న్యూఢిల్లీ: సవాళ్లకు సంబంధించి దేశం అప్రమత్తత పాటించాల్సిన అవసరం ఉందని ఆర్థికమంత్రిత్వశాఖ నెలవారీ సమీక్ష స్పష్టం చేసింది. వ్యవసాయ ఉత్పత్తి తగ్గుదల, ధరల పెరుగుదలకు అవకాశం, భౌగోళిక ఉద్రిక్తతల వంటి పలు అంశాలను ఈ సందర్భంగా ఆర్థికశాఖ ప్రస్తావించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు 6.5 శాతం ఉంటుందన్న కేంద్ర అంచనాలను ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ (ఏడీబీ) నివేదికలు బలపరుస్తున్నప్పటికీ వృద్ధి ధోరణిపై సవాళ్లూ ఉన్నాయని సూచించింది. ముఖ్యంగా ద్రవ్యోల్బణం విషయంలో ఎదురయ్యే సవాళ్లను ఆర్థికశాఖ ఈ సందర్భంగా ప్రస్తావించింది. ఎల్ నినో పరిస్థితులు కరువు పరిణామాలకు దారితీయడం, వ్యవసాయోత్పత్తి తగ్గే అవకాశాలు, ధరలు పెరగడం, భౌగోళికంగా రాజకీయ అనిశ్చితి, ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి సవాళ్ల వంటి అంశాల్లో భారత్ అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యమని విశ్లేషించింది. సమీక్షలో మరికొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే..
2022–23లో సవాళ్లను తట్టుకున్నాం..
ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, మహమ్మారి సవాళ్లు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రతికూలతలు ఉన్నప్పటికీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో మంచి పనితీరు కనబరిచింది. ఇతర ప్రధాన ఆర్థిక వ్యవస్థల కంటే ఎక్కువగా 7 శాతం వృద్ధి అంచనా ఉంది. తద్వారా ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా పురోగమిస్తోంది. ద్రవ్యోల్బణం, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి ఒక నిర్దిష్ట కాలంలో వచ్చీ–పోయే విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) వంటి స్థూల ఆర్థిక అంశాల విషయంలో భారత్ స్థిరత్వంతో కూడిన పురోగతిని నమోదుచేసుకుంది.
బ్యాం‘కింగ్’
వడ్డీరేట్లను పెంచినప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా నిలద్రొక్కుకుంది. వృద్ధి స్థిరత్వానికి ఇది సంకేతం. బ్యాంకులపై వేర్వేరుగా ‘స్ట్రస్ టెస్ట్’ల నిర్వహణ కూడా జరుగుతోంది. ముఖ్యంగా డిపాజిట్ల విభాగమూ పటిష్టంగా ఉంది. బ్యాంకుల్లో డిపాజిట్లు సురక్షితం అని డిపాజిటర్లు భావిస్తున్నందున, డిపాజిట్లలో 63 శాతం వేగంగా విత్‌డ్రా (ఉపసంహరణ) అవడానికి అవకాశాలు లేవు. ఇది బ్యాంకింగ్ పట్ల డిపాజిట్లకు ఉన్న విశ్వాసంతో పాటు, ఎకానమీ స్థిరత్వానికి దోహదపడే అంశం. ఈ కారకాలన్నీ భారతీయ బ్యాంకులను అమెరికా, యూరోపియన్ యూనియర్ బ్యాంకుల కన్నా భిన్నంగా ఉంచుతున్నాయి. ఆయా దేశాల్లోని బ్యాంకులు కఠినమైన ద్రవ్య విధానం ఉపసంహరణ నేపథ్యంలో తీవ్ర సవాళ్లను ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.
ద్రవ్యోల్బణం ప్రస్తుతం అదుపులో..
