
'అధికారులకు, 108కు ఫోన్ చేసినా పట్టించుకోలేదు'
అమలాపురం : గెయిల్ అధికారుల తీరుపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ పైప్లైన్ బలహీనపడిందని, అందుకే ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. చాలాసార్లు లీకులు వస్తున్నాయని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని వారు ధ్వజమెత్తారు. ఈ దుర్ఘటనపై వెంటనే దర్యాప్తు చేసి కారకులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
పైప్లైన్ను రెండు నెలలుగా మరమ్మతు చేస్తున్నారని, అయితే పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయలేదని స్థానికులు తెలిపారు. లీకు రాకుండా అధికారులు శ్రద్ధ పెట్టలేదన్నారు. ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరిగిందని, పేలుడు జరగగానే భయంతో పరుగులు తీశారన్నారు. అయిదు కిలోమీటర్ల వరకూ పేలుడు శబ్ధం వినిపించిందన్నారు. పేలుడు సంభవించిన వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి, అధికారులకు ఫోన్ చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక పోలీసు డీఎస్పీ అధికారి మాత్రమే స్పందించారని స్థానికులు వెల్లడించారు. ఆయన మాత్రమే ఘటనాస్థలానికి చేరుకున్నారన్నారు. తమ కళ్ల ఎదుటే చాలామంది మృత్యువుతో పోరాడారని, అయితే తాము ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయామన్నారు.
గ్రామం మధ్యలో ఉన్న పైప్లైన్ను తక్షణమే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. లేకుంటే తాము ఊరు విడిచి పోవాల్సిన ఉంటుందన్నారు. పైప్లైనును మార్చకపోవటమే ప్రమాదానికి కారణమన్నారు. రిఫైనరీకి కూతవేటు దూరంలో ప్రమాదం జరిగే ఆస్కారం ఉన్నా అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. బయట అధికారులు వచ్చేంతవరకూ కూడా గెయిల్ అధికారులు పట్టించుకోలేదన్నారు. హోటల్లో టీ పెట్టడానికి స్టౌ వెలిగించాలని ప్రయత్నించడంతో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయన్నారు. ప్రమాదం తర్వాత ఏర్పడ్డ కాలుష్యంతో చుట్టుపక్కల గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయని తెలిపారు. ప్రజలకు భరోసా ఇచ్చేంతవరకూ పనులు నిలిపి వేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.