నాడు మిరపకాయ టపా పంపి, అల్లూరి సీతారామరాజు దాడి చేసిన అడ్డతీగల పోలీస్ స్టేషన్
రంపచోడవరం(తూర్పుగోదావరి): పచ్చని మన్య సీమలో అమాయక గిరిజనంపై ఆంగ్లేయులు సాగించిన అకృత్యాలపై.. విల్లంబులు ఎక్కుపెట్టిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు సాగించిన మహోజ్వల సాయుధ పోరాటం ఇప్పటికీ.. ఎప్పటికీ స్ఫూర్తిదాయకమే. ఈ పోరాటంలో భాగంగా ఆయన సారథ్యంలోని గిరిజన వీరులు బ్రిటిష్ పోలీస్ స్టేషన్లపై వరుస దాడులు చేశారు. ఆ క్రమంలో తాము దాడులు చేస్తున్నట్టు బ్రిటిష్ సైన్యానికి ముందుగానే హెచ్చరిక సందేశం పంపేవారు. కాగితంపై రాసిన ఆ సందేశాన్ని బాణానికి గుచ్చి, దానిపై ఎర్ర మిరపకాయల గుత్తి తగిలించేవారు. ఆవిధంగా ఎర్ర మిరప కాయల గుత్తితో పోలీస్ స్టేషన్ వద్ద బాణం నాటుకొంటే చాలు.. బ్రిటిష్ పోలీసులు హడలెత్తిపోయేవారు. అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద సీతారామరాజు కొంత కాలం నివాసం ఉన్నారు.
బ్రిటిష్ వారిపై తిరుగుబాటు జెండా ఎగుర వేసిన తరువాత అడవుల్లోకి వెళ్లి బ్రిటిష్ సేనలను ఎదిరించేందుకు రంగం సిద్ధం చేశారు. దీనిలో భాగంగా 1922లో విశాఖ జిల్లా కృష్ణదేవీపేట (కేడీ పేట) పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. అక్కడి ఆయుధాలను స్వా«దీనం చేసుకుని, దాడి చేసినట్టు సమయం తెలుపుతూ ఉత్తరం ఉంచారు. కొద్ది రోజుల్లోనే రాజవొమ్మంగి పోలీస్ స్టేషన్‌పై దాడి చేశారు. ఈ దాడికి కొంత సమయం తీసుకోవడంతో బ్రిటిష్ అధికారులకు సీతారామరాజు భయపడ్డాడని ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో అడ్డతీగల మండలం పైడిపుట్ట వద్ద ఆయన గిరిజనులతో సమావేశమయ్యారు. అడ్డతీగల పోలీస్ స్టేషన్‌పై దాడి చేస్తున్నట్లు 1922 అక్టోబర్ 10న బాణానికి మిరపకాయ గుత్తి ఉంచి సందేశం పంపించారు. ఆ స్టేషన్‌పై దాడి చేసేందుకు గుర్రం మీద తేనెలమంగి గ్రామంలోని తెల్ల మద్ది చెట్టు వద్దకు రాత్రి చేరుకుని వ్యూహం రచించారు. 1922 అక్టోబర్ 15న దాడి చేసి ఆయుధాలు కొల్లగొట్టారు. స్టేషన్‌పై దాడి చేసినట్టు లేఖ ఉంచారు. ఆ తరువాత నాలుగు రోజుల వ్యవధిలోనే అక్టోబర్ 19న రంపచోడవరం పోలీస్ స్టేషన్‌పై కూడా అల్లూరి దాడి చేశారు.
తెల్లవారి వెన్నులో వణుకు పుట్టించేలా అల్లూరి మహోధృతంగా సాగించిన సాయుధ పోరాటంలో మిరపకాయ టపాకు ఈవిధంగా ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఉద్యమానికి వందేళ్లు అయిన సందర్భంగా నాటి సంఘటనకు గుర్తుగా ఆ మహావీరుని చిత్రంతో తపాలా శాఖ ప్రత్యేక కవర్ విడుదల చేస్తోంది. రంపచోడవరంలో బుధవారం జరిగే ఈ కార్యక్రమంలో కలెక్టర్ సి.హరికిరణ్, రంపచోడవరం ఐటీడీఏ పీఓ ప్రవీణ్ ఆదిత్య, సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత పటేల్, రీజియన్ పోస్ట్‌మాస్టర్ జనరల్ డాక్టర్ ముత్యాల వెంకటేశ్వర్లు, రంపచోడవరం సర్పంచ్ మంగా బొజ్జయ్య పాల్గొంటారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా అడ్డతీగలలో కూడా అల్లూరి పోరాటంపై ప్రత్యేక తపాలా చంద్రికను ఆవిష్కరించనున్నారు. తపాలా శాఖ, హైదరాబాద్‌కు చెందిన మిత్రా గ్రూప్ కంపెనీల అధినేత ఆర్‌ఆర్‌కే రాజుల సంయుక్త ఆధ్వర్యాన స్థానిక శ్రీ సాయి సన్నిధి ఫంక్షన్ హాలులో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment