అమరావతి వాసులకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయే నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరికీ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లందరికి తెల్ల, పింక్ రేషన్ రేషన్ కార్డు అన్న తారతమ్యం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వైద్య సదుపాయం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నారు.
ఎన్టీఆర్ వైద్య సేవ స్కీములో ఉన్న మార్గదర్శకాలన్నీ వీళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నిర్వహిస్తుందని, నిర్వహణకు ప్రత్యేకంగా సిటీ మేనేజర్‌ను నియమిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వైద్య సదుపాయానికి అయ్యే ఖర్చు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెల్లిస్తుందని వివరించారు.