ముగ్గురు ఒకే కుటుంబం, మరో ఇద్దరు ఇంకో కుటుంబం నుంచి పాల్గొన్నారు. వీరందరికీ దుకాణాలు దక్కాయి. ప్రభుత్వం వేలం పాట ధర ప్రతి దుకాణానికి రూ.5 వేలు ఉంటే.. ఎవరూ ఆపైనా పాట పడలేదు. టెండర్ విషయం ప్రజలకు తెలియకపోవడంతో 14 మంది మాత్రమే వేలం పాటకు హాజరయ్యారు. దీంతో మున్సిపల్ ఆదాయానికి గండి పడింది.
 
  మెయిన్ రోడ్డుపై ఉన్న 1, 2 షాపులకు మాత్రమే నెలకు రూ.5,600, రూ.5,650 కిరాయితో షాపులు దక్కించుకున్నారు. 13వ నంబర్ దుకాణం రూ.1,700, 21వ నంబరు దుకాణం రూ.3,200, 22వ నంబర్ దుకాణం రూ.3,250, 25వ నంబర్ దుకాణం రూ.2,200, 29వ నంబర్ దుకాణం రూ.2,250 కిరాయితో కైవసం చేసుకున్నారు. మంచిర్యాల వంటి అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో కమర్షియల్ కాంప్లెక్స్‌లో దుకాణం దొరకడమే కష్టం. కానీ ఇంత తక్కువ అద్దెతో షాపులు కేటాయించడం వెనక అధికారుల మతలబు వారికే తెలియాలి. వాస్తవానికి టెండర్ నోటిఫికేషన్ సర్య్యూలేషన్ ఉన్న మరో పత్రికలో ప్రచురించి విస్తృత ప్రచారం కల్పించాలి. అప్పుడే వేల ం పాటకు పోటీ ఎక్కువగా ఉండి మున్సిపల్ ఆదాయం సమకూరేది. మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ వెంకన్నను వివరణ కోరాగా.. కుటుంబంలో ఎంత మంది ఉన్నా అందరూ టెండర్లు దాఖలు చేసి వేలం పాటలో పాల్గొనవచ్చన్నారు. కానీ ఒకరి పేరు మీద ఒక దుకాణం మాత్రమే కేటాయిస్తామన్నారు. బినామీల గురించి వివరణ కోసం ప్రయత్నిస్తే స్పందించలేదు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement