GAIL gas pipeline explosion
-
‘గ్యాస్ పైప్‌లైన్ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స’
సాక్షి, న్యూఢిల్లీ: గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స అందించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరంలో 2014లో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 17 మంది బాధితులకు కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్మెంట్ అందించడం జరిగిందని మంత్రి చెప్పారు. వారిలో 14 మందికు విజయవంతంగా చికిత్స పూర్తయిందన్నారు. మిగిలిన ముగ్గురు బాధితుల చికిత్సను, ఆరోగ్య పరిస్థితులను గెయిల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. బాధితులకు మెరుగైన చికిత్స, ప్రయాణ ఏర్పాట్లు, వసతి ఖర్చులన్నింటినీ గెయిల్ భరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు దుర్ఘటన అనంతరం నగరంతోపాటు ఆ పరిసర ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గెయిల్ ప్రారంభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటి వరకు గెయిల్ అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు మంత్రి చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు, ఇంటింటికీ వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మెడికల్ యూనిట్, నాణ్యమైన తాగు నీటి సరఫరా వంటివి వాటిలో ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు. -
‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి
సాక్షి, రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం వద్ద గెయిల్ గ్యాస్‌పైప్ లైన్ విస్ఫోటం నేపథ్యంలో.. బావులను మూసివేయడం తదితర కారణాల వల్ల తమ సంస్థ ఆదాయానికి రూ.240 కోట్ల మేర గండి పడిందని ఓఎన్జీసీ సీఎండీ డీకే షరాఫ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాటిల్లిన ఆర్థిక నష్టంకన్నా ప్రాణాతలు పోవడమే తమకు చాలా బాధ కలిగిస్తోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని రాజమండ్రి ఓఎన్జీసీ కార్యాలయంలో షరాఫ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్ కోర్ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం పేలుడు అనంతరం బలహీనంగా ఉన్న పైప్లైన్ల మార్పును వేగవంతం చేశామని షరాఫ్ చెప్పారు. కేజీ బేసిన్లో మొత్తం 860 కిలో మీటర్ల పైప్లైన్లు ఉండగా అందులో ఇప్పటికే 50 శాతం మార్పు చేసినట్లు తెలిపారు. ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌ల్లో ఉత్పత్తికి సన్నాహాలు ఆఫ్‌షోర్‌లో కాకినాడ నుంచి సముద్రంలో 65 కిలోమీటర్ల దూరంలో డి-6 బావి సమీపంలో ఉన్న కేజీ 98/2 బావి నుంచి 2018 నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని షరాఫ్ అన్నారు. ఇక్కడ నుంచి 2021లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించామని, కానీ ముందుగానే ప్రారంభించేందుకు ఎక్స్పర్ట్ అసెట్ మేనేజర్ ప్రతిపాదించారని తెలిపారు. ఓఎన్జీసీ 51 శాతం, కెయిర్న్ ఇండియా 49 శాతం భాగస్వామ్యంతో ఆన్‌షోర్‌లో 2017నాటికి నాగాయలంక వద్ద సహజ వాయువు ఉత్పత్తికి యత్నిస్తున్నామన్నారు. ఈ ప్లాంట్ నుంచి 2019 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఓఎన్జీసీ ద్వారా ప్రస్తుతం సుమారు 3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందన్నారు. ‘స్వచ్ఛ భారత్’లో భాగంగా దేశవ్యాప్తంగా బాలికల పాఠశాలల్లో రూ.100.85 కోట్లతో 2,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో జిల్లాకు 12 చొప్పున ఈ మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో ఆన్‌షోర్ డెరైక్టర్ అశోక్‌వర్మ, రాజమండ్రి అసెట్ మేనేజర్ దేబశిష్ సన్యాల్ పాల్గొన్నారు. -
వేకువ విషాదానికి నేటితో నెల
కాకినాడ క్రైం : నగరంలో గెయిల్ గ్యాస్ విస్ఫోటం జరిగిన నెలరోజులు కావొస్తున్నా ఇంకా తొమ్మిది మంది కాకినాడ అపోలో, ట్రస్టు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూనే ఉన్నారు. వారిలో ఒకరి పరిస్థితి నేటికీ విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఘటనలో 21 మంది మృతి చెందగా కాకినాడలోని మూడు ఆస్పత్రుల్లో 18 మంది చికిత్స పొందారు. అయితే వారిలో స్వల్పగాయాలైన తొమ్మిది మందిని డిశ్చార్జ్ చేయగా, మరో తొమ్మిది మంది ఇంకా చికిత్స పొందుతున్నారు. సెక్యూరిటీ ఇన్స్పెక్టర్ కృష్ణన్, అతడి భార్య మేఘన, వానరాశి దుర్గాదేవి, ఆమె కుమారులు ఎనిమిదేళ్ల మధుసూదన్, ఏడేళ్ల మోహన వెంకట కృష్ణ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రుద్రరాజు సూరిబాబును సాయిసుధ ఆస్పత్రి నుంచి అపోలోకు తరలించడంతో ఆయన కూడా అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. బోణం పెద్దిరాజు, అతడి భార్య రత్నకుమారి, అక్క సత్యవతి ట్రస్టు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గ్యాస్ పైపులైన్ పేలిన ఘటన తలచుకుని క్షతగాత్రులతోపాటు వారి బంధువులు ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. నగరం గ్రామానికి చెందిన వారైనప్పటికీ అక్కడి వెళ్లేందుకు వారు నిరాకరిస్తున్నారు. యూరియా, విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం మామిడికుదురు : గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటం నేపథ్యంలో జూలై ఒకటో తేదీ నుంచి కృష్ణా గోదావరి బేసిన్ (కేజీ బేసిన్) నుంచి సహజ వాయువు సరఫరా నిలిచిపోయింది. ఉభయ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఎరువులు, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కాకినాడలోని నాగార్జున ఎరువుల కర్మాగారంలోని రెండు ప్లాంట్లకు ప్రతి రోజూ సరఫరా అయ్యే 2.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది. దీని వల్ల రోజుకు ఐదు వేల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తికి బ్రేక్‌పడింది తద్వారా ఈ సంస్థకు రోజుకు రూ.రెండు కోట్ల నష్టం వాటిల్లుతోంది. కాకినాడ సమీపంలోని ఉప్పాడలోని స్పెక్ట్రమ్, విజయవాడ సమీపంలోని ల్యాంకో, విజ్జేశ్వరంలోని ఏపీ జెన్కో, వేమగిరి తదితర విద్యుత్ కేంద్రాలకు రోజుకు 20 లక్షల క్యూబిక్ మీటర్ల సహజ వాయువు సరఫరా అయ్యేది. దీంతో పాటు రిలయన్స్, కెయిర్న్ ఎనర్జీ సంస్థల నుంచి రోజుకు మరో పది లక్షలు క్యూబిక్ మీటర్లు వెరసి, మొత్తం 30 లక్షల క్యూబిక్ మీటర్ల గ్యాస్ సరఫరా కూడా నిలిచింది. దీని వల్ల 750 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఆటంకం కలిగింది. శుక్రవారం నుంచి మినీ రిఫైనరీ కార్యాలయం ప్రధాన గేట్లకు తాళం వేయడంతో చమురు ఉత్పత్తుల సరఫరా నిలిచిపోయింది. రిఫైనరీలో మొత్తం 250 టన్నుల ముడి చమురు శుద్ధి అవుతోంది. దీని ద్వారా నాఫ్తా, సూపర్ కిరోసిన్, డీజిల్, టర్పంటెన్ ఆయిల్, రెడ్యూస్డ్ క్రూడాుుల్ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనిని ప్రతి రోజూ 20 ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. మొక్కుబడి విచారణ ప్రమాదానికి గెయిల్ అధికారుల బాధ్యతారాహిత్యమే కారణమని ప్రభుత్వం ప్రకటించినా ఆ సంస్థపై తీసుకున్న చర్యలు శూన్యం. గెయిల్‌పై కేసు నమోదు చేసినా, సంబంధిత అధికారులను అరెస్టు చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికీ విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అంతకు రెండు నెలల ముందు ఇదే ప్రాంతంలో గ్యాస్ లీకైనప్పుడు గెయిల్ అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేపట్టి చేతులు దులుపుకోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నా ఆ కోణంలో విచారణ నిర్వహించకపోవడంపై బాధితులు మండిపడుతున్నారు. పెట్రోలియం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హై పవర్ కమిటీ ప్రమాదం జరిగిన రెండో రోజు సంఘటన స్థలానికి వచ్చి అరగంటలో విచారణ పూర్తి చేసి వెళ్లిపోయింది. పెట్రోలియం శాఖ ప్రధాన కార్యదర్శి ఆర్కే సింగ్ ఆధ్వర్యంలో ఓ బృందం పేలిన పైప్‌లైన్, సరఫరా అవుతున్న గ్యాస్ శాంపిళ్లను తీసుకుని ల్యాబ్‌కు పంపించారు. నివేదిక ఆధారంగా బాధితులను గుర్తిస్తామని చెప్పి చేతులు దులుపుకుంది. గెయిల్ సంస్థ తమ పైప్లైన్ల సామర్ధ్య పరిశీలన కోసం ఏర్పాటు చేసిన థర్డ్‌పార్టీ ఎంక్వైరీ ఇంజనీర్స్ ఇండియా విచారణ సైతం ఇంకా ప్రారంభం కానట్టు తెలిసింది. ఇంకా భయంతోనే... పేలుడు దుర్ఘటనలో నాతో పాటు మా కుమారుడు పెద్దిరాజు, కోడలు రత్నకుమారి, మనుమలు కల్యాణి, హర్షిత, శాంతకుమారి, మా కుమార్తె రేకపల్లి సత్యవతి(అమ్మాజీ) తీవ్రంగా గాయపడ్డారు. నాతో పాటు నా ముగ్గురు మనుమలు ఆస్పత్రి నుంచి ఈ నెల 22న డిశ్చార్జ అయ్యాం. కానీ నా కుమారుడు, కోడలు, కుమార్తె ఇంకా కాకినాడ ట్రస్టు ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. నేను నగరం చేరగానే నా మనుమలు ముగ్గురూ ఇక్కడికి వచ్చేందుకు భయపడుతున్నారు. దీంతో వారిని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోని వాళ్ల అమ్మమ్మ ఇంటికి తీసుకువెళ్లారు. నా గాయాలు ఇంకా తగ్గలేదు. - బోనం పళ్లాలమ్మ మమ్మల్ని ఆదుకోండి ఇంట్లో నిద్రిస్తున్న మా కుటుంబ సభ్యులంతా గ్యాస్ పైప్‌లైన్ విస్ఫోటంతో భయంతో పరుగులు తీశాం. ఆ సమయంలో నేను అదుపు తప్పి పడిపోయా. దాంతో నా కుడి చేయి విరిగింది. దీనిపై గెయిల్ అధికారులకు మొర పెట్టుకున్నా వారు పట్టించుకోలేదు సరికదా, గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. ప్రమాదం జరిగి నెల రోజులైనా పరిహారం ఇంకా అందలేదు. విరిగిన చేయికి వైద్యం చేయించుకునేందుకు డబ్బు బాగా ఖర్చయ్యింది. ఇప్పటికైనా గెయిల్ అధికారులు స్పందించి పరిహారం ఇప్పిస్తారని ఆశిస్తున్నాం. - వానరాశి వరలక్ష్మీ శేషవేణి -
బాధితులకు రూ.లక్ష పరిహారం ఇవ్వాలి
కంబాలచెరువు (రాజమండ్రి) :గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో గాయపడిన బాధితులకు లక్ష రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి డిమాండ్ చేశారు. స్థానిక ఐదు బళ్ల మార్కెట్ వద్ద శనివారం రాత్రి గ్యాస్ సిలిండర్ లీకైన సంఘటనలో గాయపడి, రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. ఆయనతో పాటు పీసీసీ మాజీ చీఫ్ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రి సి.రామచంద్రయ్య, ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్, ప్రసాదుల హరినాథ్ ఉన్నారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్షతగాత్రులంతా కూలీ పనులు చేసుకునే వారేనని, దీంతో వారి కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయే అవకాశం ఉందన్నారు. ఇటువంటి ప్రమాదాలు జరగకుండా మున్సిపల్, అగ్నిమాపక విభాగం అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. గ్యాస్ ప్రమాదాలపై ప్రజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు. నగరంలో గ్యాస్ విస్ఫోటం ఘటన విచారకరమన్నారు. కలెక్టర్ పరామర్శ గ్యాస్ సిలిండర్ పేలుడు సంఘటనలో క్షతగాత్రులను కలెక్టర్ నీతూ ప్రసాద్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న తొమ్మిది మంది పరిస్థితిని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సులోచన ద్వారా తెలుసుకున్నారు. చికిత్స విషయంలో వెనుకాడవద్దని, అవసరమైతే ఆస్పత్రి మార్చాలని సూచించారు. అనంతరం నగరం గ్యాస్ విస్ఫోటంలో క్షతగాత్రులైన భార్యాభర్తలు వానరాసి వెంకటప్రసాద్, సూర్యకుమారిని కలెక్టర్ పరామర్శించారు. వారి పరిస్థితి మెరుగ్గానే ఉందని, త్వరలోనే డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. ఆమె వెంట ఆర్డీఓ నాన్‌రాజ్, తహశీల్దార్ పిల్లి గోపాలకృష్ణ ఉన్నారు. -
‘నగరం’ బాధితులకు వైఎస్సార్సీపీ చేయూత
సాక్షి ప్రతినిధి, కాకినాడ :నగరం పైపులైన్ పేలుడు సంఘటనలో బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చింది. సంఘటనా స్థలాన్ని పరిశీలించి నేరుగా ఇంటింటికీ వెళ్లి మృతుల కుటుంబాలను ఓదార్చి, అమలాపురం, కాకినాడ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను శనివా రం పరామర్శించి పార్టీ అధినేత, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి వారిలో మనోస్థైర్యాన్ని నింపా రు. కుటుంబాలను పరామర్శించే సందర్భంలో రెక్కాడితే గాని డొక్కాడని వారి ఈతిబాధలను తెలుసుకుని చలించిపోయిన జగన్ పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయాన్ని తీసుకున్నారు. జగన్ ఆదేశాల మేరకు మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.లక్ష, క్షతగాత్రులకు రూ.25వేలు వంతున పార్టీ తరఫున సాయం అందించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి, అసెంబ్లీలో పార్టీ ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ, పార్టీ సీఈసీ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆదివారం తెలియచేశారు. మృతులు, క్షతగాత్రుల వివరాలు సేకరించి త్వరలో పార్టీ తరఫున సాయం అందించనున్నామని వారు తెలిపారు. నగరం ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు పార్టీ అధినేత జగన్ డిమాండ్ చేసినట్టుగా కోటి రూపాయలు ఇచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం మానవతాదృక్పథంతో స్పందించాలని వారు విజ్ఞప్తి చేశారు. దేశంలో అతి పెద్ద సంఘటన అయిన నగరం గ్యాస్ విస్ఫోటంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు తక్షణ సాయం అందించాలన్నారు. లేకుంటే పార్టీ తరఫున వారికి వెన్నంటి నిలుస్తామన్నారు. కేజీ బేసిన్లో లభ్యమయ్యే గ్యాస్‌లో రాష్ట్ర వాటా సాధించేందుకు ఇప్పటికైనా చంద్రబాబు కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలన్నారు. -
ప్రాణాలకు ముప్పయినా ఖర్చు తప్పడమే ముఖ్యం
మలికిపురం :నేల పొరల నుంచి వెలికితీసే గ్యాస్‌కు వెల కట్టగలం. దాన్ని తరలించడానికి వేసే లోహపు పైపులకు ధర నిర్ణయించగలం. కానీ..దేశంలోని సంపదనంతా వెచ్చించినా పోయిన ఒక్క ప్రాణాన్ని తిరిగి పోయగలమా? అది మానవాళికి అసాధ్యం. అలాంటప్పుడు ప్రాణాలను ఎంత అపురూపంగా పరిగణించాలి? వాటికి ముప్పు వాటిల్లకుండా ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి? దురదృష్టవశాత్తు కోనసీమలో కార్యకలాపాలు సాగిస్తున్న చమురు సంస్థలకు ఈ దృష్టే లోపించింది. అవి ధనానికిచ్చే ప్రాధాన్యాన్ని మానవ ప్రాణాలకు ఇవ్వడం లేదు. అందుకే కాలం చెల్లిన పైపులైన్లతో క్షణమైనా ఉత్పాతం జరిగే అవకాశం ఉందని తెలిసినా.. దండగమారి ఖర్చు అన్న వైఖరితో నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారి నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోనూ స్పందన కొరవడుతోంది. వారి తప్పిదాలకు మూల్యం అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం 16 మందిని బలిగొన్న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడుకు ప్రధాన కారణం.. కాలం చెల్లిన ఆ పైపులైన్‌ను మార్చకుండా మరమ్మతులతో కాలక్షేపం చేయడమే. తాటిపాక నుంచి విజయవాడకు 15 ఏళ్ల క్రితం వేసిన ఆ పైపులైన్ నిడివి 250 కిలోమీటర్ల పైనే. దీనితో కేజీ బేసిన్లో అనేక గెయిల్ పైప్‌లైన్లూ శిథిలావస్థకు చేరాయి. అయితే భారీ వ్యయంతో కొత్తగా లైన్లు వేయడం దండగ అనుకుంటున్న గెయిల్ పాత లైన్లతోనే నెట్టుకొస్తోంది. తాటిపాక-విజయవాడ పైపులైన్‌ను కొత్తగా వేయడానికి రూ.1000 కోట్లు పైనే ఖర్చవుతుంది. ఆ మొత్తం వెచ్చించడానికి ఇచ్ఛగించని గెయిల్ పైపులైన్ దుస్థితిని పసిగట్టేందుకు సెన్సర్లు కలిగి, రింగులా ఉండే ‘పిగ్’ అనే పరికరాన్ని వాడుతూ చేతులు దులుపుకొంటున్నారు. 18 అంగుళాల వెడల్పు గల తాటిపాక - విజయవాడ పైపులైన్లో రూ.40 కోట్ల విలువైన పిగ్‌ను వినియోగిస్తోంది. పైపులైన్లో గ్యాస్‌తో పాటు ఎంత దూరమైనా పయనించే పిగ్ ఎక్కడైనా దెబ్బ తిన్న భాగాలుంటే గుర్తిస్తుంది. ఆ సమాచారం మేరకు గెయిల్ అధికారులు పైపులైన్ దెబ్బతిన్న చోట కట్ చేసి మరమ్మతులు చేయిస్తున్నారే తప్ప, కొత్త పైపులైన్ వేయడం లేదు. 18 అంగుళాల పైపులైన్లో వాడే పిగ్ రూ.40 కోట్లు కాగా పది, 12 అంగుళాల పైపులైన్లలో వాడేది రూ.పది కోట్లుంటుంది. పిగ్‌లను వాడుతున్న కొద్దీ పైపులైన్ లోపాలను పసిగట్టడంలో వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. అంటే కాలం చెల్లిన పైపులైన్లలో సామర్థ్యం తగ్గిన పిగ్‌లను వినియోగించినా లోపాలను గుర్తించే అవకాశం ఆట్టే ఉండదన్న మాట! అంటే..గెయిల్ తన ధనం ఖర్చు కాకుండా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న మాట! ఈ చెలగాటానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పైపులైన్ వేసే వరకూ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలంటున్నారు. అంతగా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలే తప్ప.. తమ కంటికి కునుకునూ, ప్రాణాలకు హామీనీ, ఆస్తులకు భద్రతనూ కరువు చేసే పైపులైన్లను వినియోగించరాదంటున్నారు.