ఏయూ లా కాలేజీ దత్తత తీసుకున్న గంటా
విశాఖపట్నం: ఆంధ్ర యూనివర్శిటీ లా కాలేజీని దత్తత తీసుకుంటున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఆదివారం విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్శిటీ క్యాంపస్లో గంటా మాట్లాడుతూ... లా కాలేజీని మోడల్ క్యాంపస్గా తీర్చిదిద్దుతానని తెలిపారు. ప్రతి ఏటా పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. హుదూద్ తుపాన్ నేపథ్యంలో ఆంధ్ర యూనివర్శిటీకి రూ. 3 కోట్లు విరాళాలు అందాయని వెల్లడించారు. హుదూద్ తుపానును జయించిన సందర్భంగా ప్రతి ఏటా అక్టోబర్ 12న రాష్ట్ర ప్రభుత్వం సంబరాలు నిర్వహించనుందని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏయూ వీసీ జీఎస్ఎన్ రాజు మాట్లాడుతూ... యూనివర్శిటీ క్యాంపస్లో 90 శాతం విద్యుత్ పునరుద్ధరించినట్లు తెలిపారు. విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించామన్నారు. రేపటి నుంచి తరగతులు ప్రారంభమవుతాయని వెల్లడించారు. యూనివర్శిటీ కోసం పూర్వ విద్యార్థులు సహాయం అందించాలని ఈ సందర్భంగా వీసీ విజ్ఞప్తి చేశారు.