Posco company
-
భారత్‌లోకి దేవూ రీఎంట్రీ...
న్యూఢిల్లీ: దక్షిణ కొరియా దిగ్గజం పోస్కో దేవూ తాజాగా భారత మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈసారి కన్జూమర్ ఎల్రక్టానిక్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ వాహనాల విభాగంపై దృష్టి పెట్టింది. కెల్వాన్ ఎల్రక్టానిక్స్ అండ్ అప్లయెన్సెస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. లిథియం హైబ్రిడ్ ఇన్వర్టర్లు, ఎల్ఈడీ టీవీలను విక్రయించే కెల్వాన్ .. కొత్తగా దేవూ బ్రాండ్ కింద ఇంధన, విద్యుత్ రంగానికి సంబంధించిన ఉత్పత్తులతో పాటు కన్జూమర్ ఎల్రక్టానిక్స్ను కూడా ప్రవేశపెట్టనుంది. ఇందుకోసం విక్రయాల పరిమాణాన్ని బట్టి తాము సొంతంగా తయారీ ప్లాంటు ఏర్పాటు చేసే అవకాశం ఉందని, మొత్తం మీద మార్కెటింగ్, పరిశోధన.. అభివృద్ధి కార్యకలాపాలు మొదలైన వాటిపై వచ్చే మూడేళ్లలో రూ. 300 కోట్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని కెల్వాన్ ఎండీ హెచ్ఎస్ భాటియా తెలిపారు. భారత మార్కెట్లో వేగవంతమైన వృద్ధికి అవకాశాలు ఉన్నాయని, కెల్వాన్ ఎల్రక్టానిక్స్‌తో 10 ఏళ్ల పాటు బ్రాండ్ లైసెన్సింగ్ ఒప్పందం కుదుర్చుకున్నామని దేవూ ఇండియా ఆపరేషన్స్ డైరెక్టర్ చాన్ రియు తెలిపారు. తొలి దశలో కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీలను అందించడంతో పాటు సోలార్ బ్యాటరీలు, ఇన్వర్టర్లను కూడా ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ టీవీలు, ఆడియో స్పీకర్లు, ఎయిర్ ప్యూరిఫయర్లు, కూలర్లు, ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు మొదలైన గృహోపకరణాలను కూడా అందించే యోచ నలో ఉన్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ–బైక్‌లు, ఈ–సైకిల్స్నూ ఆవిష్కరించే ప్రణాళికలు ఉన్నట్లు చాన్ రియు వివరించారు. సియెలోతో ఎంట్రీ.. 1995లో దేవూ తొలిసారిగా సియెలో కారుతో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అటుపైన నెక్సియా, మ్యాటిజ్ కార్లను ప్రవేశ పెట్టింది. 2001లో దేవూకి సంబంధించిన చాలా మటుకు అసెట్స్‌ను జనరల్ మోటర్స్ కొనుగోలు చేసింది. అంతిమంగా 2003–04 నుంచి భారత్‌లో కంపెనీ కార్యకలాపాలు నిలిచిపోయాయి. రాబోయే రోజుల్లో భారత్‌లో ఎలక్ట్రిక్ టూ–వీలర్లకు గణనీయంగా డిమాండ్ పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో, తిరిగి ఇన్నాళ్లకు మళ్లీ దేశీ మార్కెట్లోకి రావడంపై దేవూ కసరత్తు చేస్తోంది. -
పోస్కోతో అదానీ గ్రూప్ జత
న్యూఢిల్లీ: స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. ఎంవోయూ ద్వారా రానున్న కాలంలో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు అదానీ గ్రూప్ ఈ సందర్భంగా వెల్లడించింది. గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంటు ఏర్పాటు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్ తదితర రంగాలలో వ్యాపార అవకాశాల అన్వేషణలో పరస్పర సహకారం వంటి అంశాలపై తప్పనిసరికాని ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కర్బనాల తగ్గింపు అవసరాల రీత్యా వివిధ రంగాలలో పెట్టుబడులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. దీనిలో భాగంగా సహకారం, సాంకేతికత, ఆర్థిక అంశాలతోపాటు రెండు కంపెనీలకూ ఉన్న నిర్వహణ సామర్థ్యం తదితరాలలో పరస్పర సహకారానికున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు వివరించింది. అదానీ గ్రూప్ ఇటీవల పెట్రోకెమికల్స్, హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు, స్టీల్ తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ఎంవోయూకు ప్రాధాన్యత ఏర్పడింది! బలాల వినియోగం పోస్కో, అదానీ గ్రూప్లకుగల పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన కట్టుబాట్ల కొనసాగింపునకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్ తదితరాలను వినియోగించుకునే యోచనలో ఉన్నాయి. స్టీల్, పర్యావరణహిత బిజినెస్‌లలో రెండు సంస్థల మధ్య గొప్ప సమన్వయానికి వీలున్నట్లు పోస్కో సీఈవో జియోంగ్ వూ చోయ్ పేర్కొన్నారు. తమ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం దేశీ తయారీ రంగ వృద్ధికి సహకరించగలదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలియజేశారు. -
మా చేతిలో లేదు.. ఉంటే తిట్టండి: మంత్రి అప్పలరాజు
శ్రీకాకుళం: ఏ ముఖం పెట్టుకుని చంద్రబాబు విశాఖ వచ్చాడని మంత్రి డా. సిదిరి అప్పలరాజు ప్రశ్నించారు. తన మాటలతో ప్రజల్ని రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. మాకేమన్న ఉద్యమాలంటే కొత్త అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర ఉద్యమాల గడ్డ అని గుర్తుచేశారు. విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని ఒక్క మాట అనడు.. మోదీ అంటే చంద్రబాబుకు భయమని తెలిపారు. ప్రైవేటీకరణ మా చేతిలో ఉంటే మమ్మల్ని తిట్టండి.. మేం పడతామని స్పష్టం చేశారు. అడ్డమైన వాళ్లకు ఉత్తరాలు రాసే చంద్రబాబు ప్రధాని మోదీకి ఎందుకు రాయడని నిలదీశారు. 2017 చంద్రబాబు దక్షిణ కొరియాకు వెళ్లి పోస్కో ప్రతినిధులను కలిశాడని, కానీ మీ పేపర్లో వాళ్లే వచ్చి మిమ్మల్ని కలిసినట్లు రాయించుకున్నావని ఆరోపించారు. కొరియాలో పోస్కో ప్రతినిధులను ఎందుకు కలిశాడో చంద్రబాబు ప్రజలకు బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. 2012లో ఎకానిమిక్స్ టైమ్‌లో స్టీల్ ప్లాంటు కోసం కథనం వచ్చిందని, ఆ తర్వాత జాతీయ మీడియా.. మీజాతి మీడియాలో కూడా అనేక కథనాలు వచ్చాయని వివరించారు. అప్పడు ఎందుకు చంద్రబాబు మాట్లాడలేదని ప్రశ్నించారు. అశోక్ గజపతి రాజు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే కథ మొదలైందని.. స్టీల్ ప్లాంట్‌తో ఒప్పందం జరిగిందని మంత్రి అప్పలరాజు తెలిపారు. చంద్రబాబు వి దగుల్బాజీ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్న కేంద్రాన్ని వదిలి సీఎం జగన్‌ను చంద్రబాబు విమర్శిస్తుండడాన్ని తప్పుబట్టారు. ఈ పదిహేను రోజుల్లో నువ్వు.. నీ కొడుకు ఏ ఒక్కరోజైనా కేంద్రాన్ని ప్రశ్నించారా? అని ప్రశ్నించారు. ప్రపంచంలో ఏది జరిగినా.. చైనా దురాక్రమణలు చేసినా దానికి సీఎం జగనే కారణమని చంద్రబాబు పిచ్చిమాటలు మాట్లాడతాడని ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ కోసం కేంద్రం బిడ్డింగ్‌కు వెళ్తే.. రాష్ట్ర ప్రభుత్వమే వెళ్లి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకుంటుందని స్పష్టం చేశారు. ఏదో ఒకటి మాట్లాడి రాజకీయ పబ్బం గడుపుకోవాలని అనుకోవడం ఈతరం సమాజం స్వాగతించదని మంత్రి అప్పలరాజు పేర్కొన్నారు. -
వైజాగ్ స్టీల్ ప్లాంట్ భూముల్లో పోస్కో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు చెందిన మిగులు భూమిలో గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి దక్షిణ కొరియాకు చెందిన పోస్కో స్టీల్ ఆసక్తి కనబర్చినట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా సమాధానమిచ్చారు. పోస్కో- ఆర్ఐఎన్ఎల్ మధ్య 2019 అక్టోబర్‌లో ఎంవోయూ కుదిరినట్లు పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఉభయ పక్షాల మధ్య పరస్పర సమాచార మార్పిడి కోసం ఒక జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఏర్పడిందన్నారు. ప్లాంట్‌లో ఎవరి వాటా ఎంత ఉండాలన్న అంశం ఇంకా ఖరారు కాలేదని, అయితే ఎంవోయూ ప్రకారం 50 శాతం మేరకు తమకు వాటా ఉండాలని పోస్కో స్పష్టం చేసిందని వివరించారు. ఆర్ఐఎన్ఎల్ వాటా ఎంత ఉండాలన్నది, అది కేటాయించే భూముల విలువపై ఆధారపడి ఉంటుందని మంత్రి వెల్లడించారు. కొండపల్లి - తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు.. విజయవాడ సమీపంలోని కొండపల్లి నుంచి తిరుపతి వరకు 450 కిలోమీటర్ల మేర గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటుకు గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా (గెయిల్) ఆసక్తి కనబరిచిందని పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ.. కొండపల్లి-తిరుపతి మధ్య గ్యాస్ పైప్ లైన్ నిర్మాణం, నిర్వహణ, విస్తరణ చేయడానికి ఆసక్తి కనబరుస్తూ గెయిల్ పెట్రోలియం, నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పీఎన్జీఆర్బీ)కు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఈ పైప్ లైన్ నిర్మాణం ద్వారా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుందని, గృహావసరాలు, పారిశ్రామిక అవసరాలకు కోసం గ్యాస్ అనునిత్యం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, గెయిల్ సంయుక్తంగా చేపట్టిన కాకినాడ-విశాఖపట్నం-శ్రీకాకుళం గ్యాస్ పైప్ లైన్, శ్రీకాకుళం-అంగుల్ గ్యాస్ పైప్ లైన్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి వివరించారు. -
ఏపీలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నాం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘పోస్కో’ తెలిపింది. గురువారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌తో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా భారీ స్థాయిలో తమ సంస్థను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు వారు ముఖ్యమంత్రి జగన్‌కు చెప్పారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ ఈ సందర్భంగా వారికి బదులిచ్చారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. సహజవనరుల పరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమల అభివృద్ధికి తగిన తోడ్పాటునం దిస్తాయన్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులున్నారు. -
ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం: పోస్కో
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధంగా ఉన్నామని కొరియాకు చెందిన ప్రముఖ స్టీల్ ఉత్పత్తి సంస్థ ‘‘పోస్కో’’ వెల్లడించింది. క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పోస్కో ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ స్థాయిలో తమ సంస్థలను నెలకొల్పేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. రాష్ట్రంలో అత్యంత పారదర్శక విధానాలు అమలు చేస్తున్నామని, ఇవి పారిశ్రామిక రంగానికి మేలు చేస్తాయని సీఎం జగన్ వివరించారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే సంస్థలను ప్రోత్సహిస్తున్నామన్నారు. (చదవండి: వేగంగా కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం) సహజవనరులపరంగా రాష్ట్రానికి ఉన్న సానుకూల అంశాలు పరిశ్రమలకు తోడ్పాటును అందించటమేకాక పారిశ్రామికాభివృద్ధికీ ఉపకరిస్తాయన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ని కలిసిన వారిలో పోస్కో ఇండియా గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సంగ్ లై చున్, చీఫ్ ఫైనాన్సింగ్ ఆఫీసర్ గూ యంగ్ అన్, సీనియర్ జనరల్ మేనేజర్ జంగ్ లే పార్క్ తదితరులు ఉన్నారు. -
‘ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నాం’
సాక్షి, విశాఖపట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించాలన్న కేంద్రమత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు అన్నారు. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకునే లేదని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,890 కోట్లు కేటాయిస్తే కేంద్రానికి పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ రూ.40,500 కోట్లు చెల్లిందని పేర్కొన్నారు. రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయించిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు హెచ్చరించారు. -
రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ, జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. సుమారు రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్ఐఎన్ఎల్ (విశాఖ స్టీల్)తో కలిపి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసిన పోస్కో కంపెనీ ప్రతినిధులు స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలియచేశారు. పోస్కో ఇండియా చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గిల్హో బాంగ్, పోస్కో మహారాష్ట్ర సీఎఫ్‌వో గూ యంగ్ అన్లతో పాటు పోస్కో సీనియర్ ప్రతినిధులు సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్ ప్లాంట్ ఉన్నందున వైఎస్సార్ జిల్లాలో కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దీనికి అంగీకరించిన పోస్కో ప్రతినిధులు కడపలో కర్మాగారం ఏర్పాటు సాధాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్ ఏర్పాటు ద్వారా సుమారు 6,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్ సిదార్థ జైన్ తదితరులు పాల్గొన్నారు. విశాఖలో ఏటీజీ టైర్ల కంపెనీ! విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో సుమారు రూ.1,600 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన అలయన్స్ టైర్ గ్రూపు (ఏటీజీ) ఆసక్తి కనపరుస్తోంది. సుమారు 100–125 ఎకరాల్లో అచ్యుతాపురం సెజ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందచేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగ యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఏటీజీ తయారు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక యూనిట్ ఉండగా విశాఖ వద్ద మరో యూనిట్ ఏర్పాటు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. టీసీఎల్ సమస్యలను తక్షణం పరిష్కరించాలి: సీఎం చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్ యూనిట్ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానికి సంస్థ టీసీఎల్ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సుమారు రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్ప్లే ప్యానల్ యూనిట్‌కు గత డిసెంబర్లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే భూమి, నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు టీసీఎల్ ఇండస్ట్రియల్ హోల్డింగ్స్ సీఈవో కెవిన్ వాంగ్, టీటీఈ ఎలక్ట్రానిక్స్ చైర్మన్ అలెన్ చెన్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సూపర్ ప్రోయాక్టివ్ క్లియరెన్స్ కింద అన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, టీసీఎల్ సమస్యలను పరిష్కరించి త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్ శాఖల అధికారులను ఆదేశించారు. కంపెనీలకు అనుమతుల మంజూరులో అవినీతికి తావు ఉండకూడదని, ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపినట్లు తెలిస్తే ఎంత స్థాయి రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా క్షమించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. -
పోస్కో ఒడిశా సెజ్ ఆమోదం రద్దు
న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన పొస్కో కంపెనీకి ఒడిశాలో ప్రత్యేక ఆర్థిక మండలం(సెజ్) ఏర్పాటు కోసం ఇచ్చిన సూత్రప్రాయ ఆమోదాన్ని కేంద్రం రద్దు చేసింది. గత నెల 28న జరిగిన సమావేశంలో వాణిజ్య కార్యదర్శి రీటా తియోతియా అధ్యక్షతన గల బోర్డ్ ఆఫ్ అప్రూవల్స్(బీఓఏ) ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ సెజ్ కోసం పోస్కో కంపెనీ చేసిన ప్రయత్నలు సంతృప్తికరంగా లేవని భావించిన బీఓఏ కమిటీ సెజ్ ఆమోదాన్ని రద్దు చేయాలని నిర్ణయం తీసుకుందని బీఓఏ మినట్స్ వెల్లడించాయి. ఒడిశాలోనే లాంకో సోలార్ ఏర్పాటు చేయనున్న సెజ్ అనుమతిని కూడా ఇదే కారణాలతో బీఓఏ రద్దు చేసింది.