సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్‌ఐఎన్‌ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్‌ఐఎన్‌ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు.
కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు..
విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్‌జీఆర్‌బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment