పేలుడు ఘటన దురదృష్టకరం: చంద్రబాబు
న్యూఢిల్లీ : గెయిల్ పైప్లైన్ పేలుడు ఘటన చాలా దురదృష్టకరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పేలుడు ఘటనలో 14మంది చనిపోవటం బాధాకరమన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఢిల్లీ పర్యటన రద్దు చేసుకుని ఘటనాస్థలానికి వెళుతున్నట్లు చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ సంఘటనపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించామన్నారు. తనతో పాటు పెట్రోలియం శాఖమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఘటనా స్థలానికి వస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని, మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.