సమైక్యాంధ్ర కోరుతూ సీమాంధ్రలో జరుగుతున్న మహోజ్వల ఉద్యమం చావకూడదనీ, కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూడూ కలిసి ఉద్యమాన్ని ముందుకు నడిపించాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, గుంటూరు జిల్లా బాపట్ల శాసనసభ్యుడు గాదె వెంకటరెడ్డి అన్నారు. ఇందుకోసం సీమాంధ్రలో ’నాన్ పొలిటికల్ జేఏసీ’ ఏర్పాటు ఎంతో అవసరమన్నారు. గుంటూరులో శుక్రవారం విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ, సమైక్య ఉద్యమంలో కీలకంగా ఉన్న న్యాయవాద జేఏసీలోని ప్రధానమైన వ్యక్తిని అందరి ఆమోదంతో ఎంపిక చేసి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం ఎంతో అవసరమన్నారు.
కొందరు మంత్రులు విభజన పూర్తయిందనీ, ఇక ఆపడం కష్టమంటూ పత్రికా ప్రకటనలు చేయడం దౌర్భాగ్యమన్నారు. ఎవరెన్ని చెప్పినా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ముమ్మాటికీ సమైక్యవాదేనన్నారు.