
మళ్లీ గవర్నర్ ను కలుస్తా: మంత్రి గంటా
సర్దుకుపోవాలని ఎన్నివిధాల ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు.
హైదరాబాద్: సర్దుకుపోవాలని ఎన్నివిధాల ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం గవర్నర్ నరసింహన్ ను కలిసిన తర్వాత ఆయన విలేకరులతో మట్లాడారు. విభజన చట్టం ప్రకారం ఉమ్మడి అడ్మిషన్ల స్ఫూర్తి ఉన్నా తమ పరీక్షలు తమిష్టం అన్నట్టుగా వ్యవహరిస్తోందని విమర్శించారు.
గవర్నర్ ఇచ్చిన మూడు ఆప్షన్లకు తాము సిద్ధంగా ఉన్నా తెలంగాణ సర్కారు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలికి చట్టబద్దత లేదని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబుతో మాట్లాడిన తర్వాత మళ్లీ గవర్నర్ ను కలుస్తానని చెప్పారు. విభజన చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని గంటా డిమాండ్ చేశారు.