రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ | Sakshi
Sakshi News home page

రూ.30 వేల కోట్లతో ఉక్కు ఫ్యాక్టరీ

Published Fri, Jun 21 2019 4:45 AM

Steel Factory with Rs 30 thousand crores - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరిన కొద్ది రోజుల్లోనే భారీ పెట్టుబడులు పెట్టేందుకు పలు విదేశీ కంపెనీలు ముందుకొస్తున్నాయి. అంతర్జాతీయంగా పేరుపొందిన కొరియాకు చెందిన పోస్కో స్టీల్‌ కంపెనీ, జపాన్‌కు చెందిన ఏటీజీ టైర్ల కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. సుమారు రూ.30,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్‌ స్టీల్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థ ఆర్‌ఐఎన్‌ఎల్‌ (విశాఖ స్టీల్‌)తో కలిపి ఏర్పాటు చేయడానికి పోస్కో ఆసక్తి చూపిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని గురువారం ఆయన నివాసంలో కలిసిన పోస్కో కంపెనీ ప్రతినిధులు స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను తెలియచేశారు. పోస్కో ఇండియా చీఫ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గిల్‌హో బాంగ్, పోస్కో మహారాష్ట్ర సీఎఫ్‌వో గూ యంగ్‌ అన్‌లతో పాటు పోస్కో సీనియర్‌ ప్రతినిధులు సీఎంను కలసిన వారిలో ఉన్నారు. ఇప్పటికే విశాఖలో స్టీల్‌ ప్లాంట్‌ ఉన్నందున వైఎస్సార్‌ జిల్లాలో కర్మాగారం ఏర్పాటుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారిని కోరారు. దీనికి అంగీకరించిన పోస్కో ప్రతినిధులు కడపలో కర్మాగారం ఏర్పాటు సాధాసాధ్యాలపై మూడు నెలల్లో నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా సుమారు 6,000 మందికి ఉపాధి లభించనున్నట్లు కంపెనీ ప్రతినిధులు వివరించారు. సమావేశంలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి రజిత్‌ భార్గవ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ సిదార్థ జైన్‌ తదితరులు పాల్గొన్నారు.

విశాఖలో ఏటీజీ టైర్ల కంపెనీ!
విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలో సుమారు రూ.1,600 కోట్లతో భారీ టైర్ల తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు జపాన్‌కు చెందిన అలయన్స్‌ టైర్‌ గ్రూపు (ఏటీజీ) ఆసక్తి కనపరుస్తోంది. సుమారు 100–125 ఎకరాల్లో అచ్యుతాపురం సెజ్‌లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందచేసింది. వ్యవసాయ, నిర్మాణ రంగ యంత్రాలకు వినియోగించే భారీ టైర్లను ఏటీజీ తయారు చేస్తోంది. ఇప్పటికే మహారాష్ట్రలో ఒక యూనిట్‌ ఉండగా విశాఖ వద్ద మరో యూనిట్‌ ఏర్పాటు చేయడానికి కంపెనీ ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు పరిశీలించి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు తెలిపారు.

టీసీఎల్‌ సమస్యలను తక్షణం పరిష్కరించాలి: సీఎం
చిత్తూరు జిల్లాలో టీవీ ప్యానల్‌ యూనిట్‌ ఏర్పాటు చేసిన చైనాకు చెందిన ఎలక్ట్రానికి సంస్థ టీసీఎల్‌ కంపెనీ ప్రతినిధులు కూడా ముఖ్యమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. సుమారు రూ.2,200 కోట్లతో 153 ఎకరాల్లో డిస్‌ప్లే ప్యానల్‌ యూనిట్‌కు గత డిసెంబర్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. అయితే భూమి, నీటి సమస్యలు పరిష్కారం కాకపోవడంతో ప్రాజెక్టు పనులు నిలిచిపోయినట్లు టీసీఎల్‌ ఇండస్ట్రియల్‌ హోల్డింగ్స్‌ సీఈవో కెవిన్‌ వాంగ్, టీటీఈ ఎలక్ట్రానిక్స్‌ చైర్మన్‌ అలెన్‌ చెన్‌లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి సూపర్‌ ప్రోయాక్టివ్‌ క్లియరెన్స్‌ కింద అన్ని ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు మంజూరు చేయాలని, టీసీఎల్‌ సమస్యలను పరిష్కరించి త్వరగా పనులు మొదలయ్యేలా చూడాలని పరిశ్రమలు, ఎలక్ట్రానిక్స్‌ శాఖల అధికారులను ఆదేశించారు. కంపెనీలకు అనుమతుల మంజూరులో అవినీతికి తావు ఉండకూడదని, ఉద్దేశపూర్వకంగా అనుమతులు ఆపినట్లు తెలిస్తే ఎంత స్థాయి రాజకీయ నాయకుడైనా, అధికారి అయినా క్షమించే ప్రశ్నే లేదని సీఎం స్పష్టం చేశారు. 
ఎంత మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి? రాష్ట్రానికి ఆర్థికంగా ఏ మేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాల ఆధారంగా ఆయా కంపెనీలకు రాయితీలు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement