నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలం చెన్నాయిపాళెం గ్రామం వద్ద ఒక ఇటుక బట్టీ యజమాని నిర్బంధించిన బాలికకు కలెక్టర్ జోక్యంతో విముక్తి లభించింది. ఈ సంఘటన మంగళవారం జరిగింది. చెన్నాయిపాళెం శివారులో కుండా దయాకర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్ ఇటుకల బట్టీలు నిర్వహిస్తున్నాడు. అక్కడ ఎంకమ్మ, శీనయ్య అనే దంపతులు వలస కూలీలుగా పనిచేస్తున్నారు.
అయితే వారి కుమార్తె లక్ష్మమ్మ(5)ను ఇటుకల బట్టీల యజమాని అక్రమంగా నిర్బంధించాడు. తన వద్ద తీసుకున్న అప్పు తీర్చేవరకూ బాలిక నిర్బంధంలో ఉంటుందని హెచ్చరించాడు. దిక్కుతోచని తల్లిదండ్రులు నెల్లూరు వెళ్లి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి స్థానిక ఎస్‌ఐ, తహశీల్దార్, ఐసీడీఎస్ సీపీడీవో, ఏఆర్‌ఓ స్వచ్ఛందసంస్థ ప్రతినిధులను ఆదేశించారు. వారు మంగళవారం మధ్యాహ్నం ఇటుకబట్టీల వద్దకు వెళ్లి లక్ష్మమ్మ(5)ను దయాకర్‌రెడ్డి చెర నుంచి విడిపించారు. అతనిపై కేసు నమోదుచేశారు.