మలికిపురం :నేల పొరల నుంచి వెలికితీసే గ్యాస్‌కు వెల కట్టగలం. దాన్ని తరలించడానికి వేసే లోహపు పైపులకు ధర నిర్ణయించగలం. కానీ..దేశంలోని సంపదనంతా వెచ్చించినా పోయిన ఒక్క ప్రాణాన్ని తిరిగి పోయగలమా? అది మానవాళికి అసాధ్యం. అలాంటప్పుడు ప్రాణాలను ఎంత అపురూపంగా పరిగణించాలి? వాటికి ముప్పు వాటిల్లకుండా ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి? దురదృష్టవశాత్తు కోనసీమలో కార్యకలాపాలు సాగిస్తున్న చమురు సంస్థలకు ఈ దృష్టే లోపించింది. అవి ధనానికిచ్చే ప్రాధాన్యాన్ని మానవ ప్రాణాలకు ఇవ్వడం లేదు. అందుకే కాలం చెల్లిన పైపులైన్లతో క్షణమైనా ఉత్పాతం జరిగే అవకాశం ఉందని తెలిసినా..
దండగమారి ఖర్చు అన్న వైఖరితో నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారి నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోనూ స్పందన కొరవడుతోంది. వారి తప్పిదాలకు మూల్యం అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం 16 మందిని బలిగొన్న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడుకు ప్రధాన కారణం.. కాలం చెల్లిన ఆ పైపులైన్‌ను మార్చకుండా మరమ్మతులతో కాలక్షేపం చేయడమే. తాటిపాక నుంచి విజయవాడకు 15 ఏళ్ల క్రితం వేసిన ఆ పైపులైన్ నిడివి 250 కిలోమీటర్ల పైనే. దీనితో కేజీ బేసిన్‌లో అనేక గెయిల్ పైప్‌లైన్లూ శిథిలావస్థకు చేరాయి. అయితే భారీ వ్యయంతో కొత్తగా లైన్లు వేయడం దండగ అనుకుంటున్న గెయిల్ పాత లైన్లతోనే నెట్టుకొస్తోంది. తాటిపాక-విజయవాడ పైపులైన్‌ను కొత్తగా వేయడానికి రూ.1000 కోట్లు పైనే ఖర్చవుతుంది.
ఆ మొత్తం వెచ్చించడానికి ఇచ్ఛగించని గెయిల్ పైపులైన్ దుస్థితిని పసిగట్టేందుకు సెన్సర్లు కలిగి, రింగులా ఉండే ‘పిగ్’ అనే పరికరాన్ని వాడుతూ చేతులు దులుపుకొంటున్నారు. 18 అంగుళాల వెడల్పు గల తాటిపాక - విజయవాడ పైపులైన్‌లో రూ.40 కోట్ల విలువైన పిగ్‌ను వినియోగిస్తోంది. పైపులైన్‌లో గ్యాస్‌తో పాటు ఎంత దూరమైనా పయనించే పిగ్ ఎక్కడైనా దెబ్బ తిన్న భాగాలుంటే గుర్తిస్తుంది. ఆ సమాచారం మేరకు గెయిల్ అధికారులు పైపులైన్ దెబ్బతిన్న చోట కట్ చేసి మరమ్మతులు చేయిస్తున్నారే తప్ప, కొత్త పైపులైన్ వేయడం లేదు. 18 అంగుళాల పైపులైన్లో వాడే పిగ్ రూ.40 కోట్లు కాగా పది, 12 అంగుళాల పైపులైన్లలో వాడేది రూ.పది కోట్లుంటుంది.
పిగ్‌లను వాడుతున్న కొద్దీ పైపులైన్ లోపాలను పసిగట్టడంలో వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. అంటే కాలం చెల్లిన పైపులైన్లలో సామర్థ్యం తగ్గిన పిగ్‌లను వినియోగించినా లోపాలను గుర్తించే అవకాశం ఆట్టే ఉండదన్న మాట! అంటే..గెయిల్ తన ధనం ఖర్చు కాకుండా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న మాట! ఈ చెలగాటానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పైపులైన్ వేసే వరకూ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలంటున్నారు. అంతగా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలే తప్ప.. తమ కంటికి కునుకునూ, ప్రాణాలకు హామీనీ, ఆస్తులకు భద్రతనూ కరువు చేసే పైపులైన్‌లను వినియోగించరాదంటున్నారు.
ప్రాణాలకు ముప్పయినా ఖర్చు తప్పడమే ముఖ్యం
Published Mon, Jun 30 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM
Advertisement