రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వం ప్రగల్భాకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
నల్లగొండ, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రస్తుతమున్న ప్రభుత్వం ప్రగల్భాకే పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేద ప్రజల సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం పలు పథకాలను ప్రవేశపెడుతున్నా అవి కాస్తా ఆదిలోనే హంసపాదుగా మారుతున్నాయి. ఇటీవల ప్రభుత్వం దళితవాడలు, తండాల్లో నివశించే ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. కానీ, దీని అమలు విషయంలో పట్టించుకోవడం లేదు. 50 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీల కుటుంబాలకు ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించినా దీనిపై తమకు ఉత్తర్వులు అందలేదని కిందిస్థాయి అధికారులు చెబుతున్నారు. దీంతో వారు తమకు ఆదేశాలు రాలేదని చెబుతున్నారు. దీంతో ఈ పథకం అమలుపై లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు.
విద్యుత్ బిల్లులు భరించేందుకు నిర్ణయం
విద్యుత్ వినియోగానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎస్సీలకు విద్యుత్ బిల్లులు చెల్లించనున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ జీవోనెం. 58ను జారీ జారీ చేసింది. ఇదిలా ఉండగా గిరిజనులకు సంబంధించి మాత్రం త్వరలోనే ఉత్తర్వులు వెలువడనున్నాయని అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో దళితవాడల్లో నివసిస్తూ 50 యూనిట్లలోపు విద్యుత్‌ను వినియోగించే కనెక్షన్లు సుమారు 40వేల వరకు ఉన్నాయని విద్యుత్ యంత్రాంగం గుర్తించింది. 50యూనిట్ల లోపు వినియోగించే ఆయా కుటుంబాలకు సంబంధించిన పాత బకాయిలు రూ.14.20 కోట్ల వరకు ఉండగా, గడిచిన ఏప్రిల్ నుంచి జూన్ వరకు మరో *72లక్షలు ఎస్సీ వినియోగదారులు బకాయిలు ఉన్నాయని, మొత్తంగా సుమారు రూ.15కోట్ల బకాయిలు ఉన్నాయని అధికారులు తెలియజేస్తున్నారు.
సాంఘిక సంక్షేమ శాఖకు ఆదేశాలు
కోట్లాది రూపాయల మొత్తంలో బకాయిలు పేరుకపోయినా, వీటితో పాటు గత నెల జూలై నెల నుంచి ఉచిత విద్యుత్ బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టాలని ఆదేశిస్తూ సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకుల కార్యాలయానికి అధికారిక ఉత్తర్వులు కూడా అందాయి. ఈ మేరకు ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా జిల్లాలోని లబ్ధిదారులు, వారి బకాయిల వివరాలు పంపాలని విద్యుత్‌శాఖను సాంఘిక సంక్షేమశాఖ కోరింది. దీంతో ఎస్సీ లబ్ధిదారుల వివరాలు వెలికితీసే కార్యక్రమంలో యంత్రాంగం నిమగ్నమైంది. పూర్తిస్థాయి కసరత్తు చేయడం ద్వారా స్పష్టమైన గణాంకాలు సాంఘిక సంక్షేమ శాఖకు అందించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ విద్యుత్ అధికారులు వెల్లడిస్తున్నారు.
అయితే విద్యుత్ శాఖ అందించిన వివరాల ఆధారంగా పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నామని ఆయా శాఖల అధికారులు చెబుతున్నా ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల్లో మాత్రం అపోహలు మెండుగా ఉన్నాయి. జూన్ నుంచి ఉచిత విద్యుత్ అమలు చేయాలని ప్రభుత్వం అదేశించినా గత నెల బిల్లులు యధాతథంగా వచ్చాయని లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. ఇదిలా ఉండగా ఎస్టీలకు ఉచిత విద్యుత్ అమలుకు సంబంధించి ఉత్తర్వులు అందినా కసరత్తు విషయంలో ఎలాంటి పురోగతి లేదు.
జిల్లాలో 1132 గిరిజన తండాలు, ఆవాసగ్రామాలుండగా అందులో చాలావరకు తండాలకు విద్యుత్ సౌకర్యమే కరువైంది. ఏది ఏమైనా ఆయా తండాలు, ఆవాస గ్రామాల్లో గిరిజన కుటుంబాలు 50 యూనిట్లలోపు వారికి ఉచిత విద్యుత్‌ను అందించేందుకు అవసరమైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఎస్టీ వినియోగదారుల విషయంలో కూడా ఉత్తర్వులు వెలువడినా ఎంతమంది ఉంటారన్న లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో ఇప్పుడిప్పుడే నిమగ్నమయ్యారు. గిరిజన కుటుంబాల్లో ఎవరెంత విద్యుత్ బకాయిలు లెక్కలు కడుతున్నారు.
ఇళ్లు లేని వారి పరిస్థితేంటి?
ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ అందించాలనే నిర్ణయం మంచిదైనా అద్దె ఇళ్లల్లో ఉంటున్నవారు, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ 50 యూనిట్ల విద్యుత్‌ను వాడేవారి పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ పథకం సమూహంగా ఉండే కాలనీలకే వర్తింపజేస్తామనే విధానం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇతర ప్రాంతాల్లో నివసించే వారిలో ఎక్కువమంది కూలి పైనే ఆధారపడుతున్నారు. వారిని లెక్కల్లోకి తీసుకోకపోవడంతో చాలామందికి అన్యాయం జరుగుతుందని వాపోతున్నారు.
ముక్కుపిండి మరీ కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నారు
సీఎం 50 యూనిట్లలోపు విద్యుత్ వరకు వాడుకున్న వారు బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. కరెంటోళ్లు మాత్రం ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. నాకు ఒక బిల్లు 36 యూనిట్లు రాగా మరో బిల్లు 49 యూనిట్లలోపే వచ్చింది. ఎస్సీలు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదన్నరని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చెప్పిన విషయాన్ని అధికారులను అడిగితే మీరు ముఖ్యమంత్రికి వద్దకు వెళ్లి ఆయననే ఈ విషయంపై అడగమన్నారు.
- జె. సురేష్‌బాబు, గాంధీనగర్, మిర్యాలగూడ
ఎక్కువ బిల్లు వస్తుంది
50యూనిట్ల కన్నా తక్కువ కరెంటు వాడుతున్న దళితులకు ఫ్రీగా ఇంటికి కరెంట్ ఇస్తామని గవర్నమెంటు సెప్పినా అప్పుడొచ్చినట్లే బిల్లులు వస్తున్నాయి. పాతప్పులు కూడా కట్టొద్దని చెబుతున్నా బలంతంగా కరెంటు కట్ చేస్తున్నారు. బిల్లు మాకు ఫ్రీ గదా అంటే మాకేమి తెలియది, ఇప్పుడైతే కట్టాల్సిందే అంటున్నారు.
- కిన్నెర లింగమ్మ, తిప్పర్తి
లేదన్నా బిల్లు వసూలు చేస్తున్నారు
50యూనిట్ల లోపు విద్యుత్ వాడుకున్న వారికి విద్యుత్ బిల్లు ఉండదని సీఎం ఇచ్చిన హామీ అమలు కావడంలేదు. అధికారులు 50యూనిట్ల లోపు విద్యుత్ వాడినా బిల్లులు వసూలు చేస్తున్నారు. అధికారులను అడిగితే అలాంటి జీవో అందలేదని చెబుతున్నారు. తక్కువ కరెంటు వాడుకున్నా జూన్‌లో *123, జూలైలో *147 వసూలు చేశారు.
- లావూరి లక్ష్మీ, దామరచర్ల