గడువు ఐదు నెలలే...
చెత్త డంపింగ్‌పై మండూరు ప్రజల సడలింపు
మాట తప్పితే పోరాటాలు తప్పవని దొరస్వామి హెచ్చరిక
రాష్ర్ట రాజధానిలో పోగవుతున్న చెత్తను మండూరు వద్ద డంప్ చేయడానికి ఐదు నెలల వరకు అవకాశం కల్పించారు. తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ అక్కడ చెత్తను డంప్ చేయనివ్వబోమని స్థానికులు తేల్చి చెప్పారు. మంగళవారం బెంగళూరులో మండూరు ప్రజలతో సీఎం సిద్ధరామయ్య చర్చలు జరిపారు. చర్చల్లో బెంగళూరు నగర ఇన్‌చార్జ్ మంత్రి రామలింగారెడ్డి, బీబీఎంపీ కమిషనర్ లక్ష్మినారాయణ, మేయర్ కట్టే సత్యనారాయణ, స్వాత ంత్ర సమరయోధుడు దొరస్వామి పాల్గొన్నారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐదు నెలల తర్వాత మండూరులో చెత్త డంప్ చేయబోమని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌసిక్ ముఖర్జీ లిఖితపూర్వకంగా హామీనివ్వడంతో మండూరు వాసులు సమ్మతించారు.
ఈ లోపు మండూరుకు మంచి నీటి సరఫరా, ఉచిత వైద్యం, దోమల నివారణ, అంటు రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ప్రభుత్వం స్పష్టమైన హమీనిచ్చింది. ప్రతి వారం సమీక్ష నిర్వహించి స్థానికుల సమస్యలపై నిర్ణయాలు తీసుకుంటామని భరోసానిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రిపై నమ్మకంతోనే తామీ నిర్ణయానికి వచ్చినట్లు ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుడు దొరస్వామి తెలిపారు. మాట తప్పితే పోరాటాలు తప్పవని హెచ్చరించారు.