కమీషన్ల కక్కుర్తి | Functional areas of illegal collections | Sakshi
Sakshi News home page

కమీషన్ల కక్కుర్తి

Published Sun, Nov 9 2014 1:52 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM

కమీషన్ల కక్కుర్తి - Sakshi

కమీషన్ల కక్కుర్తి

డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది చేతివాటం చూపుతున్నారు.

డ్వాక్రా సంఘాల నుంచి ఐకేపీ సిబ్బంది అక్రమ వసూళ్లు
లక్ష రూపాయల రుణం ఇస్తే రూ.2 వేలు పైనే ముడుపులు
పీఆర్పీలు, సీవోలు, సీసీ, సమాఖ్య ప్రతినిధులకు వాటాలు
జనశ్రీ బీమా సొమ్ము అందజేతలోనూ చేతివాటం
చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు

 
మచిలీపట్నం : డ్వాక్రా సంఘాలను ఆర్థికంగా పరిపుష్టం చేసేందుకు సహకరించాల్సిన సిబ్బంది చేతివాటం చూపుతున్నారు. ఏదైనా డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల రుణం వస్తే రెండు నుంచి మూడు శాతం కమీషన్ రూపంలో కాజేస్తున్నారు. ఇందిరా క్రాంతి పథం, మెప్మా ద్వారా డ్వాక్రా సంఘాల పనితీరును పర్యవేక్షంచి వారికి వివిధ బ్యాంకుల్లో రుణాలు మంజూరయ్యేందుకు సిఫార్సు చేయాల్సిన సిబ్బంది ఇందుకు గాను కమీషన్లు వసూలు చేస్తున్నారు. జిల్లాలో 58,250 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. 2012-13 ఆర్థిక సంవత్సరంలో 27,321 సంఘాలకు రూ.893.66 కోట్లు, ఈ ఏడాది 6,912 గ్రూపులకు రూ.236.57 కోట్లు రుణాలుగా అందజేశారు. డ్వాక్రా సంఘాలకు బ్యాంకుల నుంచి రుణం మంజూరైన వెంటనే సంఘానికి సంబంధించిన లీడర్, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్, రిసోర్స్ పర్సన్, గ్రామైక్య సంఘాల అధ్యక్షురాలు, బుక్‌కీపర్లు, బ్యాంకు మిత్ర తదితరులకు నగదు ముట్టజెప్పాల్సిన పరిస్థితి నెలకొంది. ఏదైనా ఒక డ్వాక్రా సంఘం బ్యాంకు నుంచి లక్ష రూపాయల రుణం తీసుకుంటే వెయ్యి రూపాయలు కమ్యూనిటీ కో-ఆర్డినేటరుకు, రూ.200 నుంచి రూ.300 గ్రామైక్య సంఘాల అధ్యక్షులకు, రూ.200 బుక్ కీపరుకు, రూ.100 బ్యాంకు మిత్రకు, మరో రూ.200 ఇతరత్రా ఖర్చుల కోసం కమీషన్ రూపంలో ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. లక్ష రూపాయలకు రూ.2 వేలు చొప్పున కమీషన్లకే సరిపోవటంతో బ్యాంకులో రుణం తీసుకున్న డ్వాక్రా సంఘ సభ్యులకు అప్పులు మిగులుతుండగా ఐకేపీ, మెప్మాలలో పనిచేస్తున్న సిబ్బంది లక్షలు కళ్లజూస్తున్నారు. డ్వాక్రా సంఘాలకు రూ.100 కోట్లు రుణాలుగా అందజేస్తే దీనిలో రూ.2 కోట్లు కమీషన్ల రూపంలోనే సమర్పించాల్సిన దుస్థితి నెలకొంది. ఇంతా జరుగుతున్నా ఈ కమీషన్ల వ్యవహారాన్ని కట్టడి చేసే వారే కరువయ్యారు.

రుణాలు మంజూరు చేసేదిలా...

డ్వాక్రా సంఘానికి రుణం మంజూరు చేయాలంటే ఈ సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు ముందుగా గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ధ్రువీకరించాలి. అక్కడి నుంచి ఈ సంఘం ఏ ఇతర బ్యాంకులోనూ రుణం తీసుకోలేదని కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లు ధ్రువీకరిస్తూ సంతకాలు చేయాలి. గ్రామైక్య సంఘాల వద్ద ఉండే బుక్‌కీపర్లు దీనికి సంబంధించిన రికార్డులు రాయాలి.

దీంతో పాటు రిసోర్స్‌పర్సన్లు డ్వాక్రా సంఘం సక్రమంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ చేయాలి. వీరంతా సంతకాలు చేసి సంబంధిత పత్రాలను బ్యాంకులో సమర్పించిన తర్వాత.. అన్నీ సక్రమంగా ఉంటే బ్యాంకు మేనేజరు రుణం మంజూరు చేస్తారు. రుణం మంజూరైన వెంటనే గ్రామైక్య సంఘాల ప్రతినిధులు, బుక్‌కీపర్లు, కమ్యూనిటీ కో-ఆర్డినేటర్లకు మామూళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో ఈ ఏడాది రూ.236.57 కోట్లు మాత్రమే రుణాలుగా అందజేసినా, కమీషన్ల రూపంలో రూ.4.7 కోట్లు చేతులు మారటం గమనార్హం.
 
జనశ్రీ బీమా మంజూరులోనూ చేతివాటం

డ్వాక్రా సంఘాల్లోని సభ్యులు ఎవరైనా మరణిస్తే వారికి జనశ్రీ బీమా యోజన పథకం ద్వారా బీమా సొమ్ము చెల్లిస్తారు. ఎవరైనా సభ్యురాలు సహజ మరణం పొందితే ఆమె కుటుంబానికి రూ.30 వేలు అందజేస్తారు. గత ఏడాది జనశ్రీ బీమా యోజన పథకాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్న బందరు మండలంలో ఐకేపీలో పనిచేసిన ఓ ఎకౌంటెంట్ దాదాపు రూ.50 లక్షల వరకు సొమ్ము కాజేసినట్లు అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ ఘటనలో కమ్యూనిటీ కో-ఆర్డినేటర్‌ను, ఎకౌంటెంట్‌ను సస్పెండ్ చేసిన అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి చేతులు దులుపుకున్నారు. ఈ సొమ్ము ఇప్పటి వరకు రికవరీ కాకపోవటం గమనార్హం. తాజాగా మచిలీపట్నం పురపాలక సంఘంలోని 34వ వార్డులో ఓ డ్వాక్రా మహిళ చనిపోయింది. ఆమె కుటుంబ సభ్యురాలు వరలక్ష్మి నామినీగా ఉన్నారు. ఈ వార్డులో వరలక్ష్మి అనే మహిళ రిసోర్స్ పర్సన్‌గా పనిచేస్తోంది. ఈ విషయాన్ని గమనించిన బీమా మిత్ర నామినీ ఖాతాలో కాకుండా రిసోర్స్ పర్సన్ ఖాతాలో ఈ నగదును జమ చేయించి గుట్టుచప్పుడు కాకుండా డ్రా చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇలాంటి ఘటనలు జిల్లా వ్యాప్తంగా అనేకం జరుగుతూనే ఉన్నాయని, అధికారులు వీటిపై దృష్టిపెట్టాలని పలువురు డ్వాక్రా మహిళలు కోరుతున్నారు.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement