తిరుమల బైపాస్‌రోడ్డు అబ్బన్నకాలనీలో వరద ఉధృతి
సాక్షి, తిరుపతి/నెట్‌వర్క్: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో చిత్తూరు జిల్లాలో ఇటీవల కాలంలో ఎప్పుడూలేని విధంగా అతిభారీ వర్షాలు కురిశాయి. ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్లుగా కుండపోత వర్షంతో చిత్తూరు జిల్లా అతలాకుతలమైంది. రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శేషాచలం కొండల నుంచి వస్తున్న భారీ వరద నీటితో తిరుపతి నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. మరోవైపు.. తిరుమల ఘాట్‌రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. రెండు ఘాట్‌రోడ్లలో రాకపోకలు నిలిపివేశారు. నడక మార్గాలను కూడా మూసివేశారు. తిరుమల కొండల్లో నుంచి వచ్చే వరదనీరు కపిలతీర్థాన్ని ముంచెత్తింది. కొండల్లో నుంచి నీరు ఉధృతంగా వస్తుండడంతో పరిసర ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో 35 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఇక రేణిగుంట విమానాశ్రయం జలమయం కావడంతో ఎయిరిండియా విమానం, స్పైస్‌జెట్ విమానాలను హైదరాబాద్, బెంగళూరుకు తిప్పి పంపారు. మొత్తం మీద చిత్తూరు జిల్లా వడమలపేటలో 13.2 సెంటీమీటర్లు, పాకాలలో 11, తవనంపల్లెలో 10.8, చిత్తూరులో 10.6, రామచంద్రాపురంలో 10.4, చంద్రగిరిలో 9.5, శ్రీకాళహస్తిలో 9.3, కలకడలో 9.3 సెం.మీ. వర్షం పడింది. తిరుపతి నగరం యావత్తూ ఉ.8.30 నుంచి రాత్రి 8.30 వరకు 7.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఒక ప్రాంతంలో వర్షం కురిస్తే మరో ప్రాంతంలో తక్కువగా లేదా అసలు పడకపోవచ్చని.. కానీ, గురువారం జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో దాదాపుగా ఒకే స్థాయిలో కురిసినట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
నలుగురు మహిళలు గల్లంతు
చిత్తూరు మండలంలోని బలిజపల్లె–టేకుమంద రహదారి జయంతి గ్రామం సమీపంలో గురువారం రాత్రి వాగులో నలుగురు మహిళలు గల్లంతైనట్లు ఎస్‌ఐ మల్లికార్జున్‌రెడ్డి తెలిపారు. టేకుమంద గ్రామానికి చెందిన కస్తూరి, లక్ష్మీదేవి, జయంతి, ఉషారాణి సాయంత్రం ఫ్యాక్టరీలో పనిముగించుకుని సహచరులతో ఆటోలో స్వగ్రామానికి బయలుదేరారు. బలిజపల్లెలోని కామాక్షమ్మ చెరువు నిండి జయంతి గ్రామం వద్ద రహదారిపై జోరుగా ప్రవహిస్తుండడంతో ఆటో వెళ్లేందుకు వీలుకాలేదు. దీంతో వారంతా ఒకరిచేయి ఒకరు పట్టుకుని వాగుదాటే క్రమంలో గల్లంతైనట్లు చెప్పారు. వీరి కోసం గాలిస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. వర్షం పడుతుండడంతో గాలింపు కష్టంగా మారింది.
తిరుపతి నగరం అతలాకుతలం
కుండపోత వర్షంతో తిరుపతి నగరం జలమయమైంది. కాలువల ఆక్రమణలతో వరద నీరు ప్రవహించేందుకు వీల్లేని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా నగర వీధులను వరద నీరు ముంచెత్తింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే మార్గం, లీలామహల్ నుంచి కరకంబాడికి వెళ్లే రహదారి, ఎయిర్ బైపాస్ రోడ్డుపై వరద నీరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వాహనాలన్నీ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వెస్ట్‌చర్చి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి, బస్టాండు సమీపంలోని మరో రైల్వే బ్రిడ్జి పూర్తిగా వరద నీటితో నిండిపోయాయి.
రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. విద్యుత్ స్తంభాలు, టెలిఫోన్ లైన్లు దెబ్బతినడంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మొబైల్ ఫోన్లు సుమారు గంటపాటు మూగబోయాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు డిప్యూటీ మేయర్ భూమన అభినయ్, కమిషనర్ గిరీషా, అధికారులు, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. అదేవిధంగా తిరుపతి రూరల్ మండలంలోని పలు గ్రామాలు ముంపునకు గురికావడంతో కలెక్టర్ హరినారాయణన్, ఎంపీపీ చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పర్యటించి సహాయక చర్యలు చేపట్టారు. తలకోనలోని సిద్ధేశ్వరాలయం, పేరూరులోని ధర్మరాజుల ఆలయం జలమయమయ్యాయి.
నిండుకుండలా జలాశయాలు
జిల్లాలోని ఆరణియార్, కాళంగి, కృష్ణాపురం, ఎన్టీఆర్, కల్యాణి, బహుదా, పెద్దేరు జలాశయాల కు భారీగా వరద నీరు చేరింది. రిజర్వాయర్లన్నీ పూర్తిగా నిండడంతో అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. అలాగే, స్వర్ణముఖి నది, నక్కలవంక వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. సత్యవేడు నియోజకవర్గంలోని కేవీబీపురం మండలం తిమ్మసముద్రం వద్ద దుప్పుటేటి కాలువ, జిల్లాలోని గార్గేయనది, బహుదా నది, బుగ్గకాలువ, కౌండిన్య నది పోటెత్తాయి. శ్రీకాళహస్తి, సత్యవేడు, చంద్రగిరి, పూతలపట్టు, గంగాధర నెల్లూరు, పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాల పరిధిలో రాకపోకలు నిలిచిపోయాయి. పలుచోట్ల కల్వర్టులు దెబ్బతిన్నాయి. తిరుచానూరు–పాడిపేట మార్గంలోని స్వర్ణముఖి నది పొంగి ప్రవహిస్తుండడంతో తిరుపతి–పుత్తూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తిరుపతి–వైఎస్సార్ కడప జిల్లా రహదారిలోని బాలపల్లె, కుక్కలదొడ్డి వద్ద కూడా ఇదే పరిస్థితి. కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు రాత్రంతా ఇబ్బందులు పడ్డారు.
తిరుమల బైపాస్ రోడ్డు కొర్లగుంటను చుట్టుముట్టిన వరదనీరు
వైఎస్సార్, అనంత,నెల్లూరు జిల్లాల్లో..
వైఎస్సార్ జిల్లానూ వర్షం ముంచెత్తింది. వెలిగల్లు, అన్నమయ్య, పింఛా, బుగ్గవంక, మైలవరం తదితర ప్రాజెక్టుల నుంచి పెద్దఎత్తున వరద నీటిని దిగువకు వదిలారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. కడప మండలం పాలెంపల్లెకు చెందిన శేఖర్‌రెడ్డి అనే వ్యక్తి ఎద్దుల బండిలో ఇసుకను తీసుకొస్తుండగా వరద ఉధృతికి బండి కొట్టుకుపోయింది. గాలివీడు మండలంలో ద్విచక్ర వాహనదారుడు కొట్టుకుపోతుండగా స్థానికులు కాపాడారు. అనంతపురం జిల్లాలోని కదిరి, పుట్టపర్తి, పెనుకొండ, హిందూపురం, ధర్మవరం, అనంతపురం డివిజన్ల పరిధిలో భారీ వర్షపాతం నమోదైంది. చిత్రావతి, కుశావతి నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోనూ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతితో సోమశిల జలాశయం 11గేట్లు ఎత్తి రెండు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నెల్లూరు నగరంలోనూ భారీ వర్షం కురుస్తోంది. డ్రైనేజీలు పొంగి ప్రవహిస్తున్నాయి. కాలనీల్లో ఇళ్ల చుట్టూ పెద్దఎత్తున నీరు చేరింది.
చంద్రబాబు ఇంట్లోకి వరద నీరు
భారీ వర్షానికి మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్వగ్రామమైన నారావారిపల్లిలోని ఆయన నివాసం జలమయమైంది. విషయం తెలుసుకున్న ఆయన బంధువులు హుటాహుటిన మోటార్ల సాయంతో నీటిని బయటకు పంపుతున్నారు.
రైళ్లు ఆలస్యం.. బస్సులు నిలుపుదల
వర్షంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ప్రధానంగా తిరుపతి నుంచి రైల్వే కోడూరు మార్గంలో వెళ్లే పలు రైళ్లు గంటకు పైగా ఆలస్యంగా నడుస్తున్నాయని తిరుపతి స్టేషన్ డైరెక్టర్ సత్యనారాయణ గురువారం రాత్రి తెలిపారు. ప్రధానంగా మామండూరు, బాలపల్లి సమీపంలో రైల్వే ట్రాక్‌పై వరదనీరు ప్రవహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తాయని వెల్లడించారు. ఆయా రైల్వేస్టేషన్లలోని ప్రయాణికులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ను పెద్దఎత్తున డ్రైనేజ్ నీరు ముంచెత్తింది. ఇక వర్షంతో రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో పలు మార్గాల్లో ఆర్టీసీ సర్వీసులను నిలుపుదల చేసినట్లు తిరుపతి అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ డీఆర్ నాయుడు తెలియజేశారు. ప్రధానంగా తిరుమలకు వెళ్లే సర్వీసులను సాయంత్రం నాలుగు గంటల నుంచే నిలుపుదల చేశామన్నారు.
వైఎస్సార్ జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం రెడ్డివారిపల్లె వంతెనపై ప్రవహిస్తున్న వరద నీరు
వరదలో తిరుమల మాడ వీధులు
ఇక తిరుమలలోనూ ఎడతెరిపిలేని వర్షం కారణంగా నాలుగు మాడవీధుల్లో పెద్దఎత్తున వరద నీరు చేరుకుంది. శ్రీవారి ఆలయం వెనుక భాగంలో ఉన్న మ్యూజియం వద్దకు కొండ ప్రాంతం నుంచి పెద్దఎత్తున వరద నీరు ప్రవహిస్తోంది. ఆ వరద మొత్తం లడ్డూ కౌంటర్ వద్ద నుంచి నాలుగు మాడవీధుల్లోకి చేరుకుంది. దీంతో మాడవీధుల్లో పెద్దఎత్తున బురద పేరుకుపోయింది. క్యూలైన్లలో కూడా పెద్దఎత్తున వరద నీరు చేరింది. అయితే, శ్రీవారి ఆలయం సమీపంలో నీరు త్వరగా వెళ్లిపోయే మార్గాలు ఉండడంతో అక్కడ ఈ పరిస్థితి ఏర్పడలేదు. అదే విధంగా తిరుమలలోని ఆర్జిత సేవ కార్యాలయంలోకి నీరు ప్రవహించడంతో సర్వర్లన్నీ స్తంభించిపోయాయి. అదేవిధంగా అదనపు ఈఓ ధర్మారెడ్డి క్యాంప్ కార్యాలయం పూర్తిగా నీటమునిగింది.
మరోచోట గోడకూలి రమణ అనే వ్యక్తి పైన పడడంతో అతనికి స్వల్ప గాయాలయ్యాయి. మరోవైపు.. తిరుమలలోని 10 ప్రాంతాల్లో విరిగిపడిన కొండచరియలను తొలగిస్తున్నారు. ఘాట్ రోడ్డు మొత్తం వరద నీరు ఉ«ధృతంగా ప్రవహిస్తోంది. నడకదారులను శుక్రవారం కూడా మూసివేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఘాట్ రోడ్డును ఎప్పుడు తెరిచేది తర్వాత చెబుతామని వెల్లడించింది. తిరుమల శ్రీవారి దర్శనం టికెట్లు కలిగి ఉండి వర్షాల కారణంగా వెళ్లలేకపోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతిస్తామని చెప్పింది. అలాగే, శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన భక్తులకు వసతి ఏర్పాట్లు కూడా చేసినట్లు వెల్లడించింది. తిరుపతిలోని శ్రీనివాసం, మాధవం రెండు, మూడో సత్రాలకు వెళ్లాలని సూచించింది.
నీట చిక్కుకున్న స్కూల్ బస్సు
32 మంది విద్యార్థులను కాపాడిన స్థానికులు
చిత్తూరు నగరంలో 32 మందితో వెళ్తున్న ఓ స్కూల్ బస్సు నీటిలో చిక్కుకుపోయింది. స్థానికులు హుటాహుటిన స్పందించి ప్రాణాలకు తెగించడంతో పిల్లలంతా క్షేమంగా బయటపడ్డారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండడంతో ఫ్లైఓవర్ కింద ఉన్న సబ్‌వే రోడ్డు 8 అడుగుల లోతు వర్షపునీటితో నిండిపోయింది. ఇక్కడి పరిస్థితిని అంచనా వేయని డ్రైవర్ 32 మంది విద్యార్థులను బస్సులోకి ఎక్కించుకుని ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లకుండా సబ్‌వే నుంచి వెళ్లాడు. నీటి ఉధృతికి ఒక్కసారిగా బస్సు ఇంజిన్ ఆగిపోయింది. బస్సు లోపలకు వర్షపు నీళ్లు చేరుకున్నాయి. దీంతో పిల్లలు భయపడిపోయి సీట్లపైకి ఎక్కి కేకలు పెట్టారు. స్థానికులంతా కలిసి పిల్లల్ని గట్టుపైకి తీసురావడంతో సురక్షితంగా బయటపడ్డారు.
తక్షణ సాయం రూ.వెయ్యి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాధిత జిల్లాల కలెక్టర్లతో గురువారం నిరంతరం సమీక్ష నిర్వహించారు. అవసరమైన చోట్ల వెంటనే సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలని ఆదేశాలు జారీచేశారు. వీటిల్లో అన్నిరకాల వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ ఉన్నవారికి వెయ్యి రూపాయల చొప్పున తక్షణ సహాయం అందించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు నెల్లూరు, చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల కలెక్టర్లతో సమీక్షించిన ఆయన సమావేశాల తర్వాత మరోసారి సమీక్షించారు.
జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు, వాటి ప్రభావాన్ని ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్లు, చెరువుల్లో నీటిమట్టాలను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, తిరుపతిలో పరిస్థితులపై చిత్తూరు కలెక్టర్‌తో వైఎస్ జగన్ మాట్లాడారు. భారీ వర్షాల నేపథ్యంలో తిరుపతిలో సహాయక చర్యల కోసం సంబంధిత శాఖలు వెంటనే కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అవసరమైన మేరకు సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని.. వైద్య, ఆరోగ్య సిబ్బంది తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వీటన్నింటికీ తగినన్ని నిధులు అందుబాటులో ఉన్నాయని, ఎక్కడా రాజీపడాల్సిన అవసరంలేదని సీఎం స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఎప్పటికప్పుడు తనకు వివరాలు అందించాలని.. ఏం కావాలన్న వెంటనే కోరాలని, తాను నిరంతరం అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు. ఆయా విభాగాలకు చెందిన శాఖాధిపతులు పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ తగిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించుకుని సహాయక చర్యలు చేపట్టాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment