=సుదీర్ఘకాలం తర్వాత జిల్లాకు వచ్చిన జననేతకు ఘనస్వాగతం
=అభిమాన నేతను చూసేందుకు బారులుతీరిన జనం
=జోరువానను లెక్కచేయని వైనం
=అధికారంలోకి రాగానే పింఛన్ పెంపుపై తొలి సంతకం చేస్తానని జగన్ హామీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ : ప్రజాభిమానం ముందు తీవ్ర చలిగాలులు, వర్షం సైతం వెలవెలబోయాయి. సుదీర్ఘ కాలం తర్వాత తమ ప్రాంతానికి వచ్చిన జననేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. రోడ్డుపైకి వచ్చిన జనం వైఎస్ జగన్‌కు తమ కష్టాలు వెళ్లబోసుకున్నారు. వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యులు, జెడ్పీ మాజీ చైర్మన్ కేఎన్నార్ హఠాన్మరణానికి తీవ్ర దిగ్భ్రాంతికి గురైన జగన్ శుక్రవారం ఉదయం హైదరాబాద్ నుంచి నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో గుడివాడకు చేరుకున్నారు.
పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పార్టీ గుడివాడ నియోజకవర్గ సమన్వయకర్త కొడాలి నాని నివాసం వద్దకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలను ఆయన ఆప్యాయంగా పలుకరించారు. జగన్‌తో కరచాలనం చేసేందుకు, ఫొటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీపడ్డాయి.
తమ కష్టాలు వివరించిన వృద్ధ మహిళలు దుర్భర జీవనం అనుభవిస్తున్న వృద్ధులు, వికలాంగులకు ప్రభుత్వ పింఛను మొత్తాన్ని పెంచుతూ తమ ప్రభుత్వం రాగానే తొలి సంతకం చేస్తామని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. గుడివాడ నుంచి కోసూరు వెళ్లే మార్గంలో పామర్రు, పరిసర గ్రామాలలో రోడ్డుకిరువైపులా బారులుదీరి స్వాగతం పలికిన ప్రజలను ఆయన ఆప్యాయంగా పలకరించారు.
ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, తమ కుటుంబాలు తీవ్ర కష్టాల్లో ఉన్నాయని పలువురు వృద్ధ మహిళలు జననేతకు తమ బాధను వెళ్లబోసుకున్నారు. వార్ని ఓదార్చుతూ ఆర్నేల్లు ఓపికపట్టాలని, త్వరలోనే రాజన్న రాజ్యం వస్తుందని, ఆ సువర్ణయుగంలో అందరికీ మేలు కలుగుతుందని జననేత భరోసా ఇచ్చారు. వృద్ధులు, వికలాంగులను ఆదుకునేందుకు పింఛను మొత్తాన్ని పెంచుతూ తొలి సంతకం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆ మహిళలు ‘మా కోసం ఆలోచించే నీవు చల్లగా ఉండాలయ్యా’ అంటూ నిండు మనస్సుతో దీవించారు.
ఎన్టీఆర్ సొంతగడ్డలో అపూర్వస్వాగతం..
మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులో జగన్‌మోహన్‌రెడ్డికి అపూర్వస్వాగతం లభించింది. కోసూరు వెళ్లేందుకు నిమ్మకూరు మీదుగా జగన్‌మోహన్‌రెడ్డి కాన్వయ్ సాగింది. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ బంధువు నందమూరి పెద్దవెంకటేశ్వరరావు, చిగురుపాటి మురళీ స్వయంగా వచ్చి జగన్‌మోహన్‌రెడ్డిని తమ ఇంటికి రావాలని ఆహ్వానించారు. దీంతో మురళీ ఇంటికి వెళ్లిన జగన్‌మోహన్‌రెడ్డి అక్కడే ఆ ఊరి ప్రజలను ‘బాగున్నారా?’ అంటూ పలకరించారు.
గుడివాడ నుంచి కోసూరు వరకూ, అక్కడ నుంచి గన్నవరం దాకా దారి పొడవునా ప్రజలు పెద్ద ఎత్తున బారులు తీరి జగన్‌మోహన్‌రెడ్డికి స్వాగతం పలికారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా తన కోసం ఎదురుచూస్తున్న ప్రజలను చూసి కారు దిగి వారి ఆపాయ్యంగా పలకరిస్తూ జగన్ ముందుకు సాగారు. మధ్యాహ్నాం రెండున్నర గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం చేరుకున్న జగన్ హైదరాబాద్ వెళ్లారు.
కేఎన్నార్ మృతి తీరనిలోటు.. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం..
ప్రజలకు సేవ చేసేందుకు తపన పడే కేఎన్నార్ వంటి రాజకీయ నేత మృతి తీరని లోటని, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంచేశారు. మొవ్వ మండలం కోసూరులో కేఎన్నార్ పార్ధివదేహానికి పూలమాల వేసి జగన్ నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్‌గాను, వైఎస్సార్‌సీపీ కేంద్ర పాలకమండలి సభ్యుడిగా కేఎన్నార్ తనదైన ముద్ర వేశారని కీర్తించారు. తమ పార్టీ మంచి నాయకుడ్ని కోల్పోయిందని, ఆయన నిత్యం నవ్వుతూ అందరితోను కలుపుగోలుగా ఉండేవారని జగన్‌మోహన్‌రెడ్డి తన సంతాపం వెలిబుచ్చారు. కేఎన్నార్ సతీమణి కృష్ణకుమారి, తనయులు వెంకట్రామ విద్యాసాగర్, మోహన్‌కుమార్, కుమార్తె సీతాదేవి, అల్లుడు కాశీవిశ్వనాథ్‌లను పరామర్శించి సానుభూతిని వ్యక్తం చేశారు.
జోరువానలో బారులు తీరిన జనాభిమానం.. వెన్నంటి కదిలిన పార్టీ శ్రేణులు..
పార్టీ శ్రేణులు జిల్లాకు వచ్చిన జననేత జగన్ వెన్నంటి నడిచాయి. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను, పార్టీ రాష్ట్ర ప్రోగ్రామింగ్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం, కృష్ణా, గుంటూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆర్కే, మాజీ ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్, మేకా ప్రతాప్‌అప్పారావు, జలీల్‌ఖాన్, వంగవీటి రాధ, ముదునూరి ప్రసాదరాజు, పార్టీ రైతు విభాగం రాష్ట్ర కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డి, డాక్టర్స్ సెల్ కన్వీనర్ డాక్టర్ శివ భరత్‌రెడ్డి, జిల్లాలో వివిధ నియోజకవర్గాల సమన్వయకర్తలు పి.గౌతంరెడ్డి, ఉప్పులేటి కల్పన, ఉప్పాల రామ్‌ప్రసాద్, సింహాద్రి రమేష్, దుట్టా రామచంద్రరావు, దూలం నాగేశ్వరరావు, తాతినేని పద్మావతి, ఉప్పాల రాము, పడమట సురేష్‌బాబు, బండ్రపల్లి వల్లభాయ్, పార్టీ నాయకులు సానికొమ్ము వెంకటేశ్వరెడ్డి, మాదివాడ రాము, కాజా రాజకుమార్, నందమూరు శ్రీనివాసరత్నాకర్, గుడివాక శివరావు, యాసం చిట్టిబాబు, షేక్ సలార్‌దాదా, లాకా వెంగళరావు యాదవ్, తాడి శంకుతల, మండలి హనుమంతరావు తదితరులున్నారు.
అపూర్వం.. ఆత్మీయం..
Published Sat, Nov 23 2013 1:00 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM
Advertisement
Advertisement