గోవిందా..గోవిందా !
Published Tue, Jan 21 2014 11:54 PM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు: దేవుడిని నమ్ముకొంటే కోరికలు నెరవేరతాయి. అదే దేవుడిని అమ్ముకొంటే లాభ పడవచ్చనే దురాలోచనతో జిల్లాలో విగ్రహాల దొంగల ముఠా సంచరిస్తుంది. పురాతన ఆలయాల్లోని పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా ఈ ముఠా పనిచేస్తున్నట్టు సమాచారం. గతంలో అనేక ప్రాంతాల్లో దేవుడి విగ్రహాలు మాయం కావడంపై ఫిర్యాదులు వున్నప్పటికీ, అసలు దొంగలెవరనేది పోలీసులు తేల్చలేక పోయారు. తాజాగా ఫిరంగిపురంలో ఒక ముఠా సభ్యులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మూడు రోజుల కిందట ఫిరంగిపురంలో తెల్లవారుజామున అలజడి రేగింది. గ్రామంలో పోలేరమ్మ దేవాలయంలో ఉన్న భద్రకాళీ అమ్మవారి విగ్రహాన్ని ఎత్తుకెళ్తున్న ఇద్దర్ని స్థానికులు పట్టుకున్నారు. భారీ బరువు ఉన్న రాతి విగ్రహాన్ని బైక్‌పై తీసుకు వెళ్లే ప్రయత్నంలో దొరికిపోయారు. వీరిలో సత్తెనపల్లి మండలం కంటెపూడి గ్రామానికి చెందిన వ్యక్తి ఒకరు, మరొకరు ఫిరంగిపురం మండలం బేతపూడికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరు ఇచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరంతా ఉదయం పోలేరమ్మ దేవాలయాన్ని సందర్శించి రాత్రికి విగ్రహాన్ని పలుగు,పారలతో పెకిలించినట్లు తెలిసింది. రెడ్డిరాజుల కాలంనాటి ఈ రాతి విగ్ర హంలో బంగారం, విలువైన వజ్రాలు (రాతి మధ్యన రంధ్రం చేసి ఉంచుతారని) ఉంటాయని ఇలాంటి విగ్రహాలను పగులకొట్టి వజ్రాలు, బంగారాన్ని కాజేయాలని ముఠా పన్నాగంగా తెలుస్తోంది.
పల్నాడులో విగ్రహాలు మాయం..
మూడేళ్ల కిందట నరసరావుపేటలో బేల్దారి సామగ్రి అద్దెకిచ్చే వ్యక్తి అందించిన సమాచారంతో విలువైన పంచలోహ విగ్రహాన్ని పోలీసులు పట్టుకున్నారు. గుంటూరు, ప్రకాశం జిల్లా సరిహద్దులో వున్న ఓ పురాతన ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని తవ్వేందుకు బేల్దారి సామగ్రి దుకాణం నుంచి పలుగులు, పారలు తీసుకెళ్లారు. చాలారోజుల వరకు వాటిని తిరిగి అప్పగించకుండా, అద్దె చెల్లించ కుండా ఆలస్యం చేయడంతో ముఠా గుట్టు పోలీసులకు తెలిసింది. అప్పట్లో అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి మేరకు ఆ ముఠా సభ్యులను పోలీసులు వదిలేసినట్లు దుమారం రేగింది. అదేవిధంగా ఏడాది కిందట బొల్లాపల్లి మండలం చక్రాయపాలెం సుగాలితండాలో ఒక అరుదైన పంచలోహ విగ్రహాన్ని అమ్ముకోవాలనే ప్రయత్నంలో స్థానికుల ఘర్షణ పోలీసుల దృష్టికెళ్లింది. విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని ఆరాతీయగా, ఆ ఇద్దరు సత్తెనపల్లిలో మట్టిపని కెళితే పంచలోహ విగ్రహం దొరికిందని చెప్పారు. విగ్రహాన్ని స్వాధీనం చేసుకున్నపోలీసులు కేసు నమోదు చేసి వినుకొండ కోర్టుకు సమర్పించారు. మాచర్ల, దాచేపల్లితో పాటు కోటప్పకొండ ప్రాంతంలో గతంలో రాతి విగ్రహాలు మాయమైనట్టు ఫిర్యాదులున్నాయి. ప్రకాశం, గుంటూరు జిల్లాలకు చెందిన వ్యక్తులు ముఠాగా ఏర్పడి పంచలోహ విగ్రహాలే లక్ష్యంగా సంచరిస్తున్నట్టు సమాచారం.
25న కాంట్రాక్ట్ అధ్యాపకుల
చలో హైదరాబాద్
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల ఉద్యోగ భద్రత డిమాండ్ చేస్తూ రాష్ట్ర కాంట్రాక్ట్ అధ్యాపక సంఘ కార్యదర్శి కె.సురేష్ పిలుపు మేరకు ఈనెల 25న చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ధ జరిగే సంకల్ప దీక్షకు జిల్లాలోని 21 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు తరలిరావాలని కోరారు.
Advertisement
Advertisement