సాక్షి, సిటీబ్యూరో: మహా నగరాన్ని వాన వీడటంలేదు. ఆదివారం చిరుజల్లులతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. మరో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే కురిసిన వర్షాలతో నగర వాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు దెబ్బతిని ఛిద్రమవుతుండగా, వర్షానికి తడిసి పాత ఇళ్ల గోడలు కూలుతున్నాయి.
కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై నీరు తొలగినప్పటికీ బురదతో వాహదారులు ఇక్కట్లకు గురవుతున్నారు. మరో వైపు జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతోంది. వాటిని దిగువ ప్రాంతాలకు వదులుతుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారుతున్నాయి. అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇప్పటికే జలమయమైన ప్రధాన రహదారుల దగ్గర వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు వంటి చర్యలు చేపట్టింది.
హుస్సేన్ సాగర్‌కు వరద..
హుస్సేన్‌సాగర్‌కు వరద నీరు వచ్చి చేరుతోంది. నీటిమట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్ దాటింది. 3 తూముల ద్వారా దిగువ ప్రాంతాలకు నీళ్లను వదులుతున్నారు. మరోవైపు జంట జలాశయాలకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో హమాయత్ సాగర్ తెరిచిన ఆరుగేట్లలో నాలుగింటిని మూసి వేసి కేవలం రెండు గేట్ల ద్వారా దిగువ ప్రాంతాలకు నీటిని వదులుతున్నారు.
హిమాయత్ సాగర్ మొత్తం నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, ఆదివారం నాటికి నీటి మట్టం 1762.00 అడుగులకు చేరింది ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు 1000 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా రెండు గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి దిగువ భాగానికి 1340 క్యూసెక్కులను వదులుతున్నారు. మరో జలాశయం ఉస్మాన్ సాగర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి వంద క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మొత్తం నీటి మట్టం 1790.00 అడుగులు కాగా ప్రస్తుతం 1785.85 అడుగులకు చేరింది.
వరద కాల్వలోని శునకాన్ని కాపాడిన డీఆర్‌ఎఫ్ బృందాలు
కాప్రా సర్కిల్ పరిధిలోని మాథ్యరి ఎన్‌క్లేవ్‌లో ప్రమాదవశాత్తు వరద కాల్వలో పడిన వీధి శునకాన్ని డీఆర్‌ఎప్ బృందాలు రక్షించాయి. వరదలో కొట్టుకుపోకుండా పైకి లాగి దానిని ఒడ్డుకు చేర్చారు. శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు డీఆర్‌ఎఫ్‌కు మొత్తం 30 ఫిర్యాదులందాయి. అన్నింటినీ పరిష్కరించినట్లు ఈవీడీఎం డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. వీటిలో కూలిన చెట్లు 25, నీటి నిల్వ ప్రాంతాలు 4, ఒక కూలిన గోడ ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment