‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి | ongc got 240 crore loss | Sakshi
Sakshi News home page

‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి

Published Fri, Oct 3 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 PM

‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి

‘నగరం’ విస్ఫోటంతో 240 కోట్ల ఆదాయానికి గండి

సాక్షి, రాజమండ్రి : తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామం వద్ద గెయిల్ గ్యాస్‌పైప్ లైన్ విస్ఫోటం నేపథ్యంలో.. బావులను మూసివేయడం తదితర కారణాల వల్ల తమ సంస్థ ఆదాయానికి రూ.240 కోట్ల మేర గండి పడిందని ఓఎన్‌జీసీ సీఎండీ డీకే షరాఫ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాటిల్లిన ఆర్థిక నష్టంకన్నా ప్రాణాతలు పోవడమే తమకు చాలా బాధ కలిగిస్తోందన్నారు.

 ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని రాజమండ్రి ఓఎన్‌జీసీ కార్యాలయంలో షరాఫ్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా గోల్ఫ్ కోర్‌‌ట ప్రాంతంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరం పేలుడు అనంతరం బలహీనంగా ఉన్న పైప్‌లైన్ల మార్పును వేగవంతం చేశామని షరాఫ్ చెప్పారు. కేజీ బేసిన్‌లో మొత్తం 860 కిలో మీటర్ల పైప్‌లైన్లు ఉండగా అందులో ఇప్పటికే 50 శాతం మార్పు చేసినట్లు తెలిపారు.

 ఆఫ్‌షోర్, ఆన్‌షోర్‌ల్లో ఉత్పత్తికి సన్నాహాలు
 ఆఫ్‌షోర్‌లో కాకినాడ నుంచి సముద్రంలో 65 కిలోమీటర్ల దూరంలో డి-6 బావి సమీపంలో ఉన్న కేజీ 98/2 బావి నుంచి 2018 నాటికి చమురు ఉత్పత్తి ప్రారంభించేందుకు కార్యాచరణ సిద్ధమైందని షరాఫ్ అన్నారు. ఇక్కడ నుంచి 2021లో ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావించామని, కానీ ముందుగానే ప్రారంభించేందుకు ఎక్స్‌పర్ట్ అసెట్ మేనేజర్ ప్రతిపాదించారని తెలిపారు.

ఓఎన్‌జీసీ 51 శాతం, కెయిర్న్ ఇండియా 49 శాతం భాగస్వామ్యంతో ఆన్‌షోర్‌లో 2017నాటికి నాగాయలంక వద్ద సహజ వాయువు ఉత్పత్తికి యత్నిస్తున్నామన్నారు. ఈ ప్లాంట్ నుంచి 2019 నాటికి పూర్తిస్థాయి ఉత్పత్తి జరిగే అవకాశాలు ఉన్నాయని, ఇందుకు ఆ ప్రాంతంలో క్షేత్రస్థాయి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధమయ్యాయని చెప్పారు. ఓఎన్‌జీసీ ద్వారా ప్రస్తుతం సుమారు 3 మిలియన్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి అవుతోందన్నారు.

‘స్వచ్ఛ భారత్’లో భాగంగా దేశవ్యాప్తంగా బాలికల పాఠశాలల్లో రూ.100.85 కోట్లతో 2,500 మరుగుదొడ్లు నిర్మిస్తున్నామన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో జిల్లాకు 12 చొప్పున ఈ మరుగుదొడ్లు నిర్మిస్తామన్నారు. విలేకర్ల సమావేశంలో సమావేశంలో ఆన్‌షోర్ డెరైక్టర్ అశోక్‌వర్మ, రాజమండ్రి అసెట్ మేనేజర్ దేబశిష్ సన్యాల్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement