సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో కొన సాగుతున్న మిచాంగ్ తుపాను సోమవారం మరింత బలపడి తీవ్ర తుపానుగా మారింది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, ఉత్తర తమిళనాడు తీరాలకు దగ్గరగా కొనసాగుతోంది. క్రమంగా బలపడుతూ, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి సమాంతరంగా కదులుతూ.. మంగళవారం మధ్యాహ్నం బాపట్ల సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దాని ప్రభావంతో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశా యని తెలిపింది. మంగళ, బుధవారాల్లోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు పడతాయని వెల్లడించింది.
పలుచోట్ల భారీ వర్షాలు
మంగళవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు.. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, పెద్దపల్లి, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
వర్షాలు కురిసే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు, గంటకు 30 నుండి 40కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలు లు వీస్తాయని తెలి పింది. ఇక బుధవారం రోజున పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడ తాయని.. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడవచ్చని వివరించింది.
ఉష్ణోగ్రతలు తగ్గే చాన్స్
సోమవారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు సాధారణ స్థితిలో నమోదయ్యాయని వాతావరణ శాఖ తెలిపింది. అత్యధికంగా రామగుండంలో 33.1 డిగ్రీల గరిష్టఉష్ణోగ్రత.. అత్యల్పంగా మెదక్, ఆదిలాబాద్‌లలో 18.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వివరించింది. మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశంఉందని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment