రైల్వే న్యూకాలనీ ప్రాథమిక పాఠశాల వద్ద బూత్ మూసినందుకు నిరసనగా ఓటర్లతో కలసి ధర్నా చేస్తున్న ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేకే రాజు
విశాఖసిటీ: నోట్ల కట్టలతో ఓట్లు కొంటూ రాజకీయాలకు పాల్పడిన టీడీపీ ఉత్తర నియోజకవర్గ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అనుచరులు.. చివరి రోజు సైతం అదే పంథా కొనసాగించారు. తాయిలాలతో ఓట్లు రాలట్లేదని నిర్థరించుకున్న ఉత్తర నియోజకవర్గ టీడీపీ నాయకులు.. ఆఖరి బ్రహ్మాస్త్రంగా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసే స్థితికి దిగజారారు.
కుటిల రాజకీయాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చారు టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పోటీ చేసిన ప్రతి చోటా ప్రజలను పట్టించుకోని గంటా.. కేవలం నోట్లతో ఓట్లు కొనొచ్చనే దుస్సంప్రదాయాన్నే అలవర్చుకున్నారు. పోటీ చేసిన చోట ఇక గెలవలేమని తెలిస్తే మాత్రం సామదాన బేధ దండోపాయాలను ఉపయోగించి.. ప్రజాస్వామ్యం ఓడిపోయినా ఫర్వాలేదు.. తమ నేత నెగ్గాలనీ.. పదవీ కాంక్షతో అరాచక రాజకీయాలకు తెరతీసే ప్రయత్నాలూ చేస్తారు. ఈ ఎన్నికల్లోనూ సరిగ్గా అదే తరహాలో వ్యవహరించారు టీడీపీ నేతలు. ఏ ఇంటి గడప తొక్కకుండా, ఎవరినీ అభ్యర్థించకుండా.. గంప గుత్తగా ఓట్లను కొనుగోలు చేసేసిన గంటా వర్గీయులు.. పోలింగ్‌కు ముందురోజూ అదే దుర్నీతి కొనసాగించారు. రాంజీ ఎస్టేట్ ప్రాంతంలో ఉన్న మూడు పోలింగ్ బూత్‌లను బుధవారం రాత్రి రూ.4 కోట్లకు బేరం పెట్టేశారు. అపార్ట్‌మెంట్, రేకులషెడ్, పక్కా ఇల్లు, పూరిగుడిసెలు.. ఇలా వర్గాలుగా విభజించి.. ఓట్లను బేరం పెట్టేశారు.
అయితే.. పోలింగ్ మొదలైన సమయంలో ఆ ప్రాంతమంతా వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీకి అనుకూలమని తెలిసిన తర్వాత టీడీపీ వర్గీయులు తమ అసలు రంగుని బయటపెట్టారు. అప్పటి వరకూ తనకు అనుకూలంగా ఓట్లు పడటం లేదని గ్రహించిన గంటా బ్యాచ్.. అక్రమాలకు తెరతీశారు. 209, 204 పోలింగ్ బూత్‌ల వద్ద పోలింగ్ కేంద్రానికి రాకుండా మధ్యాహ్నం వరకూ అడ్డుకున్నారు. ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశారు. చివరకు.. ధైర్యం చేసి ఓటు హక్కు వినియోగించుకునేందుకు సాయంత్రం సమయంలో ప్రజలంతా ఒక్కసారిగా బయటకు రావడంతో పోలింగ్ కేంద్రం కిక్కిరిసిపోయింది. ఆ సమయంలోనూ.. పోలింగ్ బూత్‌లోకి గంటా అనుచరులు చొచ్చుకుపోయారు. సైకిల్ గుర్తుకే ఓటు వెయ్యాలంటూ ఓటర్లను బెదిరింపు ధోరణులతో హెచ్చరికలు జారీ చేశారు. దీంతో.. కొంతమంది ఓటు వెయ్యకుండానే వెనుదిరిగిన పరిస్థితులు దాపురించాయి.
34వ వార్డులోనూ అదే పరిస్థితి
తనకు అనుకూలంగా లేని వార్డుల్లో టీడీపీ అనుచరగణం రెచ్చిపోయింది. పోలింగ్ బూత్‌ల వద్ద అక్రమాలకు తెరతీశారు. ఓటర్లను సాయంత్రం వరకూ బయటకు రానీకుండా చేసి.. పోలింగ్ గడువు ముగుస్తుందన్న సమయంలో బయటకు వచ్చిన ఓటర్లకు ఓటు హక్కు వినియోగించనీకుండా చేసిన ఘనతనూ మూటగట్టుకున్నారు టీడీపీ వర్గీయులు. 34వ వార్డు ప్రజలకు 31వ వార్డులోని రైల్వే న్యూ కాలనీ జీవీఎంసీ ప్రైమరీ స్కూల్‌లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చారు. దీంతో ఆ స్కూల్‌లో ఓటర్ల సంఖ్య పెరిగిపోయింది. ఎన్నికల విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు బెదిరించడంతో.. అక్కడికి చేరుకున్న ప్రజల్ని గేటు బయటకు పంపించి.. ఖాళీ అయిన తర్వాత పిలుస్తామని చెప్పడంతో.. ఓటర్లంతా గేటు బయటకు వచ్చేశారు. కానీ... ఆరు గంటల తర్వాత గేట్లను మూసి వేసి.. ఓటు వేసే అవకాశం లేదని చెప్పడంతో.. చాలా మంది ఓటర్లు నినదించారు. ఇలా తెలుగుదేశం పార్టీ నేతలు.. తమ దిగ జారుడు రాజకీయాల్ని ఆఖరి నిమిషం వరకూ కొనసాగించారు. పదవి కోసం.. ఎలాంటి పనికైనా ఒడిగడతారని మరోసారి నిరూపించారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేకే రాజు పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేసేందుకు అవకాశం ఇవ్వాలని అధికారులను కోరినా ఫలితం లేకపోయింది.
ఓటర్లకు మద్దతుగా కేకేరాజు ధర్నా
తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): రైల్వే న్యూకాలనీ బూత్ నెంబర్ 58 వద్ద పలువురి ఓటర్లకు ఓటు వేయడానికి అవకాశం కల్పిం చక పోవడంతో వైఎస్సార్‌సీపీ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి కె.కె.రాజు బూత్ దగ్గరకు చేరుకున్నారు. ఇక్కడ ఉదయం నుంచి నానా ఇబ్బందులు పడ్డామని ఓటర్లు ఆయనకు తెలిపారు. చాలామంది మహిళలు చీరలు చిరిగిపోయి, ఒళ్లంతా గాయాలై చాలా కష్టాలు పడినట్లు వివరించారు. బూత్‌లు చిన్నవి కావడంతో ఊపిరాడక సాయంత్రం వేళ అందర్నీ బయటికి పంపించేసినట్లు తెలిపారు. మరళా లోనికి అనుమతిస్తామని చెప్పి, 6 గంటలకు కేవలం 250మందిని మాత్రం లోనికి పంపి, సుమారు 200 మందిని బూత్ బయటే నిలిపేయడంతో వీరంతా పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇదంతా తెలుగుదేశం వారి పనేనని, వైఎస్సార్‌సీపీ ఓటర్లు ఎక్కువగా ఉన్న రామచంద్రనగర్, చిట్టిబాబుకాలనీ వాసులు ఎవరూ ఓటేయలేదని కె.కె.రాజుకు తెలిపారు. దీని విషయమై కె.కె.రాజు వెంటనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. రాత్రి 9 గంటల వరకు అక్కడే ఓటర్లు నిరీక్షించినా ఫలితం దక్కలేదు. కె.కె.రాజు మీడియాతో మాట్లాడుతూ అప్రజాస్వామికంగా, అడ్డదారుల్లో గెలవాలని ఇక్కడ టీడీపీ అభ్యర్థి నానా ప్రయత్నాలు చేస్తున్నారని,అందులో భాగంగానే ఓటర్లను బయటకు పంపేశారని ఆరోపించారు. దీనిపై ఓటర్ల తరఫున న్యాయపోరాటం చేస్తామని, రీపోలింగ్ జరిపేలా చూడాలని కోరతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment