
కరెంటు తీగే.. కాలసర్పమై..!
నాన్నా.. నేను గొర్రెల మందకు ఎల్తాను.. ఇద్దరన్నలను ఏరే పనికి ఎల్లమనండి. సాయంకాలం ఆరు గంటల దాకా అక్కడే ఉంటాను.
నాన్నా.. నేను గొర్రెల మందకు ఎల్తాను.. ఇద్దరన్నలను ఏరే పనికి ఎల్లమనండి. సాయంకాలం ఆరు గంటల దాకా అక్కడే ఉంటాను. ఆ తర్వాత అన్నను పంపండి..అని చెప్పి వెళ్లిన కొడుకు సాయంత్రం ఏడు గంటలైనా ఇంటికి రాలేదు. చిన్నోడు ఎటెల్లాడు.. ఇంకా రాలేదని ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తలో దిక్కుకూ వెళ్లి వెతుకులాట ప్రారంభించారు.అర్ధరాత్రి అయ్యింది.. ఊరవతల ఉన్న చెవిటి బంద(చెరువు) వైపు వెళ్లిన చిన్నోడి సోదరులకు బందలో విగత జీవిగా పడి ఉన్న తమ్ముడు కనిపించాడు. తమ్ముడిని కాపాడుకోవాలన్న ఆతృతలో చెరువులోకి దిగిన వారిని సైతం మృత్యువు కాటేసింది. అంతే అర్ధరాత్రి వేళ చెవిటి బంద, ఎస్పీఆర్‌పురం రోదనలతో దద్దరిల్లాయి.
జి. సిగడాం: చిన్నోడు.. అతన్ని కాపాడే ప్రయత్నంలో అన్నలిద్దరి మృతికి కారణం తెగిపడిన ఓ విద్యుత్ తీగ. మృత్యుపాశాన్ని గమనించకపోవడం వల్లే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృత్యు ఒడి చేరడం జి.సిగడాం మండలం ఎస్పీఆర్‌పురం గ్రామస్తులను కలచి వేసింది. అంతులేని విషాదం నింపింది. గ్రామానికి చెందిన ఏలిస లక్ష్ముం కుమారుడు చంద్రరావు(15) శుక్రవారం ఉదయం తండ్రికి చెప్పి మేత కోసం గొర్రెల మందను తీసుకొని గ్రామ సమీపంలో ఉన్న చెవిటి బంద ప్రాంతానికి వెళ్లాడు. సాయంత్రం ఆరుగంటలకే ఇంటికి తిరిగి రావాల్సిన అతను రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు నాలుగువైపులా వెతకడం ప్రారంభించారు.
అర్థరాత్రి అయినా చంద్రరావు జాడ కనిపించలేదు. అదే సమయంలో చెవిటి బంద వైపు వెళ్లిన చంద్రరావు సోదరులు ఏలిస దాలెప్పడు(25), డొప్ప రమణ(28)తో పాటు సీతయ్య, చిన్నోడు అనే వ్యక్తులకు బంద సమీపంలో చంద్రరావు వాడే గడకర్ర కనిపించింది. దాంతో అనుమానంతో చెరువులో చూడగా చంద్రరావు కనిపించాడు. అతన్ని కాపాడుకోవాలన్న ఆతృతతో దాలెప్పడు, రమణలు ముందూవెనకా చూడకుండా చెరువులోకి దిగి తమ్ముడిలాగే కుప్పకూలిపోయారు. దాంతో కంగారుపడిన సీతయ్య, చిన్నోడు పరీక్షగా చూస్తే చెరువు ఒడ్డున తెగిన విద్యుత్ తీగ కనిపించింది. దాని షాక్‌తోనే వారు ముగ్గురు చనిపోయారని వారికి అర్థమైంది. ఆందోళన చెందుతూ ఇద్దరూ పరుగున గ్రామంలోకి వెళ్లి విషయం తెలియజేశారు. దాంతో రాత్రి ఒంటిగంట సమయంలో కుటుం బ సభ్యులతో సహా గ్రామస్తులందరూ బంద వద్దకు చేరుకున్నారు. మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు అక్కడే కుప్పకూలిపోయారు.
అనాథ అయిన కుటుంబం
తన ఇద్దరు కుమారులతోపాటు మరదలి కొడుకైన రమణ కూడా మరణించడంతో లక్ష్ముం కన్నీరుమున్నీరవుతున్నాడు. చిన్నవాడైన చంద్రరావుకు పెళ్లి కాలేదు. దాలెప్పడుకు భార్య భారతి, పిల్లలు కార్తీక్, తేజేస్వరి ఉన్నారు. రమణకు భార్య వరలక్ష్మి, పిల్లలు యశ్వంత్‌కుమార్, సుజాత ఉన్నారు. పిల్లలందరూ రెండు మూడేళ్ల వయసువారే. చేతికి అందివచ్చిన కొడుకులు ముగ్గురు ఒకేసారి పోవడంతో కుటుంబాన్ని ఎలా సాకాలంటూ లక్ష్ముం భోరున విలపించగా.. మగదిక్కు కోల్పోయామని, ఇంక మాకు దిక్కెవరంటూ మృతులిద్దరి భార్యలు గుండెలవిసేలా అక్కడే కూలబడి రోదించడం గ్రామస్తులను కలచివేసింది. చిన్న పిల్లలు అనాథలయ్యారంటూ పలువురు కన్నీరు పెట్టుకున్నారు. అనంతరం మృతదేహాలను చెరువులోంచి బయటకు తీశారు. రాత్రంతా రోదనలతో గ్రామంలో విషాదం అలుముకుంది.
జిల్లా అధికారుల సందర్శన
సమాచారం అందుకున్న జిల్లా అధికార యంత్రాంగం శనివారం ఉదయం గ్రామానికి చేరుకుంది. సీఐ సీతారాం ఆధ్వర్యంలో మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజాం సామాజిక ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. కాగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఆర్డీవో దయానిధి, ఏఎస్పీ తిరుమలరావు, తహశీల్దారు డి.వి.బ్రహ్మాజీరావు, ఎంపీడీవో కె.హేమసుందరరావు, సంతకవిటి, రాజాం, జి.సిగడాం పోలీసులు, మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు, తనుబుద్ది దాలినాయుడు గ్రామానికి వచ్చి బాధిత కుటుంబాన్ని ఓదార్చారు.
కలెక్టర్ ఆరా
మృతుల దహన సంస్కారాలకు ప్రభుత్వం తరఫున రూ.5వేలు చొప్పున కలెక్టర్ అందజేశారు. మృతి చెందిన వారంతా పేదవారునని, వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గానీ, అపద్బంధు పథకం కింద గానీ ఆర్థిక సాయం అందేలా చూడాలని మాజీ ఎమ్మెల్యే మీసాల నీలకంఠంనాయుడు ఈ సందర్భంగా కలెక్టర్‌ను కోరారు. స్థానిక అధికారుల నుంచి నివేదికలు తెప్పించుకుని ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ అన్నారు. అనంతరం ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం ఎలా సంభవించింది, వైర్లు తె గిపోవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు వైఎస్‌ఆర్‌సీపీ, టీడీపీ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చి బాధితులను పరామర్శించారు.