ఇసుకాసురుల జాతర | Free sand Policy | Sakshi
Sakshi News home page

ఇసుకాసురుల జాతర

Mar 16 2016 11:42 PM | Updated on Sep 3 2017 7:54 PM

బ్రిడ్జి పక్కనే ఇసుక తవ్వకాలు చేపడుతున్న దృశ్యమిది. ఎస్ కోట మండలంలలోని మామిడిపల్లి వద్ద నిత్యం జరుగుతున్న తంతు ఇది.


 సాక్షి ప్రతినిధి, విజయనగరం: బ్రిడ్జి పక్కనే ఇసుక  తవ్వకాలు చేపడుతున్న దృశ్యమిది. ఎస్ కోట మండలంలలోని  మామిడిపల్లి వద్ద నిత్యం జరుగుతున్న తంతు ఇది. కోట్లాది రూపాయలతో కట్టిన వంతెనకు భవిష్యత్‌లో ముప్పు తప్పదని స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఒక్కచోటే కాదు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న తంతు ఇది.  బంగారు గుడ్డునిచ్చే బాతు వ్యవహారంలా తయారైంది ఉచిత ఇసుక వ్యవహారం. ఉచిత ఇసుక అనగానే అడ్డూ అదుపులేని తవ్వకాలతో  వనరులు, కట్టడాలు ధ్వంసమయ్యే ప్రమాదం ఏర్పడింది.
 
 ధ్వంసం తప్పదు
 తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని ప్రకటించింది. కానీ, దానికి సంబంధించి నియమ నిబంధనలు ప్రకటించలేదు. దీంతో వాల్టా చట్టమెక్కడా అమలు కావడం లేదు. ఇష్టారీతిన ఎక్కడికక్కడ ఇసుక తవ్వకాలు జరిగిపోతున్నాయి. బండి వెనుక బండి అన్నట్టుగా నదులు, గెడ్డల్లో  ట్రాక్టర్లు, లారీలు బారులు తీరుతున్నాయి. ఎక్కడ ఇసుక కనబడితే అక్కడ తవ్వేస్తున్నారు. పక్కన తాగునీటి పథకాల ఊట బావులు ఉన్నాయా? కల్వర్టులు ఉన్నాయా? కాజ్‌వేలు ఉన్నాయా? పెద్ద పెద్ద వంతెనలు ఉన్నాయా? అనేది  చూడకుండా, పట్టించుకోకుండా తెగబడి తవ్వేస్తూ నదుల్ని గుల్ల చేసేస్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడైతే ఉచిత ఇసుక అన్నదో అధికారులు కూడా పట్టించుకోవడం మానేశారు.  
 
 అసలుకే ఎసరు
 జిల్లాలో నాగావళి, చంపావతి, గోస్తనీ, సువర్ణముఖి, వేగావతి వంటి నదులు ఉన్నాయి. వాటిలో 60వరకు భారీ మంచినీటి పథకాలు ఆధారపడి ఉన్నాయి. ఆ నదుల ఊట ద్వారానే పథకాలన్నీ రీచార్జ్ అవుతున్నాయి. ఇప్పుడా రీచార్జ్‌కే ముప్పు ఏర్పడింది. ఊటబావుల చుట్టూ ఇసుక తవ్వకాలు జరిపేస్తుండడంతో రీచార్జ్ అయ్యే ఇసుకే లేని దుస్థితి ఏర్పడుతోంది.దీంతో ఇప్పటికే చాలా పథకాల ఊటబావులు మూలకు చేరిపోయాయి. మిగతావి కూడా పనికిరాకుండా పోతే దాదాపు 10లక్షల మందికి తాగునీటి  ఇబ్బందులు తప్పవు. ఇక, నదులు, వాగులపై ఉన్న బ్రిడ్జిలకు ముప్పు తప్పదు.
 
 ప్రకటన ఇచ్చేసి చోద్యం చూస్తున్న సర్కారు?
 ఉచిత ఇసుక పాలసీ ప్రకటించినప్పుడు దాని విధివిధానాలు కూడా ప్రకటించాలి. ఎక్కడ తవ్వకాలు జరపాలి? ఎక్కడ జరపకూడదనే స్పష్టత ఇవ్వాలి. ఆమేరకు అధికారుల చేత గుర్తించి అధికారికంగా వెల్లడించాలి, అవసరమైతే తవ్వకాలకు అనువైన చోట బోర్డులు ఏర్పాటు చేయాలి. అధికారిక ప్రకటన కూడా విడుదల చేయాలి. కానీ అదేమీ చేయకుండా ఇసుక ఉచితమని గేట్లెత్తేసింది. ఇంకేముంది చెలరేగిపోతున్నారు. కొందరు రవాణా పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. పెత్తనంతో  మరికొందరు లబ్ధిపొందుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 75కి పైగా ప్రాంతాల్లో ఇసుక లభ్యత ఉంది. వాల్టా చట్టం ప్రకారం మూడు మీటర్లకు మించి ఇసుక ఉన్న ప్రాంతాల్నే తవ్వకాలకు అనుమతించాలి.

 ఆ లెక్కనైతే జిల్లాలో తొమ్మిదే ఉన్నాయి. కాసింత వెసులుబాటు కల్పిస్తే మరో పదో చోట్ల తవ్వకాలు  జరపొచ్చు. కానీ అంతకుమించి అనుమతిస్తే నదులు గుల్లై పక్కనున్న ఊటబావులు, వంతెనలు ధ్వంసమవుతాయి. ఇప్పుడదే జరుగుతోంది. అధికారులు ఎటువంటి గుర్తింపు, ప్రకటన చేయకపోవడంతో  మూడు మీటర్ల మందం లేని చోట్ల కూడా తవ్వకాలు జరిపేస్తున్నారు. అలాగే వంతెనలు, ఊటబావులకు 500మీటర్ల సమీపంలో తవ్వకాలు జరపకూడదని వాల్టా చట్టం హెచ్చరికలు ఉన్నా ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. కనీసం గుర్తు చేసిన అధికారులూ లేరు. దీంతో ఎక్కడికక్కడ ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపేస్తుండడంతో వనరులు, ఆస్తులకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడింది.చెప్పాలంటే ఇసుకున్న ప్రతిచోట ఒక జాతరలా వాహనాల తాకిడి కన్పిస్తోంది. ఇప్పటికైనా స్పష్టత ఇవ్వకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement