
పోలవరం అదనపు భారం ఎవరు భరించాలి?
వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి 2014 తర్వాత పెరిగిన అంచనాల వ్యయం అదనపు మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఉమా భారతి రాజ్యసభలో పిడుగు లాంటి నిర్ణయాన్ని ప్రకటిస్తే టీడీపీ ఎంపీలు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఇంత ముఖ్యమైన అంశం రాజ్యసభలో చర్చకు వచ్చినపుడు టీడీపీ ఎంపీలు నక్కి నక్కి దాక్కొని తెలుగు ప్రజల గొంతు కోశారనిఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇపుడు ఈ అదనపు భారం ఎవరు భరించాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాటాడారు. విభజన చట్టం ప్రకారం పూర్తి నిధులతో కేంద్రమే నిర్మించి ఇవ్వాల్సిన ఈ ప్రాజెక్టును కమీషన్ల కోసం కక్కుర్తి పడి రాష్ట్ర ప్రభుత్వం తన చేతుల్లోకి తీసుకుందని విమర్శించారు.
ఎప్పటికప్పుడు అంచనా వ్యయాలను పంపిస్తున్నట్లు చెబుతున్న సీఎం.. కేంద్రాన్ని ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌పై ప్రతీ దానికీ విమర్శలతో నానా యాగీ చేసే టీడీపీ నేతలు రాజ్యసభలో కేంద్ర మంత్రి ప్రకటన చేస్తూంటే ఎక్కడున్నారని గడికోట ప్రశ్నించారు. ‘ఈ ప్రాజెక్టు వ్యయాన్నంతా కేంద్ర ప్రభుత్వమే భరిస్తాం అంటే మీకు నొప్పి ఏంటి?’ అని చంద్రబాబు అన్నారని, ఇపుడు ఉమాభారతి మాటలకు ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.