
ఒక్కటైన 40 జంటలు
పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన సామూహిక ఉచిత వివాహ కార్యక్రమంలో ఏజెన్సీలోని ఏడు మండలాలకు చెందిన 40 జంటలు ఒక్కటయ్యాయి.
అడ్డతీగల : పవనగిరి క్షేత్రంలో బుధవారం జరిగిన సామూహిక ఉచిత వివాహ కార్యక్రమంలో ఏజెన్సీలోని ఏడు మండలాలకు చెందిన 40 జంటలు ఒక్కటయ్యాయి. ఈ కార్యక్రమంలో పవనగిరి వ్యవస్థాపకులు తణుకు వెంకట్రామయ్య, ఆర్ట్‌ఆఫ్ లివింగ్ ఉభయ గోదావరి జిల్లాల కో ఆర్డినేటర్ ఎన్. సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. యువతీయువకులకు వివాహం ప్రాధాన్యతను వివరిస్తూ ఆధ్యాత్మిక సంస్థలు ఉచితవివాహాలను నిర్వహించడం అభినందనీయమని సత్యనారాయణ అన్నారు. గ్రామాల్లో మౌలిక అవసరాలు తీర్చడానికి, గిరిజనుల్లో అంతర్లీనంగా ఉన్న శక్తిని వెలికితీసి దాని ప్రాధాన్యతను వారికి తెలియజేయడానికి ఆర్ట్‌ఆఫ్ లివింగ్ తరఫున హ్యాపీనెస్, యూత్‌లీడర్‌షిప్ ట్రైనింగ్ ప్రోగ్రాంలను రూపొందించామన్నారు. గురువారం నుంచి హ్యాపీనెస్ శిక్షణ ప్రారంభమవుతుందన్నారు. ఈ శిక్షణ పొందినవారితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధికి మార్గాలను చూపుతామన్నారు.
తమ సంస్థ ద్వారా 30 గ్రామాలకు గంగాలమ్మతల్లి రాతివిగ్రహాలను ఉచితంగా అందజేస్తామన్నారు. ఏజెన్సీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని హిందూత్వం విస్తరించడానికి, హిందూ వివాహవ్యవస్థ అభివృద్ధి చెందేం దుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు పవనగిరి వ్యవస్థాపకులు తణుకు వెంకటరామయ్య తెలిపారు. 40 జంటలకు పెళ్లిసామగ్రిని అందజేసి ఋషిపీఠం కళ్యాణమండపంలో పురోహితుల వేదమంత్రోచ్చారణల మధ్య సామూహిక ఉచిత వివాహాలను జరిపించారు.అనంతరం నూతన దంపతులతోపాటు వారి కుటుంబసభ్యులకు అన్నసంతర్పణ చేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు పి.జ్యోతి, పద్మజ, రాజమండ్రి శివనాడీ జ్యోతిషాలయం నిర్వాహకులు ఎం.జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.