సాక్షి, హైదరాబాద్/ సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా వానలు కొనసాగుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ఉమ్మడి రంగారెడ్డి, మెదక్, హైద రాబాద్ జిల్లాల్లో దంచికొడుతున్నాయి. వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండి అలుగు పారుతున్నాయి. ముఖ్యంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి కురిసిన కుండపోత వాన గ్రేటర్ హైదరాబాద్, శివారు ప్రాంతాలను వణికించింది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో మరో మూడురోజులు వర్షాలు కొన సాగుతాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
దంచికొట్టి.. వణికించి..
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ఎడతెరిపిలేకుండా కురిసిన వాన జన జీవనాన్ని అతలాకుతలం చేసింది. లోత ట్టు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. ఇళ్లు, అపార్ట్‌మెంట్లలోకి వరద నీరు చేరింది. రోడ్లు చెరువులను తలపించాయి. పలుచోట్ల రోడ్లపై వరద ఉధృతికి వాహనాలు కొట్టుకుపోయాయి. మియాపూర్‌లో మంగళవారం తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ఐదు గంటల్లోనే ఏకంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరిగి మధ్యాహ్నం వరకు మరో 5.9 సెంటీమీటర్లు వాన పడినట్టు వాతావరణశాఖ ప్రకటించింది.
రాజేంద్రనగర్, అత్తాపూర్ డివిజన్ల పరిధిలో పిల్లర్ నంబర్ 193 ప్రాంతం, శివరాంపల్లి, నేషనల్ పోలీస్ అకాడమీ ప్రాంతాల్లో రోడ్డుపై వరద నిలిచి రాకపోకలు స్తంభించాయి. మణికొండలోని పంచవటి కాలనీలో వరద రోడ్డును ముంచెత్తింది. మంచిరేవుల వద్ద చిన్న గుట్టపై నుంచి బండరాళ్లు దొర్లి ఓఆర్‌ఆర్ సర్వీస్‌రోడ్డుపైకి వచ్చాయి. ఇక భారీ వర్షం కారణంగా హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు.
స్తంభించిన ట్రాఫిక్‌తో యాతన
కొన్ని ప్రధాన రహదారులపై మోకాలి లోతు నీళ్లు నిలవడంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. కొంత దూరం ప్రయాణించడానికి కూడా అరగంట, గంట సమయం పట్టడంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకుపోయాయి. బేగంపేట, పంజాగుట్ట, మాదాపూర్, దుర్గం చెరువు, మినిస్టర్ రోడ్డు, టోలీచౌకి, భరత్‌నగర్ ఫ్లైఓవర్, ఎల్‌బీ నగర్, మేడ్చల్, సుచిత్ర, బోయిన్‌పల్లి, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, మాదాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, ఐకియా తదితర మార్గాల్లో ఈ దుస్థితి కనిపించింది. మధ్యాహ్నం తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడింది.
జంట జలాశయాల గేట్లు ఎత్తివేత
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో భారీ వర్షాలతో పలు చెరువులు అలుగుపోస్తున్నాయి, వాగులు పొంగుతున్నాయి. దీనితో ఈసీ, మూసీ నదులకు వరద పోటెత్తింది. దీనితో జంట జలాశయాలు ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ నిండు కుండల్లా మారాయి. ప్రాజెక్టుల గేట్లు ఎత్తి 5వేల క్యూసెక్కులకుపైగా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. మూసారాంబాగ్ వంతెన వద్ద వరద మట్టం పెరగడంతో తాత్కాలికంగా రాకపోకలను నిలిపివేశారు.
ప్రొక్లెయినర్లతో విద్యార్థులను తరలించి..
భారీ వర్షాలు, వరదతో గ్రేటర్ హైదరాబాద్ శివార్లలోని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడలో ప్రైవేటు హాస్టళ్లను నిర్వహిస్తున్న సుమారు 15 అపార్ట్‌మెంట్లు జల దిగ్బంధమయ్యాయి. విద్యార్థులంతా హాస్టళ్లలో చిక్కుకుపోవడంతో భయాందోళన వ్యక్తమైంది. అధికారులు ప్రొక్లెయినర్ల సాయంతో హాస్టళ్లలోని విద్యార్ధులను బయటికి తరలించారు.
మరో మూడు రోజులూ భారీ వర్షాలు
వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లోని ఆవర్తన ప్రభావంతో దక్షిణ ఒడిశా, ఉత్తర ఏపీ తీరంలో అల్పపీడనం ఏర్పడిందని.. దాని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఇక మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సగటున 3.2 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వెల్లడించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా మంచిప్పలో 15.75, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దలింగాపురంలో 15.35, జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు తెలిపింది. మొత్తంగా ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రంలోని 21 జిల్లాల్లో అత్యధికంగా, 12 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైనట్టు వెల్లడించింది.
కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్‌లు: సీఎస్
మూడు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు చేపట్టాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి జిల్లా కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయాలని.. అగ్నిమాపక, పోలీసు బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
సీఎస్ మంగళవారం కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటికే వివిధ జిల్లాల్లో చెరువులు, కుంటలు నిండి ఉన్నాయని.. వాటికి గండ్లు పడకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాగులు ఉధృతంగా ప్రవహించే కాజ్ వేలు, కల్వర్టులు, వంతెనల వద్ద ముందుజాగ్రత్త చర్యగా భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
దంచికొట్టిన వాన
Published Wed, Sep 6 2023 1:37 AM | Last Updated on Wed, Sep 6 2023 4:46 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment