పడకేసిన పాలన
నెల్లూరు(రెవెన్యూ): ఎన్నికల విధులు, అధికారుల బదిలీలతోనే ఈ ఏడాదంతా గడిచిపోయింది. ప్రధానంగా అభివృద్ధి కుంటుపడటంతో ప్రజలకు జరిగిన ప్రయోజనం నామమాత్రమే. ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్, సాధారణ ఎన్నికలు వరుసగా రావడంతో వాటి నిర్వహణలో అధికారయంత్రాంగం పూర్తిగా నిమగ్నమైం ది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడంలో అధికారులు విజయవంతమయ్యారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో అభివృద్ధి పనులు స్తంభిం చాయి. ఇందిరమ్మ గృహాలు, ఉపాధి హామీ పనులు తదితర పథకాలు ఆగిపోయాయి. గత ఏడాది జిల్లాలో రూ .146.45 కోట్ల నిధులతో ఉపాధి హామీ పనులు జరగగా ఈ ఏడాదిలో రూ.88.23 కోట్లకే పరిమితమయ్యాయి. మరోవైపు ఏడాది ప్రారంభంలోనే పలువురు అధికారులకు స్థానచలనం కలిగింది.
జాయింట్ కలెక్టర్ లక్ష్మీకాంతం, డీఆర్వో రామిరెడ్డి, ఏజేసీ పెంచలరెడ్డి, డీఎస్‌ఓ ఉమామహేశ్వరరావు, డీఆర్‌డీఏ పీడీ వెంకటసుబ్బయ్య తదితరులు బదిలీ ఆయ్యారు. జా యింట్ కలెక్టర్‌గా జి. రేఖారాణి, డీఆర్‌ఓగా నాగేశ్వరరావు, ఏజేసీగా రాజ్‌కుమార్, డీఆర్‌డీఏ పీడీగా చంద్రమౌళి, డీఎస్‌ఓగా జె. శాంతకుమారి, డీఈఓగా దొంతు ఆంజనేయులు వచ్చారు. ఎన్నికల బదిలీపై వచ్చిన వారిలో డీఆర్‌ఓ నాగేశ్వరరావు, డీఎస్‌ఓ శాంతకుమారి మాత్రమే ఇతర జిల్లాలకు బదిలీ ఆయ్యారు. తాజాగా డీఆర్వోగా సుదర్శన్‌రెడ్డి, డీఎస్‌ఓగా సంధ్యారాణి ఉన్నారు. ఎన్నికల ప్రక్రియ నిర్వహణలో విజయవంతమైన కలెక్టర్ శ్రీకాంత్ ఇటీవలే నూతన రాజధాని నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన సీఆర్‌డీఏ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ క్రమంలో కలెక్టర్‌గా ఎం.జానకి బాధ్యతలు స్వీకరించారు. ఇద్దరు ఎస్పీలు మారారు. ప్రస్తుతం ఎస్పీగా సెంథిల్‌కుమార్ వ్యవహరిస్తున్నారు.
బదిలీల తీరుపై విమర్శలు
పోలీసు, రెవెన్యూ శాఖ బదిలీల్లో అనేక అక్రమాలు జరిగాయి. టీడీపీ నాయకులు అనుకూలురిని తమ ప్రాంతాలకు బదిలీ చేయించుకునేందుకు ఉన్నతాధికారులపై ఒత్తిడి చేసి తమకు కావలసిన వారిని వేయించుకున్నారు. సీఎస్‌డీటీల బదిలీలల్లో అనేక పర్యాయాలు జాబితాను మార్పు చేశారు. ఎంపీడీఓల విషయంలోనూ తమ్ముళ్లు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఉదయం బాధ్యతలు తీసుకున్న అధికారుల్లో కొందరిని స్థానిక నాయకులు సాయంత్రానికే మరో చోటుకు బదిలీ చేయించిన సంఘటనలు ఉన్నాయి. పోలీసు శాఖలోనే ఇదే తరహాలో బదిలీలు నడిచాయనే ఆరోపణలు ఉన్నాయి. రేంజ్ పరిధిలో మొదట విడత 79 మంది సీఐలను బదిలీ చేశారు. అయితే తమ్ముళ్లు అడ్డుతగిలారు. ముఖ్యమంత్రి, హోంమంత్రి నుంచి ఫోన్లు చేయించి తమ్ముళ్లకు నచ్చిన వారికి పోస్టింగ్ ఇప్పించుకున్నారు. మొత్తం 85 మంది సీఐలను బదిలీ చేశారు.
అర్జీలపై ప్రత్యేక దృష్టి
గ్రీవెన్స్‌డే సందర్భంగా వారం వారం వచ్చే వివిధ అర్జీల్లో ప్రజలు పేర్కొన్న సమస్యల పరిష్కారంపై అప్పటి కలెక్టర్ ఎన్.శ్రీకాంత్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు పరిష్కారం పేరుతో ఓ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేశారు. దీనికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ రూపకల్పనపై కలెక్టర్ శ్రీకాంత్‌తో పాటు కాల్‌సెంటర్ ఇన్‌చార్జి వై.నాగేశ్వరరావు రెండు నెలలు శ్రమించారు. ఈ పథకాన్ని వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు.
మహిళా రాజ్యం
జిల్లాలోని ప్రస్తుతం అనేక కీలక పోస్టుల్లో మహిళా అధికారులు కొనసాగుతున్నారు. కలెక్టర్‌గా ఎం.జానకి, జాయింట్ కలెక్టర్‌గా జి.రేఖారాణి, డీఎస్‌ఓగా సంధ్యారాణి, డీఎంహెచ్‌ఓగా భారతీరెడ్డి, డ్వామా పీడీగా గౌతమి ఉన్నారు.
చంద్రబాబు మార్కు పాలన
ఈ ఏడాది జూన్‌లో టీడీపీ అధికారం చేపట్టింది. పాలనలో సీఎం చంద్రబాబు తన పాతశైలినే ప్రదర్శిస్తూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. వివిధ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడమే లక్ష్యంగా పాలన సాగుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్కాలర్‌షిప్‌కు సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం కఠినతరం చేయడంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 30 శాతం మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లను కోల్పోయే పరిస్థితి నెలకొంది. కొత్త ప్రభుత్వ హయాంలో రేషన్‌కార్డులు మంజూరవుతాయని భావించిన ప్రజలకు నిరాశే మిగిలింది. పైగా పరిశీలన పేరుతో జిల్లాలో సుమారు 40 వేల తెల్లకార్డులను రద్దు చేశారు. రేషన్‌దుకాణాలను తెలుగు తమ్ముళ్లకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న డీలర్లపై 6ఏ కేసులు బనాయించి వారిని తొలగించేయత్నాల్లో ఉన్నారు. టీడీపీ కార్యకర్తలతో జన్మభూమి కమిటీలను వేసి 30 వేల మందిని సామాజిక పింఛన్ల లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. పేదలకు సంబంధించిన భూపంపిణీ పథకం అటకెక్కింది. ఇసుక రీచ్‌లను పేరుకు స్వయం సహాయక సంఘాల మహిళలకు అప్పగించినా టీడీపీ నేతలే పెత్తనం చెలాయిస్తున్నారు. టైరుబండి ఇసుకకు అధికారిక రుసుం రూ.600గా నిర్ణయించడంతో సామాన్యులు ఇళ్ల నిర్మాణాలను ఆపేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.