సాక్షి, హైదరాబాద్: అత్యవసర చికిత్స అవసరమయ్యే రోగులకు తెల్లకార్డులేకున్నా గుర్తించిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఉచితంగా వైద్య సేవలు అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలనుకునే వారు సీఎంసీవో రిఫరల్ కార్డులు తీసుకోవాలి. ఇవి జారీ చేసిన పది రోజులు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వీటి గురించి ఏమైనా సందేహాలు తీర్చుకోవాలన్నా, అదనపు సమాచారం కావాలన్నా 104 హెల్ప్‌లైన్ నంబరుకు ఫోన్ చేయవచ్చు.
ఇప్పటికే తెల్లకార్డులు ఉన్న వారు ఈ రిఫరల్ కార్డులు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. గులాబీతో పాటు ఎలాంటి రేషన్‌కార్డూ లేని వారు ఈ రిఫరల్ కార్డులు తీసుకోవచ్చని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో ప్రభుత్వ సమాచార సలహాదారు కార్యాలయం తెలిపింది. రిఫరల్ కార్డుకు కేటాయించిన నంబర్ ఆధారంగా ప్రభుత్వం సూచించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుతాయి. ఈ ఆసుపత్రులకు రెవెన్యూ విభాగం ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేస్తుంది.
ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్ ట్రస్ట్ నుంచి అనుమతి తీసుకుని ఆసుపత్రులు వైద్య సేవలు అందించాల్సి ఉంటుంది. రోగుల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఆసుపత్రుల ముందస్తు గుర్తింపు రద్దు చే స్తారు. హైదరాబాద్ లేక్‌వ్యూ అతిథిగృహం వద్ద ఉన్న ట్రస్ట్ క్లినిక్, విజయవాడ,కాకినాడ, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రులు, విశాఖపట్నం కింగ్‌జార్జి ఆసుపత్రి, తిరుపతి స్విమ్స్‌లలో రిఫరల్ కార్డులు పొందవచ్చు.
సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వైద్య సేవలు పొందాలనుకున్న రోగులు నేరుగా ఆయా కేంద్రాలకు వెళ్లి వేలిముద్రలు సమర్పించి కార్డులు పొందాలి. రోగులు తమ వెంట ప్రభుత్వ గుర్తింపు కార్డులు ఒరిజినల్ పత్రాలు తీసుకెళ్లాలి.
నేడు ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకం ప్రారంభం: పల్లె
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలను మెరుగ్గా నిర్వహించేందుకు ప్రైవేట్ భాగస్వామ్యంతో చర్యలు చేపట్టామని సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. ఎన్టీఆర్ వైద్య పరీక్షల పథకాన్ని సీఎం శుక్రవారం ఏలూరులో ప్రారంభిస్తారని తెలిపారు. అదే సమయానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మంత్రులు ఈ పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
రిఫరల్ కార్డులతో ఉచిత వైద్యం
Published Fri, Jan 1 2016 2:42 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement