
స్వచ్ఛ నెల్లూరును విజయవంతం చేయండి
నెల్లూరు (రవాణా): నగరంలో ప్రతి కుటుంబం పరిసరాల శుభ్రతను పాటించి స్వచ్ఛ నెల్లూరును విజయవంతం చేయాలని కలెక్టర్ జానకి పిలుపునిచ్చారు. స్వచ్ఛ నెల్లూరులో భాగం గా కార్పొరేషన్ ఆధ్వర్యంలో సోమవారం నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తొలుత ర్యాలీని నగర మేయర్ అబ్దుల్‌అజీజ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ ఆర్టీసీ బస్డాండ్ సెంటర్ నుంచి వీఆర్‌సీ, ఏసీబొమ్మ, కనకమహల్ సెంటర్ మీదుగా గాంధీ విగ్రహం వరకు సాగింది. మద్రాసు బస్డాండ్ పరిసర ప్రాంతాల్లో మేయర్ అజీజ్‌తో పాటు డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్ చెత్తను శుభ్రం చేశారు.
గాంధీబొమ్మ సెంటర్లో స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ నెల్లూరుకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ జానకి మాట్లాడుతూ సోమవారం నుంచి స్వచ్ఛనెల్లూరు కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. నగరంలో ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించే కార్యక్రమం చేపట్టాలన్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు ప్రజలు సంపూర్ణ సహకారం అందించి స్వచ్ఛనెల్లూరును విజయవంతం చేయాలన్నారు. మేయ ర్ అబ్దుల్‌అజీజ్ మాట్లాడుతూ నెల్లూరు ను చెత్తరహిత నగరంగా మార్చేందుకు కృషి చేస్తానని హమీ ఇచ్చారు.
పలువురు కార్పొరేటర్ల డుమ్మా
కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన స్వచ్ఛనెల్లూరు ర్యాలీకి టీడీపీకి చెందిన పలువురు కార్పొరేటర్లు డుమ్మా కొట్టారు. నగర కమిషనర్ చక్రధర్‌బాబు హైదరాబాద్ వెళ్లారు. ర్యాలీలో నాయకులు, అధికారుల మధ్య పూర్తిగా సమన్వయం కొరవడింది. ర్యాలీ ప్రారంభంలో పాల్గొన్న వారిలో కొంతమంది మాత్రమే చివరి వరకు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ చంద్రమౌళీశ్వరరెడ్డి, ఎస్‌ఈ మొయినుద్దీన్, ఎంఎచ్‌ఓ వెంకటరమణయ్య, డీసీపీ శ్రీనివాసులు, ఏసీపీ వరప్రసాద్, ఎగ్జామినర్ నీలకంఠారెడ్డి, టీడీపీ నాయకులు వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి, చాట్ల నరసింహారావు, కార్పొరేటర్లు, కృష్ణపట్నం పీఆర్‌ఓ వేణుగోపాల్, అంగన్‌వాడీ కార్యకర్తలు, మెప్మా సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, కార్పొరేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.