పండుగ సాకుతో దండుడు
సాక్షి, రాజమండ్రి :వేసవి సెలవుల అనంతరం పిల్లలకు లభించే పెద్ద ఆటవిడుపు దసరా సెలవలే. పదిరోజుల వరకూ ఉండే ఈ వ్యవధిలో తల్లిదండ్రులూ వెసులుబాటు చేసుకుని పండుగ ప్రయాణాలకు సన్నద్ధమవుతారు. అదిగో.. ఆ రద్దీనే అవకాశంగా మార్చుకుని సొమ్ము చేసుకుంటున్నాయి రవాణా సంస్థలు. ఈ లాభాలవేటలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లూ, ఆర్టీసీ వారూ పోటీ పడుతున్నారు.ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా రేట్లు వసూలు చేస్తుండగా, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల పేరుతో టిక్కెట్ ధరలు పెంచేస్తోంది. జిల్లా మీదుగా పలు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నా వాటికి సంబంధించిన రిజర్వేషన్‌లు ఎన్నడో అయిపోయాయి. జిల్లాలోని రాజమండ్రి, కాకినాడ, సామర్లకోట స్టేషన్లకు కేటాయించిన బెర్తులు, సీట్లు 60 రోజుల ముందే భర్తీ అయ్యాయి. దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌కు కాకినాడ నుంచి ఆరు, విశాఖ నుంచి మూడు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. శనివారంతో వీటిలో సీట్లు కూడా అయిపోయాయి. దీంతో జిల్లా వాసులకు కేవలం బస్సు ప్రయాణమే దిక్కవుతోంది.
హైదరాబాద్‌కు నాన్ ఏసీ చార్జి రూ.1500
రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు మామూలుగా రూ.600 నుంచి రూ.800 వరకు చార్జి చేసే ప్రైవేట్ బస్సుల వారు పండుగ రద్దీ సాకుతో రూ.1000 నుంచి రూ.1200 వరకు వసూలు చేస్తున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన వాళ్ల నుంచి అదే అవకాశంగా నాన్ ఏసీ బస్సు టిక్కెట్‌కే రూ.1500 వసూలు చేస్తున్నట్టు ఓ ప్రైవేట్ బస్సు నిర్వాహకుడే చెప్పారు. కండిషన్ సరిగ్గా లేని బస్సులను సైతం పండుగ స్పెషల్ సర్వీసులుగా నడుపుతూ వాటికి కూడా స్పెషల్ రేట్లు వసూలు చేస్తున్నారు. విశాఖపట్నం నుంచి వచ్చే వాటితో కలిపి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు సుమారు 60 బస్సులను ప్రైవేట్ ఆపరేటర్లు తిప్పుతున్నారు. వీటి నుంచే పండుగ పేరుచెప్పి అదనంగా దండుకునేందుకు చూస్తున్నారు. రద్దీని బట్టి అప్పటి కప్పుడు ఖాళీగా ఉన్న టూరిస్టు సర్వీసులను సిద్ధంచేసి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బస్సులు కాదు.. చార్జీలే ప్రత్యేకం
కాగా ఆర్టీసీ జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు మామూలుగా నడిపే సర్వీసులతో పాటు పండుగ సందర్భంగా మొత్తం వంద ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇవి శనివారం నుంచి అక్టోబర్ ఒకటి వరకూ కాకినాడ, అమలాపురం, రాజమండ్రి ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు నడుస్తాయి. తిరిగి రెండు నుంచి ఆరు వరకూ అదే సంఖ్యలో ప్రత్యేక సర్వీసులు హైదరాబాద్ నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలకు నడుస్తాయి. ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే వారిపై ఆర్టీసీ అదనపు భారం మోపుతోంది. ప్రస్తుతం ఉన్న చార్జికి 50 శాతం అదనంగా వసూలు చేస్తోంది. రాజమండ్రి నుంచి హైదరాబాద్‌కు ప్రస్తుతం సూపర్ లగ్జరీ చార్జి రూ.441 కాగా స్పెషల్ సర్వీసుల్లో రూ.660 వరకూ ఉంటోంది. కాగా జిల్లా సర్వీసులుగా తిరిగే బస్సుల్లోనే కొన్నింటిని ఆర్టీసీ విజయవాడ, విశాఖలకు ప్రత్యేక బస్సులుగా మళ్లిస్తోంది. ప్రయాణికుల రద్దీని బట్టి అప్పటికప్పుడు నడుపుతున్న ఈ ప్రత్యేక సర్వీసులకూ అదనపు చార్జీలనే వసూలు చేస్తోంది.