ధరల పరిస్థితిని పరిశీలిస్తే.. పరిస్థితి ప్రస్తుతం అదుపులోనే ఉంది. టోకు ధరల ఆధారిత (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం మార్చిలో 29 నెలల కనిష్టానికి దిగి వచ్చింది. 1.34 శాతానికి పరిమితమైంది. గత 10 నెలల నుంచి తగ్గుతూ వస్తోంది. ద్రవ్యోల్బణం రేటు తగ్గడానికి ప్రధానంగా ప్రాథమిక లోహాలు, టెక్స్‌టైల్స్, ఆహారయేతర ఆర్టికల్స్, ఖనిజాలు, రబ్బర్.. ప్లాస్టిక్ ఉత్పత్తులు, క్రూడ్ పెట్రోలియం .. సహజ వాయువు, పేపర్ .. పేపర్ ఉత్పత్తుల ధరలు తగ్గుముఖం పట్టడమే కారణం. అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు 2022 గరిష్టాల నుంచి దిగివస్తుండటం, దేశీయంగా సానుకూల బేస్ ఎఫెక్ట్‌ల ప్రభావంతో డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణం రాబోయే రోజుల్లో మరింత తగ్గొచ్చు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్ ద్రవ్యోల్బణం సగటున 5.2 శాతం స్థాయిలో ఉండొచ్చని ఆర్‌బీఐ అంచనా వేస్తోంది. 2023 మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 15 నెలల కనిష్ట స్థాయి 5.66 శాతానికి దిగివచ్చింది. నవంబర్, డిసెంబర్ మినహా 2022 జనవరి నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న 6 శాతం ఎగువనే కొనసాగింది. 2021–22లో సగటున వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.5 శాతంగా ఉంది. 2022–23లో 6.7 శాతానికి పెరిగింది. అయితే గడచిన ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలలూ చూస్తే, సగటు ద్రవ్యోల్బణం 6.1 శాతంగా ఉండడం గమనార్హం. మొదటి ఆరు నెలల్లో ఈ రేటు ఏకంగా 7.2 శాతంగా ఉంది.
అంతర్జాతీయంగా కమోడిటీల ధరలు తగ్గడం, సరఫరాల చైన్ మెరుగుదలకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, ఆర్‌బీఐ అనుసరిస్తున్న కఠిన ద్రవ్య విధానం (2022 మే తర్వాత బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో 2.5 శాతం పెరిగి 6.5 శాతానికి ఎగసిన సంగతి తెలిసిందే) వంటి అంశాలు ద్రవ్యోల్బణం అదుపులోనికి రావడానికి దోహదపడింది. ఇదే ధోరణి కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2023–24లో 5.3 శాతం ఉంటుందని ఫిబ్రవరి ఆర్‌బీఐ పాలసీ అంచనా వేస్తే, ఏప్రిల్ మొదట్లో జరిగిన పాలసీ సమీక్ష ఈ అంచనాలను 5.2 శాతానికి తగ్గించడం వృద్ధికి దారితీసే మరో హర్షణీయ పరిణామం.
భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు
భారత్ ప్రస్తుత ఫారెక్స్ నిల్వలు దాదాపు 12 నెలల దిగుమతులకు సరిపోతాయని అంచనా. ప్రస్తుత నిల్వలు భారత్ ఎకానమీకి భరోసాను ఇస్తున్నాయి. 2021 అక్టోబర్‌లో భారత్ ఫారెక్స్ నిల్వలు 645 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గరిష్ట స్థాయి నుంచి 100 బిలియన్ డాలర్లుకుపైగా పడిపోయాయి. అయితే అటు తర్వాత తిరిగి కొంత స్థిరంగా కోలుకుంటున్నాయి. ఈ పరిమాణం ఏప్రిల్ 14వ తేదీతో ముగిసిన వారంలో 586.412 బిలియన్ డాలర్లకు చేరాయి. ఫారిన్ ఫోర్టిఫోలియో ఇన్వెస్ట్‌మెంట్ల (ఎఫ్‌పీఐ) ఫారెక్స్ పెరుగుదలకు దోహదపడుతున్నాయి. దీనితో గడచిన ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో కరెంట్ అకౌంట్‌లోటు (క్యాడ్) కట్టడిలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment