
ముద్దనూరు మండలానికి చెందిన బాలవెంకటన్న కొత్తగా బోరు తవ్వించుకున్నాడు. ఏడాది కిందట వ్యవసాయ ఉచిత విద్యుత్ సర్వీసు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విద్యుత్‌శాఖ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. బోరు బావిలో నీరుండి పంటలు పండించుకోలేని స్థితిలో ఉన్నానని తీవ్ర ఆందోళన చెందుతున్నాడు. ఈ పరిస్థితి ఒక్క బాలవెంకటన్నదే కాదు.. వ్యవసాయ సర్వీసుల కోసం దరఖాస్తు చేసుకుని సంవత్సర కాలంగా వేచి చూస్తున్న రైతులు జిల్లాలో ఎందరో ఉన్నారు.
కడప అగ్రికల్చర్: రైతులకు మేం చేసినంత సాయం ఏ ప్రభుత్వం చేయలేదని పదే పదే వేదికలెక్కి సీఎం, వ్యవసాయ, విద్యుత్‌శాఖామంత్రి చెబుతున్నారు.అయితే క్షేత్రస్థాయిలో పథకాలు సరిగా అందడంలేదని రైతు సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. వ్యవసాయ ఉచిత విద్యుత్‌ను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉన్నతాశయంతో ప్రవేశపెట్టి రైతుల కళ్లలో వెలుగు నింపారు. అలాంటి పథకానికి టీడీపీ ప్రభుత్వం మంగళం పాడేలా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన రైతుల దరఖాస్తులకు మాత్రమే ఈ ఏడాది కనెక్షన్లు ఇస్తున్నారు.అదే ఏడాదిలో దరఖాస్తులు చేసుకున్న ఇతర వర్గాల రైతులకు ఎప్పుడు కనెక్షన్లు ఇస్తారని రైతు సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి సబ్‌ప్లాన్‌లో 7,223 సర్వీసులకు కనెక్షన్లు ఇచ్చారు. వచ్చిన దరఖాస్తుల్లో ఇంకా 3,821 పెండింగ్‌లో ఉన్నాయి.
పెరిగిన విద్యుత్ వినియోగం
జిల్లాలో 50 వేల ఎకరాల్లో ఉన్న ఉద్యాన పంటల సాగు నేటికి 1.10 లక్షల ఎకరాలకు చేరుకుంది. పండ్లతోటలు, కూరగాయల సాగు పెరిగింది. బోరుబావుల కింద వ్యవసాయ పంటల సాగు కూడా పెరుగుతోంది. గతంలో జిల్లాలో వ్యవసాయానికిగాను 80 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా వీటి కింద 95,674 కనెక్షన్లు ఉండేవి.వీటి పరిధిలో రోజుకు 8.15 మిలియన్ యూనిట్ల వినియోగం ఉండేది. ఇప్పుడు జిల్లాలో మొత్తం 97 వేల ట్రాన్స్‌ఫార్మర్లు ఉన్నాయి. వీటి పరిధిలో 1,53,443 కనెక్షన్లు ఉన్నాయి. వీటికి గాను రోజుకు 11.17 మిలియన్ యూనిట్ల వినియోగం ఉంటోంది. దాదాపు రోజు జిల్లాకు సరఫరా చేసే దాంట్లో 38 శాతం వ్యవసాయానికి గతంలో అవసరం ఉండేది. ఇప్పుడు పెరిగిన సాగు విస్తీర్ణం దృష్ట్యా వినియోగం 43 శాతానికి చేరుకుంది. అంటే ఒక రోజుకు 4.3 మిలియన్ యూనిట్లు పైబడి అవసరమవుతోంది. ఇంత మొత్తంలో సరఫరా చేయడం కష్టం గా ఉందని ప్రభుత్వం భావించినట్లు సమాచారం.
3821 వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్
జిల్లాలో ఆరు విద్యుత్ డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో కొత్త సర్వీసుల కోసం 11,044 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌లో 7223 దరఖాస్తులకు అధికారులు కనెక్షన్లు ఇచ్చారు. ఇంకా 3821 దరఖాస్తులకు ఇవ్వాల్సి ఉంది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం నేపథ్యంలో కనెక్షన్లు ఇవ్వకపోతే నీరుండి పంటలు పండించుకోలేకపోతున్నామని దరఖాస్తుదారులు పలుసార్లు అధికారులను కలిసి విన్నవిస్తున్నారు. వ్యవసాయ కనెక్షన్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా నిధుల కొరత వేదిస్తున్నట్లు అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. ఖరీఫ్ సీజన్ పోయిందని, కనీసం రబీ సీజన్‌లోనైనా కనెక్షన్లు ఇస్తే నగదు పంటలు పండించుకుంటామని అన్నదాతలు అంటున్నారు.
నిధుల కొరతే ప్రధాన కారణం..
ఒక సర్వీసు ఇవ్వాలంటే 3 స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, 180 మీటర్లు వైర్లు, ఇతర సామగ్రి కలిపి రూ. 80 వేలు ఖర్చవుతుందని అధికారులు చెబుతున్నారు. ఉచిత విద్యుత్ నేపథ్యంలో ఈ ఖర్చును విద్యుత్‌శాఖ భరిస్తోంది. ఈ లెక్కన 11,044 కనెక్షన్లు ఇవ్వాలంటే రూ.88.35 కోట్లు పైగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ఇంత మొత్తం భరించడం డిస్కంకు తలకు మించిన భారం అవుతోంది. ప్రభుత్వం విద్యుత్ సంస్థకు గతంలో ఇవ్వాల్సిన సబ్సిడీ కూడా ఇవ్వకపోవడంతో ఖర్చులు తడిసిమోపెడవుతున్నాయి. నిధులు ఇస్తేనే పెండింగ్ కనెక్షన్లకు మోక్షం కలుగుతుంది. ప్రభుత్వం ఇవ్వకపోతే ఇప్పట్లో ఇచ్చే సమస్యలేదని విద్యుత్‌శాఖ అ«ధికారులు రైతుల వద్ద తెగేసి చెబుతున్నారు.
ఉచిత విద్యుత్ మంగళానికి రంగం సిద్ధం
జిల్లాలో వ్యవసాయానికి ఉచిత çసర్వీసులకు సంబంధించి కడప డివిజన్‌లో 9,800 సర్వీసులు, పులివెందుల డివిజన్‌లో 22,985 సర్వీసులు, ప్రొద్దుటూరు డివిజన్‌లో 20,450 సర్వీసులు, మైదుకూరు డివిజన్‌లో 37879 సర్వీసులు, రాజంపేట డివిజన్‌లో 36348 సర్వీసులు, రాయచోటి డివిజ న్ 25981 సర్వీసులున్నాయి. 2004లో ఈ సర్వీసులన్నింటీకి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఉచిత విద్యుత్ పధకాన్ని అందించారు. అప్పటి నుంచి ఇప్పటì వరకు సర్వీసు చార్జీల కింద ఒక్కో సర్వీసుకు రూ.40లు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ సర్వీసులకు ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతోందని, దీన్ని భరించడం సాధ్యం కాదని తెలుగుదేశం ప్రభుత్వం మంగళం పాడేందుకు రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. రైతులకు ఎంత మేలు చేసినా తక్కువేనని, రైతులేనిది రాజ్యం లేదని, మా పార్టీ అధికారంలోకి రాగానే ఉచిత విద్యుత్‌ను మరింత సరళతరం చేస్తామని చంద్రబాబునాయుడు ఎన్నికల సభల్లో చెప్పారని, ఆ దిశగా చర్యలు చేపట్టకుండా ఉచిత విద్యుత్‌ను పూర్తిగా ఎత్తివేసేందుకు కుట్ర పన్నుతున్నారని రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment