తిరుపతి జిల్లా నాయుడుపేట వద్ద కాజ్‌వే మీదుగా ఉధృతంగా ప్రవహిస్తున్న స్వర్ణముఖి నది, కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో నీట మునిగిన వరి పనలను దిగాలుగా చూస్తున్న రైతు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: మిచాంగ్ తుపాను తిరుపతి, నెల్లూరు జిల్లాలను కుదిపేసింది. పలు జిల్లాలను వణికించింది. దీని ప్రభావంతో కురుస్తున్న కుండపోత వర్షాలకు తిరుపతి, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో జన జీవనం పూర్తిగా స్తంభించిపోయింది. రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలు.. 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీచిన ఈదురు గాలులతో పట్టణాలు, పల్లెలు చిగురుటాకుల్లా వణికిపోయాయి. 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన అతి తీవ్ర వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి.
ప్రధాన రోడ్లపై మోకాళ్ల లోతుకుపైగా నీళ్లు ఉండడంతో రాకపోకలు దాదాపు నిలిచిపోయాయి. వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలుచోట్ల రోడ్లు తెగిపోయాయి. ఈదురు గాలులకు నెల్లూరు జిల్లాలో కరెంటు స్తంభాలు, పలు చోట్ల గుడిసెలు నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై చెట్లు కూలిపోయాయి. అయితే ప్రభుత్వం సహాయక చర్యల్ని వేగంగా చేపట్టడంతో యుద్ధ ప్రాతిపదికన కరెంటును పునరుద్ధరించగలిగారు. కూలిన చెట్లను రోడ్లపై నుంచి తొలగించే పనులు చేపట్టారు.
మరోవైపు ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమగోదావరి, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, గుంటూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు మూడు రోజులుగా రాష్ట్ర వాసులను భయపెడుతున్న మిచాంగ్ తుపాను ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 గంటల మధ్య బాపట్లకు నైరుతి దిశగా 15 కి.మీల దూరంలో తీవ్ర తుపానుగా తీరాన్ని దాటింది. ఆ సమయంలో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచాయి.
తీరం దాటడానికి 3 రోజుల ముందు నుంచి బంగాళాఖాతంలో తుపాను 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో బాపట్ల వైపు దూసుకువచ్చింది. మొదట్లో దివిసీమ, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు కనిపించినా, చివరకు అది తీవ్ర తుపానుగా మారి బాపట్లకు దగ్గరగా వచ్చి ఆ సమీపంలోనే తీరం దాటింది. తీరం దాటిన తర్వాత భూమిపై 11 కిలోమీటర్ల వేగంతో నార్త్ వెస్ట్ వైపు పయనిస్తూ తుపానుగా బలహీనపడింది. మంగళవారం రాత్రి 9 గంటలకు బాపట్లకు 20 కిలోమీటర్లు, ఒంగోలుకు 50 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.
ఆరు గంటల్లో తీవ్ర వాయుగుండంగా అది బలహీన పడుతుందని వాతావరణ శాఖ తెలిపింది. తుపాను బలహీనపడినా బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి గుంటూరు, బాపట్ల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోనూ వర్షాలు పడతాయని పేర్కొంది. మరో రెండు రోజులు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లకూడదని హెచ్చరించింది. తీవ్ర తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించే అవకాశం ఉందని తెలిపింది.
తిరుపతి జిల్లా చింతవరంలో 42 సెంటీమీటర్ల వర్షం
తుపాను ప్రభావంతో మంగళవారం తిరుపతి జిల్లా వ్యాప్తంగా సగటున 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 8.6 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లాలో 6.4, కృష్ణాలో 5.5, నెల్లూరు జిల్లాలో 5.4 సెంటీమీటర్ల వర్షం కురిసింది. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరంలో 24 గంటల వ్యవధిలో 42 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కోట మండలం చిట్టేడులో 39 సెంటీమీటర్లు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కట్టువపల్లెలో 37, తిరుపతి జిల్లా కోట మండలం అల్లంపాడులో 35, చిల్లకూరులో 33, నాయుడుపేటలో 29, బాలాయపల్లె మండలం చిల్లమన్నూరులో 25, నెల్లూరు జిల్లా సైదాపురంలో 22, వెంకటాచలంలో 21 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
తిరుపతి జిల్లా వెంకటగిరి, సత్యవేడు, పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా సైదాపురం, మనుబోలు, వెంకటాచలం, అన్నమయ్య జిల్లా పెనగలూరు, బాపట్ల జిల్లా పర్చూరు, బాపట్ల, అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం, అయినవిల్లి, కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలాల్లో పలుచోట్ల 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 నుంచి రాత్రి 9 గంటల వరకు నమోదైన గరిష్ట వర్షపాతాల్లో అత్యధికంగా అనకాపల్లి జిల్లా పరవాడ మండలం తాడిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఏలూరు జిల్లా తాడువాయిలో 15.9, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 14.5, అనకాపల్లి దార్లపూడిలో 13.6, కొత్తకోటలో 13, బలిఘట్టం 12.6, బాపట్ల జిల్లా అప్పికట్లలో 12.5, అనకాపల్లి కృష్ణాపురంలో 11.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
పోటెత్తిన వాగులు, వంకలు
మిచాంగ్ తుపాన్ వల్ల తిరుపతి జిల్లాలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. స్వర్ణముఖి, అరణియార్, కాళంగి, కళ్యాణీ డ్యాం, మల్లిమడుగు, సదాశివకోనతో పాటు తిరుమలలోని పాపవినాశం, ఆకాశగంగ, గోగర్భం జలాశయాలన్నీ పూర్తిగా నిండిపోవటంతో గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 775 చెరువులకు భారీగా వరద నీరు చేరటంతో కలుజులు పొంగి ప్రవహిస్తున్నాయి. రేణిగుంట విమానాశ్రయంలో రెండు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. చేపలు పట్టేందుకు వెళ్లిన తిరుపతి జీవకోనకు చెందిన తాత, మేనమామతో కలిసి వెళ్లిన నిఖిల్ (10) వాగులో కొట్టుకుపోయాడు.
బాలుడి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్ గాలింపు చర్యలు చేపట్టింది. ఏర్పేడు మండలం బండారుపల్లి వద్ద వరద నీటిలో చిక్కుకున్న ఇద్దరు రైతులను రెస్క్యూ టీమ్ రక్షించింది. సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి, గూడూరు, వెంకటగిరి, సత్యవేడు నియోజక వర్గాల పరిధిలోని అనేక గ్రామాలు పూర్తిగా జల దిగ్భంధంలో చిక్కుకున్నాయి. కాళంగి రిజర్వాయర్ నుంచి 38 వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేయటంతో సూళ్లూరుపేట పట్టణం జలదిగ్భంధంలో చిక్కుకుంది. చెంగాళమ్మ ఆలయం పూర్తిగా వరద నీటితో నిండిపోయింది. చెన్నై– విజయవాడ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
కరివేటి కాలువ, కాళంగి నది, పాముల కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాదలూరు, సూళ్లూరుపేట చెరువులకు గండ్లు పడ్డాయి. సూళ్లూరుపేట– శ్రీకాళహస్తి మధ్య రహదారిపై 3 కి.మీ మేర వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలు స్తంభించాయి. శ్రీహరి కోట, పులికాట్‌కు వెళ్లే మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పిచ్చాటూరు పరిధిలోని అరణియార్ మత్స్య కేంద్రం నీట మునగటంతో 10 లక్షలకుపైగా చేప పిల్లలు సముద్రంలో కలిసిపోయాయి.
వెంకటగిరి పరిధిలో కైవల్యం, పిన్నేరు, మాలేరు వాగులు పొంగి ప్రవహిస్తుండటంతో వెంకటగిరి–గూడూరు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి నగరంలోని కొన్ని కాలనీలు పూర్తిగా జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. చెన్నారెడ్డి కాలనీలోని నివాసం ఒకటి కూలిపోవటంతో పక్కనే ఉన్న రెండు కార్లు ధ్వంసం అయ్యాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వరద కాలువల్లో పూడికతీత పనులు తీయటం, ప్రజలను అప్రమత్తం చేయటం వంటి పనులు చేపట్టారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్వర్ణముఖి, నక్కలవాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీకాళహస్తి పట్టణంలోని అనేక ప్రాంతాలు జలమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 31 సబ్‌స్టేషన్ల పరిధిలో విద్యుత్‌కు అంతరాయం ఏర్పడింది. వెయ్యికిపైగా విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. 200పైగా ట్రాన్సఫార్మర్లు కాలిపోయాయి. ఫలితంగా 279 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ పునరుద్దణ పనుల కోసం 188 బృందాలు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు సహాయక చర్యల్లో పాల్గొన్నారు.
నీట మునిగిన పంటలు..
► బాపట్ల జిల్లాలో తుపాన్ తీరం దాటే సమయంలో సముద్రంలో భీకర హోరుతో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. చీరాల ప్రాంతంలో 60 మీటర్లు, బాపట్ల, నిజాంపట్నం వద్ద 20–30 మీటర్ల మేర ముందుకు వచ్చింది. దీంతో తీరం కోతకు గురైంది. తుపాన్ ధాటికి సూర్యలంక ప్రాంతంలో అవుట్‌పోస్టు దెబ్బతింది. 177 గ్రామాల్లో తుపాన్ ప్రభావం కనిపించింది. వేలాది హెక్టార్లలో పంటలు నీట మునిగాయి. గాలివానకు 30 విద్యుత్ స్తంభాలు, 100 ఇన్సిలేటర్లు దెబ్బతిన్నాయి. పలు చోట్ల పూరిళ్లు, ప్రహరీలు కూలిపోయాయి. అద్దంకి ప్రాంతంలో గుండ్లకమ్మ, నల్లవాగు, పర్చూరు నియోజకవర్గంలో పోలూరు, వింజనంపాడు, ఎద్దనపూడి వాగులు పొంగి పొర్లాయి.
► ప్రకాశం జిల్లాలో 20 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు నీట ముగాయి. ఈదురు గాలులకు పలు చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ఒంగోలు విద్యుత్ డివిజన్‌లో ఎక్కువ నష్టం వాటిల్లింది. వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలనూ మిచాంగ్ తుపాన్ వణికించింది. ఉద్యాన, వ్యవసాయ పంటలు నీట మునిగాయి. కడప–చెన్నై రహదారిలోని భాకరాపేట సమీపంలో మలినేనిపట్నం గ్రామం వద్ద చెట్టు విరిగి మీదపడటంతో బైక్‌పై వెళుతున్న ఏపీఎస్పీ 11వ బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ దుర్మరణం చెందారు. పీలేరు మండలం మేళ్లచెరువులో పాఠశాల ప్రహరీ గోడ కూలి దూడ మృతి చెందింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో గుంజన నది ఉప్పొంగి ప్రవహించింది. దాదాపు 30 గ్రామాల ప్రజలు బయటి ప్రాంతానికి రాలేకపోయారు.
► కాకినాడ జిల్లా ఉప్పాడ తీర ప్రాంతాన్ని తుపాను అతలాకుతలం చేసింది. ఉప్పాడ, కోనపాపపేట తదితర గ్రామాల్లోని తీరంలో మత్స్యకారుల గృహాలు ధ్వంసమయ్యాయి. బీచ్ రోడ్డు రెండు కిలోమీటర్ల మేర దెబ్బతింది. మంగళవారం సాయంత్రం హఠాత్తుగా వచ్చిన సుడిగాలులు కొత్తపల్లి మండలం కొండెవరం, పిఠాపురం మండలం పి దొంతమూరులలో బీభత్సం సృష్టించాయి. రెండు గ్రామాల్లో 180 గృహాలు దెబ్బతిన్నాయి.
► డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో సగటున 121 మి.మీటర్ల వర్షం కురిసింది. వేలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. మోరి, వి.వి.మెరకలలో సుడిగాలి తీవ్రతకు ఇళ్ల మీద రేకులు ఎగిరిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిçపడ్డాయి.
► మిచాంగ్ తుపాను నేపథ్యంలో పెద్ద ఎత్తున కెరటాలు, బలమైన ఈదురు గాలులతో భీమిలి నుంచి గుడ్లవానిపాలెం బీచ్ వరకు తీరం అల్లకల్లోలంగా మారింది. మంగమారిపేట, రుషికొండ, సాగర్‌నగర్ బీచ్‌ల వద్ద కెరటాలు పెద్ద ఎత్తున ఎగసిపడి తీరాన్ని కోతకు గురి చేసింది. రుషికొండ బీచ్‌లో ఏర్పాటు చేసిన చిల్డ్రన్స్ పార్కు, సాగర్‌నగర్‌లో కొబ్బరితోట పార్కు నీట మునిగాయి. మంగమారిపేట, ఉప్పాడ, భీమిలి తీర ప్రాంతాల్లో సముద్రం కాస్త ముందుకు చొచ్చుకుని రావడంతో మత్య్సకారులు ఆందోళనకు గురయ్యారు. భీమిలి తీరంలో అలల తీవ్రతకు బోయివీధి గట్టు చాలా వరకు దెబ్బతింది. కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడింది. రుషికొండ బీచ్‌లో పర్యాటకులు సముద్రంలోకి వెళ్లకుండా ఎర్ర జెండాలను ఏర్పాటు చేశారు. కె.నగరపాలెం, కాపులుప్పాడ ప్రాంతాల్లో వర్షాలకు వరి పంట నీట మునిగింది.
► ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లా వ్యాప్తంగా 417 గ్రామాలపై వర్ష ప్రభావం తీవ్రంగా ఉంది. 121.3 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 144 గ్రామాల పరిధిలో 3354 హెక్టార్లలో వరి పంట నీట మునింది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా 172 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎనిమిది దశాబ్దాల క్రితం నిర్మించిన భవనాల్లోకి వర్షపు నీరు చేరింది. కలెక్టర్ హుటాహుటిన అక్కడికి చేరుకుని వర్షపు నీటిని తొలగించేలా ఆదేశాలు జారీ చేశారు.
రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 93.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వేలాది ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వీరవాసరం, నరసాపురం మండలాల్లో సుడిగాలి తాకిడికి వందల కొద్దీ కొబ్బరి చెట్లు, అధిక సంఖ్యలో విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
గాలి దుమారం.. ఇద్దరు దుర్మరణం
బుట్టాయగూడెం : సుడిగాలి ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రాజానగరానికి చెందిన వెట్టి గంగరాజు, వెట్టి కన్నపరాజు, ఎస్.కోటేశ్వరరావు, మంగబాబు, జోడే రాముడు అనే వ్యక్తులు జోరుగా గాలి, వాన రావడంతో గ్రామంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల సమీపంలో ఉన్న ఒక పాకలోకి వెళ్లారు. చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో అక్కడ చలిమంట ఏర్పాటు చేసుకున్నారు. ఒక్కసారిగా గాలి బీభత్సం సృష్టించడంతో పాక పడిపోవడంతో పాటు పక్కనే ఉన్న సిమెంట్ స్తంభం గంగరాజు (55) తలపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో పాకకు మంటలు అంటుకుని జోడే రాముడు (65) బయటికొచ్చే అవకాశం లేక సజీవ దహనమయ్యాడు. కన్నపరాజుకు స్వల్ప గాయాలు కాగా.. కోటేశ్వరరావు, మంగరాజు సురక్షితంగా బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment