ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నారంటే...
ఇలాంటి డాక్టర్ కూడా ఉన్నారంటే...
Published Wed, Jan 18 2017 6:29 PM | Last Updated on Tue, Sep 5 2017 1:32 AM
బెంగళూరు: కాసుల కక్కుర్తి కోసం శవాలకు చికిత్సలు చేసే కార్పొరేట్ ఆస్పత్రులున్న నేటి సమాజంలో డాక్టర్ అరవింద్ భటేజా లాంటి డాక్టర్లను చూడలేం, కనీసం ఉంటారని ఊహించలేం. దేశంలో అత్యంత ప్రతిభావంతులైన న్యూరోసర్జన్లలో ఒకరైన భటేజా 2013 నుంచి 2016 డిసెంబర్ వరకు దాదాపు మూడువేల వెన్నముక సర్జరీలు చేయగా, వాటిలో 97 ఉచితంగా లేదా నామ మాత్రపు ఛార్జీలపై చేశారు. పేదప్రజలకు ఉచితంగా ఆపరేషన్ చేయడం కోసం ఆయన వందల కిలోమీటర్లు సైకిల్ ట్రెక్కింగ్ చేసి మరీ విరాళాలు సేకరిస్తున్నారు.
చిన్నప్పటి నుంచి రెండింటిలోనే ఆయనకు అమితాసక్తి. ఒకటి సైక్లింగ్‌లో ఛాంపియన్ కావాలన్నది. మరోటి డాక్టరు కావాలన్నది. డాక్టర్ డిగ్రీ కోసం కొంతకాలం సైకిల్‌ను పక్కన పెట్టాల్సి వచ్చింది. న్యూరోసర్జన్ కోర్స్ పూర్తయ్యాక ఆయన చనిపోయిన తన తల్లి సీతా భటేజా (ఆమె కూడా డాక్టరే) పేరిట స్పెషాలిటీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. సైక్లింగ్‌పై ఉన్న ఆసక్తితో ప్రతి ఏటా కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలను కలుపుతూ 800 కిలోమీటర్లు సాగే 'వెటరన్ నీలగిరి టూర్'లో 2009 నుంచి ఆయన పాల్గొంటున్నారు. దాదాపు ప్రతి ఏటా ఆయనకే ఛాంపియన్ షిప్ వస్తోంది. 2013 నుంచి టూర్‌కు స్పాన్సర్‌షిప్ పార్టనర్‌గా ఆయన ఆస్పత్రి ఉండడంతో ఛాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనేందుకు ఆయనకు ఉచిత స్లాట్ లభించింది.
ఈ టూర్ ద్వారా విరాళాలు సేకరించి పేదల వైద్యానికి ఎందుకు ఖర్చు పెట్టకూడదన్న ఆలోచన రావడంతో ఆయన 2013 నుంచి నీలగిరి టూర్‌లో ఆస్పత్రి తరఫున విరాళాలు సేకరిస్తున్నారు. 2013లో లక్షన్నర రూపాయలు విరాళాలు రాగా, 2014లో ఆయన తరఫున ఆయన సోదరుడు వివేక్ ఈ టూర్‌లో పాల్గొని మూడున్నర లక్షల రూపాయలు సేకరించారు. 2015లో టూర్‌లో మళ్లీ అరవింద్ భటేజానే పాల్గొని ఛాంపియన్‌షిప్‌తోపాటు పది లక్షల రూపాయల విరాళాలను సాధించారు. 2016లోనూ నీలగిరి టూర్‌లో ఆయన ఛాంపియన్‌షిప్ సాధించడమే కాకుండా పదిలక్షల రూపాయల కన్నా ఎక్కువగా విరాళాలు సేకరించారు. ఈసారి ఛాంపియన్‌షిప్ సాధించిన తన సైకిల్‌ని కూడా వేలంవేసి వచ్చిన సొమ్మును ఆస్పత్రికి ఇవ్వాలనుకున్నట్లు ఆయన చెప్పారు.
వారానికి ఎనిమిది నుంచి పది గంటలు యువతకు సైక్లింగ్‌లో శిక్షణ ఇస్తానని, ఎక్కువగా వారాంతంలోనే ఆ శిక్షణ ఉంటుందని చెప్పారు. సైక్లింగ్ చేసినా తన ప్రధాన వృత్తి ఎప్పటికీ వైద్యమేనని ఆయన అన్నారు. ఉచితంగా లేదా సబ్సిడీపై పేదలకు చికిత్స చేసిన వారికి, డబ్బు చెల్లించే వారికి ఇచ్చే వైద్యంలో ఎలాంటి తేడా ఉండదని చెప్పారు. జీవితంలో రెండింటి పట్ల ప్రేమతో వ్యక్తిగత జీవితం పూర్తిగా కరవైందని, అయినా ఇదిచ్చే తృప్తికన్నా జీవితంలో మరింకేమీ కావాలంటూ అని ఆయన మీడియాతో వ్యాఖ్యానించారు.
Advertisement