వేకువ విషాదానికి నేటితో నెల | GAIL gas pipeline explosion one Month | Sakshi
Sakshi News home page

వేకువ విషాదానికి నేటితో నెల

Published Sun, Jul 27 2014 3:00 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM

వేకువ విషాదానికి నేటితో నెల - Sakshi

వేకువ విషాదానికి నేటితో నెల

కాకినాడ క్రైం : నగరంలో గెయిల్ గ్యాస్ విస్ఫోటం జరిగిన నెలరోజులు కావొస్తున్నా ఇంకా తొమ్మిది మంది కాకినాడ అపోలో, ట్రస్టు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థితి నేటికీ విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటనలో 21 మంది మృతి చెందగా కాకినాడలోని మూడు ఆస్పత్రుల్లో 18 మంది చికిత్స పొందారు. అయితే వారిలో స్వల్పగాయాలైన తొమ్మిది మందిని డిశ్చార్జ్ చేయగా, మరో తొమ్మిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ కృష్ణన్, అతడి భార్య మేఘన, వానరాశి దుర్గాదేవి, ఆమె కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఏడేళ్ల మోహన వెంకట కృష్ణ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుద్రరాజు సూరిబాబును సాయిసుధ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించడంతో ఆయన కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బోణం పెద్దిరాజు, అతడి భార్య రత్నకుమారి, అక్క సత్యవతి ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ పైపులైన్ పేలిన ఘటన తలచుకుని క్షతగాత్రులతోపాటు వారి బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. నగరం గ్రామానికి చెందిన వారైనప్పటికీ అక్కడి వెళ్లేందుకు వారు నిరాకరిస్తున్నారు.
 
 యూరియా, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం
 మామిడికుదురు : గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్) నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారంలోని రెండు ప్లాంట్లకు ప్రతి రోజూ సరఫరా అయ్యే 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది. దీని వల్ల రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి బ్రేక్‌పడింది తద్వారా ఈ సంస్థకు రోజుకు రూ.రెండు కోట్ల నష్టం వాటిల్లుతోంది.
 
 కాకినాడ సమీపంలోని ఉప్పాడలోని స్పెక్ట్రమ్, విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్‌కో, వేమగిరి తదితర విద్యుత్ కేంద్రాలకు రోజుకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా అయ్యేది. దీంతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల నుంచి రోజుకు మరో పది లక్షలు క్యూబిక్ మీటర్లు వెరసి, మొత్తం 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కూడా నిలిచింది. దీని వల్ల 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. శుక్రవారం నుంచి మినీ రిఫైనరీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళం వేయడంతో చమురు ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. రిఫైనరీలో మొత్తం 250 టన్నుల ముడి చమురు శుద్ధి అవుతోంది. దీని ద్వారా నాఫ్తా, సూపర్ కిరోసిన్, డీజిల్, టర్పంటెన్ ఆయిల్, రెడ్యూస్డ్ క్రూడాుుల్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ప్రతి రోజూ 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు.
 
 మొక్కుబడి విచారణ
 ప్రమాదానికి గెయిల్ అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని ప్రభుత్వం ప్రకటించినా ఆ సంస్థపై తీసుకున్న చర్యలు శూన్యం. గెయిల్‌పై కేసు నమోదు చేసినా, సంబంధిత అధికారులను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికీ విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతకు రెండు నెలల ముందు ఇదే ప్రాంతంలో గ్యాస్ లీకైనప్పుడు గెయిల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నా ఆ కోణంలో విచారణ నిర్వహించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హై పవర్ కమిటీ ప్రమాదం జరిగిన రెండో రోజు సంఘటన స్థలానికి వచ్చి అరగంటలో విచారణ పూర్తి చేసి వెళ్లిపోయింది. పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్‌కే సింగ్ ఆధ్వర్యంలో ఓ బృందం పేలిన పైప్‌లైన్, సరఫరా అవుతున్న గ్యాస్ శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా బాధితులను గుర్తిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. గెయిల్ సంస్థ తమ పైప్‌లైన్ల సామర్ధ్య పరిశీలన కోసం ఏర్పాటు చేసిన థర్డ్‌పార్టీ ఎంక్వైరీ ఇంజనీర్స్ ఇండియా విచారణ సైతం ఇంకా ప్రారంభం కానట్టు తెలిసింది.
 
 ఇంకా భయంతోనే...
 పేలుడు దుర్ఘటనలో నాతో పాటు మా కుమారుడు పెద్దిరాజు, కోడలు రత్నకుమారి, మనుమలు కల్యాణి, హర్షిత, శాంతకుమారి, మా కుమార్తె రేకపల్లి సత్యవతి(అమ్మాజీ) తీవ్రంగా గాయపడ్డారు. నాతో పాటు నా ముగ్గురు మనుమలు ఆస్పత్రి నుంచి ఈ నెల 22న డిశ్చార్‌‌జ అయ్యాం. కానీ నా కుమారుడు, కోడలు, కుమార్తె ఇంకా కాకినాడ ట్రస్టు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నేను నగరం చేరగానే నా మనుమలు ముగ్గురూ ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో వారిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు. నా గాయాలు ఇంకా తగ్గలేదు.                                         
 - బోనం పళ్లాలమ్మ
 
 మమ్మల్ని ఆదుకోండి  
 ఇంట్లో నిద్రిస్తున్న మా కుటుంబ సభ్యులంతా గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటంతో భయంతో పరుగులు తీశాం. ఆ సమయంలో నేను అదుపు తప్పి పడిపోయా. దాంతో నా కుడి చేయి విరిగింది. దీనిపై గెయిల్ అధికారులకు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోలేదు సరికదా, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ప్రమాదం జరిగి నెల రోజులైనా పరిహారం ఇంకా అందలేదు. విరిగిన చేయికి వైద్యం చేయించుకునేందుకు డబ్బు బాగా ఖర్చయ్యింది. ఇప్పటికైనా గెయిల్ అధికారులు స్పందించి పరిహారం ఇప్పిస్తారని ఆశిస్తున్నాం.  
 - వానరాశి వరలక్ష్మీ శేషవేణి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement