సాక్షి, న్యూఢిల్లీ: గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు బాధితులకు మెరుగైన చికిత్స అందించినట్లు పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. బుధవారం రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలంలోని నగరంలో 2014లో గెయిల్ గ్యాస్ పైప్‌లైన్ పేలుడు దుర్ఘటన జరిగింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 17 మంది బాధితులకు కాకినాడలోని అపోలో ఆస్పత్రిలో ట్రీట్‌మెంట్ అందించడం జరిగిందని మంత్రి చెప్పారు. వారిలో 14 మందికు విజయవంతంగా చికిత్స పూర్తయిందన్నారు. మిగిలిన ముగ్గురు బాధితుల చికిత్సను, ఆరోగ్య పరిస్థితులను గెయిల్ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.
బాధితులకు మెరుగైన చికిత్స, ప్రయాణ ఏర్పాట్లు, వసతి ఖర్చులన్నింటినీ గెయిల్ భరిస్తున్నట్లు ఆయన తెలిపారు. పేలుడు దుర్ఘటన అనంతరం నగరంతోపాటు ఆ పరిసర ప్రాంతాలలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను గెయిల్ ప్రారంభించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఇప్పటి వరకు గెయిల్ అభివృద్ధి కార్యక్రమాల కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు మంత్రి చెప్పారు. స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు, ఇంటింటికీ వైద్య సేవలు అందించేందుకు మొబైల్ మెడికల్ యూనిట్, నాణ్యమైన తాగు నీటి సరఫరా వంటివి వాటిలో ప్రధానమైనవని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment