న్యూఢిల్లీ: స్టీల్, పునరుత్పాదక ఇంధన విభాగాలలో వ్యాపార అవకాశాలను అన్వేషించేందుకు వీలుగా దక్షిణ కొరియా దిగ్గజం పోస్కోతో దేశీ దిగ్గజం అదానీ గ్రూప్ చేతులు కలిపింది. ఇందుకు అనుగుణంగా అవగాహనా ఒప్పందం(ఎంవోయూ)పై రెండు సంస్థల ప్రతినిధులూ సంతకాలు చేశారు. ఎంవోయూ ద్వారా రానున్న కాలంలో 5 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేసే అవకాశమున్నట్లు అదానీ గ్రూప్ ఈ సందర్భంగా వెల్లడించింది.
గుజరాత్‌లోని ముంద్రాలో కొత్తగా పర్యావరణ అనుకూల స్టీల్ ప్లాంటు ఏర్పాటు, పునరుత్పాదక ఇంధనం, హైడ్రోజన్, లాజిస్టిక్స్ తదితర రంగాలలో వ్యాపార అవకాశాల అన్వేషణలో పరస్పర సహకారం వంటి అంశాలపై తప్పనిసరికాని ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు పేర్కొంది. కర్బనాల తగ్గింపు అవసరాల రీత్యా వివిధ రంగాలలో పెట్టుబడులను చేపట్టనున్నట్లు తెలియజేసింది.
దీనిలో భాగంగా సహకారం, సాంకేతికత, ఆర్థిక అంశాలతోపాటు రెండు కంపెనీలకూ ఉన్న నిర్వహణ సామర్థ్యం తదితరాలలో పరస్పర సహకారానికున్న అవకాశాలను పరిశీలించనున్నట్లు వివరించింది. అదానీ గ్రూప్ ఇటీవల పెట్రోకెమికల్స్, హైడ్రోజన్ ఉత్పత్తితోపాటు, స్టీల్ తయారీలోకి ప్రవేశించే యోచనలో ఉన్నట్లు వెల్లడించిన నేపథ్యంలో తాజా ఎంవోయూకు ప్రాధాన్యత ఏర్పడింది!
బలాల వినియోగం
పోస్కో, అదానీ గ్రూప్‌లకుగల పర్యావరణ, సామాజిక, పాలనాపరమైన కట్టుబాట్ల కొనసాగింపునకు అనుగుణంగా పునరుత్పాదక ఇంధన వనరులు, గ్రీన్ హైడ్రోజన్ తదితరాలను వినియోగించుకునే యోచనలో ఉన్నాయి. స్టీల్, పర్యావరణహిత బిజినెస్‌లలో రెండు సంస్థల మధ్య గొప్ప సమన్వయానికి వీలున్నట్లు పోస్కో సీఈవో జియోంగ్ వూ చోయ్ పేర్కొన్నారు. తమ రెండు సంస్థల మధ్య భాగస్వామ్యం దేశీ తయారీ రంగ వృద్ధికి సహకరించగలదని అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment