నిధుల సేకరణ వెంటనే సాధ్యం కాదు
* ‘రుణమాఫీ’పై చేతులెత్తేసిన సుజనా చౌదరి కమిటీ
* కనీసం రెండు నెలల సమయం పడుతుందని వెల్లడి
* రేపు బ్యాంకుల సీఎండీలతో ముఖ్యమంత్రి భేటీ
* రూ.6 వేల కోట్ల వరకు చెల్లింపు ప్రతిపాదన!
సాక్షి, హైదరాబాద్: రుణ మాఫీకి నిధుల సేకరణపై సుజనా చౌదరి కమిటీ చేతులెత్తేసింది. ఇప్పటికిప్పుడు రుణ మాఫీకి అవసరమైన నిధులు సేకరించడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. రెండురోజుల క్రితం ఈ కమిటీతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. నిధుల సేకరణకు ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నిర్ణయించారు. అయితే కార్పొరేషన్ ఏర్పాటుతో పాటు నిధుల సమీకరణ ఇప్పటికిప్పుడు సాధ్యం కాదని, కనీసం రెండు నెలల సమయం పడుతుందని కమిటీ చెప్పింది. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం రుణ మాఫీకి బడ్జెట్ నుంచి రూ.4,250 కోట్లు విడుదల చేయడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగింది. దీంతో తెలంగాణ సర్కారు బాటలోనే పయనించాలని నిర్ణరుుంచింది. ఇందులో భాగంగా బ్యాంకుల సీఎండీలతో సోమవారం సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ భేటీలో సీఎం కూడా పాల్గొంటారని అధికార వర్గాలు తెలిపాయి.
రైతుల వ్యవసాయ రుణాల మాఫీకి సంబంధించి ప్రభుత్వం అనుసరించనున్న విధానాన్ని చంద్రబాబు ఈ సందర్భంగా ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపా రు. బడ్జెట్‌లో రుణ మాఫీ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించినందున ఈ ఏడాది ఆ మేరకు లేదా అదనంగా మరో వెయ్యి కోట్లు విడుదల చేస్తామని, బ్యాంకులు రైతులందరి రుణాలను రెన్యువల్ చేయూలని ముఖ్యమంత్రి కోరనున్నట్లు తెలిపారు. ఇలా ఏడాదికి కొంత మొత్తం చొప్పున నాలుగేళ్ల కాలంలో మొత్తం చెల్లిస్తామని పేర్కొననున్నారు. పంటల బీమా గడువుతో పాటు ఖరీఫ్ సీజన్ పూర్తిగా ముగిసిన తరువాత ఇప్పుడు ఎంతో కొంత చెల్లిస్తామనడం.. రైతుల సంక్షేమంపై ప్రభుత్వానికి ఏపాటి చిత్తశుద్ధి ఉందో స్పష్టం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నారుు. రుణ మాఫీకోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే కార్పొరేషన్‌కు ఐదు నుంచి పదేళ్ల పాటు ఎక్సైజ్ ఆదాయాన్ని మళ్లిస్తామని, ఈ నేపథ్యంలో కార్పొరేషన్‌కు బ్యాంకులు ఎంతవరకు అప్పులు ఇవ్వగలవో చెప్పాలని కూడా ప్రభుత్వం కోరనుంది. ఈ విషయంలో బ్యాంకులు నుంచి వచ్చే స్పందన ఆధారంగానే కార్పొరేషన్ ఏర్పాటుపై ముందడుగు వేయాలని నిర్ణరుుంచింది.
ప్రణాళికేతర వ్యయంలో కోత వీలుకాదు!
రైతుల రుణ బకాయిల్లో ఎంతో కొంత మొత్తం బ్యాంకులకు చెల్లించాల్సి ఉన్నందున ప్రణాళికేతర వ్యయంలో 15 శాతం మేర కోత విధించాలని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆ శాఖ ఉన్నతాధికారులకు సూచించారు. ఈ అం శంపై ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ప్రణాళికేతర పద్దులో విద్యుత్ , బియ్యం సబ్సిడీలతో పాటు సామాజిక పింఛన్లు, ఉద్యోగుల జీత భత్యాలు, స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీరుుంబర్స్‌మెంట్ వంటివి ఉన్నాయని, ఈ రంగాలకే సరిపడా కేటాయింపులు చేయనందున ఇప్పుడు కోతలు పెట్టే పరిస్థితి కనిపించడం లేదని అధికారులు పేర్కొంటున్నారు.