
డబ్బులు.. జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక జవాబుదారీ విధానం పాటించకుంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాలుగో త్రైమాసిక నిధుల విడుదలను నిలిపేస్తామని ఆర్థికశాఖ హెచ్చరించింది. ఈమేరకు అన్ని శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులకు మెమో జారీ చేసింది. ఆయా శాఖల ఆస్తుల వివరాల నివేదికను ప్రతి ఆర్నెల్లకు ఒకసారి పంపాలని మెమోలో పేర్కొన్నారు. బ్యాంకుల్లో ఖాతాల వివరాలను నెలవారీగా ఆర్థిక శాఖకు తెలియజేయాలని స్పష్టం చేశారు. నగదు పుస్తకంలోని వివరాలను, బ్యాంకుల్లో నగదు, చెక్ నిల్వల మధ్య సమన్వయాన్ని ప్రతి నెలా పరిశీలించాలని ఆదేశించారు.
మెమోలో ముఖ్యాంశాలు..
- ట్రెజరీల్లో నగదు నిల్వపై ప్రతినెలా సమన్వయ నివేదిక పంపాలి.
- నెలవారీగా గ్రాంట్లు రికవరీతో పాటు వినియోగ సర్టిఫికెట్లను సమర్పించాలి.
- ప్రతి నెలా ఆడిట్ పేరాలపై స్పందించాలి.
- ఎ.సి, డి.సి బిల్లుల వివరాలతో పాటు నెలవారీ వ్యయం స్టేట్‌మెంట్‌ను ఆర్థికశాఖకు ఇవ్వాలి.
- నెలవారీ ఖర్చుకు సంబంధించి సంబంధిత శాఖాధిపతి రిజిష్టర్‌ను నిర్వహించాలి. లేదంటే కఠిన చర్యలు తప్పవు.
కేంద్ర నిధుల్లో కోత
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులు, వివిధ గ్రాంట్లలో రాష్ట్రానికి కోత పడనుంది. ఆర్థిక క్రమశిక్షణ చర్యల్లో భాగంగా కేంద్రం నాలుగో త్రైమాసిక నిధుల్లో 33 శాతానికి మించి విడుదల చేయరాదని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద విడుదలై, వ్యయం కాని నిధుల వివరాలను కేంద్ర ఆర్థికశాఖ కోరింది. నిధులు నిల్వ ఉంటే తదుపరి ఆ పథకాలకు విడుదలను నిలిపేయనుంది. వివిధ గ్రాంట్లలో కూడా రాష్ట్రానికి కోతపడనుంది.