సాక్షి, అనంతపురం: తన భర్తకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అనుచిత పోస్టింగ్స్ పెట్టిన టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు మద్దెలచెరువు సూరి సతీమణి గంగుల భానుమతి ఫిర్యాదు చేశారు. అనంతపురం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబును కలిసి గురువారం ఈ మేరకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... పరిటాల రవి చాలా మంచివాడని తన భర్త అన్నట్టుగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారని తెలిపారు. తెలుగు దేశం పార్టీ అంటే తనకు ప్రాణం అని మద్దెలచెరువు సూరి పేర్కొన్నట్టుగా తప్పుడు రాతలు రాశారని వాపోయారు. తన భర్తను దుర్మార్గంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల కుటుంబం కారణంగా ఎంతో మందిని కోల్పోయామన్నారు. తన కుటుంబంపై సోషల్ మీడియాలో అబద్దాలు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన ఫిర్యాదుపై ఎస్పీ సానుకూలంగా స్పందించారని, బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హామీయిచ్చారని వెల్లడించారు.
వైఎస్సార్‌సీపీ నేతపై ఎస్సై దౌర్జన్యం
పరిటాల సునీత వర్గీయులపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నాయకుడిపై రామగిరి ఎస్సై హేమంత్ దురుసుగా ప్రవర్తించారు. రామగిరిలో పెట్టిన ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ఫ్లెక్సీలను మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు చించివేశారు. దీనిపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వైఎస్సార్ సీపీ నేతకురుబ ముత్యాలుపై ఎస్సై హేమంత్ దౌర్జన్యం చేశారు. ఎస్సై వైఖరికి నిరసనగా పోలీస్‌స్టేషన్ వద్ద వైఎస్సార్ సీపీ కార్యకర్తల ధర్నాకు దిగారు. పరిటాల వర్గీయుల కనుసన్నల్లో ఎస్సై హేమంత్ పనిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment