free healing
-
ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నారంటే...
బెంగళూరు: కాసుల కక్కుర్తి కోసం శవాలకు చికిత్సలు చేసే కార్పొరేట్ ఆస్పత్రులున్న నేటి సమాజంలో డాక్టర్ అరవింద్ భటేజా లాంటి డాక్టర్లను చూడలేం, కనీసం ఉంటారని ఊహించలేం. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన న్యూరోసర్జన్లలో ఒకరైన భటేజా 2013 నుంచి 2016 డిసెంబర్ వరకు దాదాపు మూడువేల వెన్నముక సర్జరీలు చేయగా, వాటిలో 97 ఉచితంగా లేదా నామ మాత్రపు ఛార్జీలపై చేశారు. పేదప్రజలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కోసం ఆయన వందల కిలోమీటర్లు సైకిల్ ట్రెక్కింగ్ చేసి మరీ విరాళాలు సేకరిస్తున్నారు. చిన్నప్పటి నుంచి రెండింటిలోనే ఆయనకు అమితాసక్తి. ఒకటి సైక్లింగ్‌లో ఛాంపియన్ కావాలన్నది. మరోటి డాక్టరు కావాలన్నది. డాక్టర్ డిగ్రీ కోసం కొంతకాలం సైకిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. న్యూరోసర్జన్ కోర్స్ పూర్తయ్యాక ఆయన చనిపోయిన తన తల్లి సీతా భటేజా (ఆమె కూడా డాక్టరే) పేరిట స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సైక్లింగ్‌పై ఉన్న ఆసక్తితో ప్రతి ఏటా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ 800 కిలోమీటర్లు సాగే 'వెటరన్ నీలగిరి టూర్'లో 2009 నుంచి ఆయన పాల్గొంటున్నారు. దాదాపు ప్రతి ఏటా ఆయనకే ఛాంపియన్ షిప్ వస్తోంది. 2013 నుంచి టూర్‌కు స్పాన్సర్షిప్ పార్టనర్‌గా ఆయన ఆస్పత్రి ఉండడంతో ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయనకు ఉచిత స్లాట్ లభించింది. ఈ టూర్ ద్వారా విరాళాలు సేకరించి పేదల వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదన్న ఆలోచన రావడంతో ఆయన 2013 నుంచి నీలగిరి టూర్లో ఆస్పత్రి తరఫున విరాళాలు సేకరిస్తున్నారు. 2013లో లక్షన్నర రూపాయలు విరాళాలు రాగా, 2014లో ఆయన తరఫున ఆయన సోదరుడు వివేక్ ఈ టూర్లో పాల్గొని మూడున్నర లక్షల రూపాయలు సేకరించారు. 2015లో టూర్లో మళ్లీ అరవింద్ భటేజానే పాల్గొని ఛాంపియన్‌షిప్‌తోపాటు పది లక్షల రూపాయల విరాళాలను సాధించారు. 2016లోనూ నీలగిరి టూర్లో ఆయన ఛాంపియన్షిప్ సాధించడమే కాకుండా పదిలక్షల రూపాయల కన్నా ఎక్కువగా విరాళాలు సేకరించారు. ఈసారి ఛాంపియన్షిప్ సాధించిన తన సైకిల్ని కూడా వేలంవేసి వచ్చిన సొమ్మును ఆస్పత్రికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన చెప్పారు. వారానికి ఎనిమిది నుంచి పది గంటలు యువతకు సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తానని, ఎక్కువగా వారాంతంలోనే ఆ శిక్షణ ఉంటుందని చెప్పారు. సైక్లింగ్ చేసినా తన ప్రధాన వృత్తి ఎప్పటికీ వైద్యమేనని ఆయన అన్నారు. ఉచితంగా లేదా సబ్సిడీపై పేదలకు చికిత్స చేసిన వారికి, డబ్బు చెల్లించే వారికి ఇచ్చే వైద్యంలో ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. జీవితంలో రెండింటి పట్ల ప్రేమతో వ్యక్తిగత జీవితం పూర్తిగా కరవైందని, అయినా ఇదిచ్చే తృప్తికన్నా జీవితంలో మరింకేమీ కావాలంటూ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు. -
అమరావతి వాసులకు ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయే నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉంటున్న వారందరికీ ఉచిత వైద్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2014 డిసెంబర్ 8 నాటికి అమరావతి ప్రాంతంలో నివాసం ఉన్న వాళ్లందరికి తెల్ల, పింక్ రేషన్ రేషన్ కార్డు అన్న తారతమ్యం లేకుండా అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ వైద్య సదుపాయం 10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుందన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ స్కీములో ఉన్న మార్గదర్శకాలన్నీ వీళ్లకు వర్తిస్తాయని పేర్కొన్నారు. ఈ పథకాన్ని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ నిర్వహిస్తుందని, నిర్వహణకు ప్రత్యేకంగా సిటీ మేనేజర్‌ను నియమిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వైద్య సదుపాయానికి అయ్యే ఖర్చు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు చెల్లిస్తుందని వివరించారు. -
రిఫరల్ కార్డులతో ఉచిత వైద్యం
సాక్షి, హైదరాబాద్: అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు తెల్లకార్డులేకున్నా గుర్తించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలనుకునే వారు సీఎంసీవో రిఫరల్ కార్డులు తీసుకోవాలి. ఇవి జారీ చేసిన పది రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీటి గురించి ఏమైనా సందేహాలు తీర్చుకోవాలన్నా, అదనపు సమాచారం కావాలన్నా 104 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేయవచ్చు. ఇప్పటికే తెల్లకార్డులు ఉన్న వారు ఈ రిఫరల్ కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గులాబీతో పాటు ఎలాంటి రేషన్‌కార్డూ లేని వారు ఈ రిఫరల్ కార్డులు తీసుకోవచ్చని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది. రిఫరల్ కార్డుకు కేటాయించిన నంబర్ ఆధారంగా ప్రభుత్వం సూచించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయి. ఈ ఆసుపత్రులకు రెవెన్యూ విభాగం ద్వారా ఆన్లైన్లో చెల్లింపులు చేస్తుంది. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ నుంచి అనుమతి తీసుకుని ఆసుపత్రులు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రుల ముందస్తు గుర్తింపు రద్దు చే స్తారు. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద ఉన్న ట్రస్ట్ క్లినిక్, విజయవాడ,కాకినాడ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులు, విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్‌లలో రిఫరల్ కార్డులు పొందవచ్చు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలనుకున్న రోగులు నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు సమర్పించి కార్డులు పొందాలి. రోగులు తమ వెంట ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్లాలి. నేడు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం: పల్లె ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెరుగ్గా నిర్వహించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో చర్యలు చేపట్టామని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని సీఎం శుక్రవారం ఏలూరులో ప్రారంభిస్తారని తెలిపారు. అదే సమయానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. -
లివ్ లైఫ్‌లో.. న్యూ లైఫ్
సిటీబ్యూరో: ఊబకాయంతో బాధపడుతున్న ఓ నిరుపేద యువకుడికి లివ్ లైఫ్ ఆస్పత్రిలో ఉచితంగా వైద్యం అందించి వైద్యులు ఉదారతను చాటుకున్నారు. అనంతపురం జిల్లా తలుపుల మండలం వేపమానిపేటకు చెందిన మహేష్(20) వృత్తిరీత్యా ఆటో డ్రైవర్. ఈయన కొంత కాలంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్నాడు. ఇతని బాధ చూసి కదిరి మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చలించిపోయాడు. మహేష్‌ను వెంటతీసుకుని లివ్లైఫ్ ఆస్పత్రికి చెందిన కొవ్వు కరిగింపు నిపుణుడు డాక్టర్ నందకిషోర్‌ను సంప్రదించారు. ఆయన ఉచితంగా వైద్యం చేసేందుకు అంగీకరించారు. ల్యాప్రోస్కోపీ ద్వారా కేవలం నెల రోజుల వ్యవధిలోనే 25 కేజీల బరువు తగ్గించి మహేశ్ జీవితకాలాన్ని పెంచారు. దశలవారీగా మరికొంత బరువు తగ్గిస్తామని నందకిషోర్ తెలిపారు. -
గడువు ఐదు నెలలే...
చెత్త డంపింగ్‌పై మండూరు ప్రజల సడలింపు మాట తప్పితే పోరాటాలు తప్పవని దొరస్వామి హెచ్చరిక రాష్ర్ట రాజధానిలో పోగవుతున్న చెత్తను మండూరు వద్ద డంప్ చేయడానికి ఐదు నెలల వరకు అవకాశం కల్పించారు. తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ చెత్తను డంప్ చేయనివ్వబోమని స్థానికులు తేల్చి చెప్పారు. మంగళవారం బెంగళూరులో మండూరు ప్రజలతో సీఎం సిద్ధరామయ్య చర్చలు జరిపారు. చర్చల్లో బెంగళూరు నగర ఇన్చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మేయర్ కట్టే సత్యనారాయణ, స్వాత ంత్ర సమరయోధుడు దొరస్వామి పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐదు నెలల తర్వాత మండూరులో చెత్త డంప్ చేయబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీ లిఖితపూర్వకంగా హామీనివ్వడంతో మండూరు వాసులు సమ్మతించారు. ఈ లోపు మండూరుకు మంచి నీటి సరఫరా, ఉచిత వైద్యం, దోమల నివారణ, అంటు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హమీనిచ్చింది. ప్రతి వారం సమీక్ష నిర్వహించి స్థానికుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు దొరస్వామి తెలిపారు. మాట తప్పితే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.